ఇదే అద్భుతం..  ఓడితే తిట్టొద్దు.. డెత్‌లో చిత్తు - mumbai vs delhi players responses
close
Published : 06/11/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదే అద్భుతం..  ఓడితే తిట్టొద్దు.. డెత్‌లో చిత్తు

ముంబయి×దిల్లీపై ఎవరి మాటేంటి?

ఇండియన్‌ టీ20 లీగ్‌ తొలి క్వాలిఫయర్‌ పోరు ముగిసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి దుమ్మురేపింది. దిల్లీని చిత్తుచిత్తుగా ఓడించి ఆరోసారి ఫైనల్‌ చేరుకుంది. తమకు ఎదురేలేదని చాటింది. సూర్యకుమార్‌ (51), ఇషాన్‌ కిషన్‌ (55*), క్వింటన్‌ డికాక్‌ (40), హార్దిక్‌ పాండ్య (37*; 14 బంతుల్లో 5×4) వీర విహారం చేయడంతో తొలుత 200/5 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన దిల్లీని బుమ్రా (4/14), బౌల్ట్‌ (2/9) 143/8కే పరిమితం చేశారు. మార్కస్‌ స్టాయినిస్‌ (65), అక్షర్‌ పటేల్‌ (42) విఫల పోరాటం చేశారు. ఇంతకీ ఈ మ్యాచ్‌ గురించి ఎవరెవరు ఏమంటున్నారో చూద్దామా!


ఇదే గొప్ప విజయం: రోహిత్‌

లీగ్‌లో తమకు ఇదే అత్యుత్తమ విజయమని ముంబయి సారథి రోహిత్‌శర్మ అన్నాడు. తమది వైవిధ్యమైన ఆటగాళ్లున్న జట్టని పేర్కొన్నాడు. ‘నేను త్వరగా ఔటైనా డికాక్‌, సూర్యకుమార్‌ గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. ఇదో అద్భుత విజయం. ఎంత లక్ష్యం నిర్దేశించాలని మేమేమీ ఆలోచించలేదు. ఇషాన్‌ కిషన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రెండో టైమ్‌ఔట్‌ తర్వాత అతడికి సానుకూలంగా ఆడాలని సూచించాం. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలని చెప్పాం. మాది వైవిధ్యమైన జట్టు. అందుకే బౌలింగ్‌, బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఎలాగైనా మార్చుకోగలం. బౌల్ట్‌ బాగానే ఉన్నాడు. మూడు రోజుల విశ్రాంతి తర్వాత మైదానంలో అడుగుపెడతాడు. బుమ్రా అద్భుతం. వారిద్దరూ ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేస్తున్నారు’ అని రోహిత్‌ ప్రశంసించాడు.


ఓడినా తక్కువేమీ కాదు: శ్రేయస్‌

ఓడినంత మాత్రాన తమ ఆటగాళ్లను నిందించాల్సిన పనిలేదని దిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ అంటున్నాడు. నిజానికి వారెంతగానో సాధన చేశారని పేర్కొన్నాడు. ‘సానుకూలంగా ఉండటం మంచిది. మేం మళ్లీ బలంగా పుంజుకుంటాం. ముంబయి 102/4తో ఉన్నప్పుడు మేం ఆ సందర్భాన్ని మాకు అనుకూలంగా మలుచుకోవాల్సింది. 170 పరుగులకే పరిమితం చేయాల్సింది. అయితే ప్రతి మ్యాచూ మనదే అవ్వదు. బయోబుడగలో ఉంటూ రోజూ ఒకేలా సమయం గడపటం కష్టం. అయితే మేం ఎంతగానో సాధన చేశాం. ఆటగాళ్లు సన్నద్ధం అయిన విధానాన్ని నేను అభినందిస్తాను. అశ్విన్‌ మా జట్టులో ఉండటం అదృష్టం. అతడు బ్యాట్స్‌మెన్‌ బుర్రలతో ఆడుకున్నాడు. ముంబయి బ్యాట్స్‌మెన్‌ గొప్ప ఫామ్‌లో ఉన్నారు. దిగువ ఆర్డర్‌లో పొలార్డ్‌/పాండ్యకు బంతులు వేయడం ఎంతో కష్టం. తర్వాతి మ్యాచ్‌లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని శ్రేయస్‌ ధీమా వ్యక్తం చేశాడు.


పిచ్‌ బ్యాటింగ్‌కు బాగుంది: సూర్య

క్వాలిఫయర్‌-1లో దుబాయ్‌ పిచ్‌ బ్యాటింగ్‌ చేసేందుకు బాగుందని అర్ధశతక వీరుడు సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు. మంచు కురిసే అవకాశం ఉండటంతో తాము సానుకూలంగా ఉండాలని భావించినట్టు తెలిపాడు. ‘నేను మరికొన్ని ఓవర్లు బ్యాటింగ్‌ చేయాలనుకున్నా. ఏదేమైనా నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. టాప్‌ ఆర్డర్‌లో ఆడేందుకు వెళ్లినప్పుడు ఎక్కువ స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో చివరి దాకా బ్యాటింగ్‌ చేయాల్సిన బాధ్యతా ఉంటుంది. లీగులో 500 పరుగులు చేయడం గురించి ఆలోచించడం లేదు. వ్యక్తిగత రికార్డులు అవసరమే అయినా జట్టు అవసరాలే మరింత ముఖ్యం’ అని సూర్య పేర్కొన్నాడు.


నా పాత్రే నాకు ముఖ్యం: బుమ్రా

జట్టు తనకో కీలకమైన పాత్ర అప్పగించిందని ముంబయి పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అన్నాడు. ఆ పనిని విజయవంతంగా పూర్తిచేయడమే తన కర్తవ్యమని పేర్కొంటున్నాడు. ‘నేను వికెట్లు తీయకపోయినా, మ్యాచులు గెలిపించకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే నాకో పాత్ర అప్పగించారు. దానిని 100% న్యాయం చేయడమే నాకు ముఖ్యం. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే యార్కర్లు వేయడం ముఖ్యం. అందుకే వేశాను. కెప్టెన్‌ ఎప్పుడు బంతినిచ్చినా బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటాను. తుది ఫలితంపై నేను దృష్టి పెట్టను. అలా చేసిన ప్రతిసారీ విఫలమయ్యాను. బౌల్ట్‌తో సహచర్యం బాగుంది. ఫీల్డర్ల మోహరింపు, మ్యాచ్‌ పరిస్థితి గురించి మేం చర్చించుకుంటాం. అప్పుడే నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడూ బ్యాట్స్‌మెనే అవార్డులు తీసుకుంటారు. ఇప్పుడు బౌలర్‌కూ రావడం బాగుంది. అయితే మేం గెలుస్తున్నంత వరకు పురస్కారాల గురించి పట్టించుకోను’ అని బుమ్రా తెలిపాడు.


అస్సలు బాగాలేదు: పాంటింగ్‌

ముంబయితో మ్యాచులో తమ బౌలర్లు ప్రణాళికల ప్రకారం బౌలింగ్‌ చేయలేదని దిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నారు. డెత్‌ ఓవర్లలో ఇంకా కసిగా బంతులు విసరాల్సిందని పేర్కొన్నారు. ‘తొలి ఓవర్లోనే విఫలమయ్యాం. 15-16 పరుగులిచ్చేశాం. ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టుబిగించేందుకు సమయం పట్టింది. 7-14 ఓవర్ల మధ్య ఆట మాకు అనుకూలంగా ఉంది. ముంబయి 120/4తో ఇబ్బందుల్లో పడటంతో 170 లక్ష్యం ఉంటుందని భావించాం. కానీ ఆ తర్వాత బంతులు మైదానం అవతలే పడ్డాయి. చివరి ఐదు ఓవర్లను మేం ఏమాత్రం బాగా వేయలేదు. హార్దిక్‌, కిషన్‌ బంతిని వెంటాడి మరీ బాదేశారు. బుమ్రా బౌలింగ్‌ అద్భుతం. మా కన్నా ముంబయి ప్రణాళికలను చక్కగా అమలు చేసింది. మాపై లీగ్‌లో మూడో విజయం సాధించింది. మరో పోరుకు మాకు రెండు రోజుల సమయం ఉంది. మా ప్రత్యర్థి ఎవరో చూసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మరింత మెరుగవ్వాలి’ అని పాంటింగ్‌ అన్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని