ఏడేళ్ల తర్వాత..
close
Updated : 16/06/2021 04:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడేళ్ల తర్వాత..

టెస్టు బరిలో భారత మహిళలు

నేటి నుంచే ఇంగ్లాండ్‌తో పోరు
బ్రిస్టల్‌

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల జట్టు తిరిగి టెస్టు క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచే ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టు. సరైన సన్నాహం లేకున్నా.. ఇంగ్లాండ్‌లో మెరుగైన రికార్డు భారత జట్టుకు ఉత్సాహాన్నిస్తోంది. భారత్‌, ఇంగ్లాండ్‌లో క్వారంటైన్‌లలో గడిపిన మిథాలీ సేనకు మ్యాచ్‌కు సన్నద్ధం కావడానికి వారం కంటే కాస్త ఎక్కువ సమయం మాత్రమే లభించింది. భారత మహిళలు చివరిసారి 2014లో టెస్టు మ్యాచ్‌ ఆడారు. దక్షిణాఫ్రికాతో ఆ మ్యాచ్‌లో ఆడిన వారిలో మిథాలీ సహా ఏడుగురు ప్రస్తుత జట్టులో ఉన్నారు. కోహ్లి నేతృత్వంలోని పురుషులు జట్టులా కాకుండా.. మహిళల జట్టు నెట్స్‌కే పరిమితమైంది. మ్యాచ్‌ (నాలుగు రోజులు)లో ఇది ప్రతికూలంగా మారవచ్చు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధం కావడానికి తమకు ఎక్కువ సమయం లభించలేదని.. కానీ పురుషుల జట్టు వైస్‌ కెప్టెన్‌ రహానె ఇచ్చిన విలువైన సలహాలతో పూర్తి మానసిక సంసిద్ధతో బరిలోకి దిగుతున్నామని హర్మన్‌ప్రీత్‌ చెప్పింది.
షెఫాలీ అరంగేట్రం: యువ సంచలనం షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేయడం ఖాయం. స్మృతి మంధానతో కలిసి ఆమె ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. టాప్‌ ఆర్డర్‌లో ఆమె చాలా ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. అలవాటు లేని పరిస్థితుల్లో.. అనుభవజ్ఞులైన త్రయం మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌, పూనమ్‌ రౌత్‌ రాణించడం భారత్‌కు ఎంతో అవసరం. అయితే చివరగా టెస్టు మ్యాచ్‌ ఆడి చాలా ఏళ్లయిన నేపథ్యంలో వెటరన్‌ పేసర్లు జులన్‌ గోస్వామి, శిఖ పాండే సుదీర్ఘ స్పెల్స్‌ వేయగలుగుతారా అన్నది చూడాలి. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన స్పిన్నర్లు పుంజుకోవాల్సివుంది. అయితే ఇంగ్లాండ్‌లో రికార్డు భారత్‌కు ఉత్సాహాన్నిచ్చేదే. అక్కడ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒక్కటీ ఓడలేదు. రెండు గెలిచింది. కానీ ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సివర్‌ మాత్రం భారత్‌ నిర్భీతిగా ఆడబోతోందని చెప్పింది. యువ ప్రతిభావంతులు, అనుభవజ్ఞులతో కూడిన ఆ జట్టును ఓడించాలంటే చాలా కష్టపడాలని అంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని