పట్టించుకోవడం లేదని... విషం పెట్టి చంపింది

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:20 IST

పట్టించుకోవడం లేదని... విషం పెట్టి చంపింది

నలుగురు కుటుంబ సభ్యుల మృతికి కారణమైన బాలిక
కర్ణాటకను కుదిపేసిన ఘటన

చిత్రదుర్గం, న్యూస్‌టుడే: ఆ బాలికలో మొగ్గతొడిగిన ద్వేషం.. కుటుంబాన్ని నిలువునా కూల్చింది. తాను పెట్టిన విషానికి కళ్లెదుటే కన్నవారు, తోబుట్టువు విలవిలలాడుతూ ఊపిరి వదులుతుంటే చూసిన ఆమె ఎన్నో రోజులు వాస్తవాన్ని దాచలేక పోయింది. చిన్నవారైన తమ్ముడు, చెల్లికి ఇస్తున్న ప్రాధాన్యం.. పెద్ద సంతానంగా తనకు అమ్మానాన్నలు ఎందుకివ్వరనే ఉడుకుమోతుతనం ఉగ్రరూపమే దాల్చింది. ఈ ఏడాది జులై 13 రాత్రి.. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని భరమసాగర ఠాణా ఇస్సాముద్ర గ్రామంలో తిప్పానాయక్‌ ఇంట రాత్రి భోజనానికి కుటుంబ సభ్యులంతా కూర్చున్నారు. అందరికీ ఇష్టమైన రాగి సంకటి వేడివేడిగా సిద్ధమైంది. దాన్ని ఆరగించిన కాసేపటికే.. తీవ్రమైన విరేచనాలు, వాంతులతో కుటుంబ సభ్యులు విలవిలలాడారు. బాలిక తండ్రి తిప్పానాయక్‌ (45), తల్లి సుధాబాయి(40), నాయనమ్మ గుండిబాయి(80) చెల్లి రమ్య (15) నెత్తురు కక్కుతూ నేలవాలారు. ఆమె సోదరుడు రాహుల్‌ను ఆసుపత్రిలో చేర్పించాక.. ఇటీవలే కోలుకున్నాడు. నాటి ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. వారు తిన్న ఆహార నమూనాలను రసాయన పరీక్షలకు పంపిన పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఆ రసాయన పరీక్షల వివరాలు అధికారుల చేతికందాయి. ఆహారంలో విషం ఉన్నట్లు తేలింది. ‘ఇక్కడే మాకు అనుమానం మొదలైంది. ఇంట్లో అందరూ ఆహారాన్ని తిన్నా.. ఆ బాలిక (17) ఎందుకు తినలేదనే ప్రశ్న తొలిచేసింది. బాలిక విషయంలో ఒత్తిడి తేకుండా క్షుణ్నంగా పరిశీలించడం ప్రారంభించాం. ఆమె నడక భిన్నంగా ఉండటం.. విపరీత తత్తరపాటు గుర్తించాం. ఏదో తప్పుచేసిన భావన ఆమెలో కనిపించింది. గట్టిగా నిలదీశాం. వాస్తవాలు కక్కేసింది. చేసిన తప్పు ఒప్పుకొంది’ అని చిత్రదుర్గం ఎస్పీ రాధిక నాటి ఘటనకు కారణమైన నిందితురాలి వివరాలను సోమవారం వెల్లడించారు. ‘నిజమే.. నేనే ఆ పని చేశా. ఇంట్లో నేను పెద్దదాన్ని. నాకన్నా ఇద్దరు చిన్నవారున్నా.. వారికి ఏ పనీ చెప్పరు. అన్నింట్లోనూ వారికే ప్రాధాన్యం. నన్ను మాత్రం కూలి పనులకు పంపడం అన్యాయం కాదా? నాకు పెద్దల ప్రేమ దూరమవుతోందనే బాధ కలిగింది. అందుకే.. రాగి సంగటి వండే సమయంలోనే ఎవరికీ తెలీకుండా విషం కలిపా. ప్రీతి, వాత్సల్యం నాకు దక్కనప్పుడు వారు నాకెందుకు అనే బాధ వెంటాడింది.. అందుకే ఆ పని చేశా..’ అంటూ బాలిక తప్పు ఒప్పుకొన్నట్లు ఎస్పీ వివరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన