డోర్‌ డెలివరీకి ఆదరణ
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

డోర్‌ డెలివరీకి ఆదరణ

ఈనాడు - అమరావతి

ఇటీవల ఆర్టీసీ వాణిజ్య విభాగం ప్రారంభించిన డోర్‌ డెలివరీకి ఆదరణ లభిస్తోంది. సేవలు ప్రారంభించిన 20 రోజుల్లో వెయ్యికి పైగా పార్శిళ్లు బుక్‌ అయ్యాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కొరియర్‌, పార్శిళ్లను నేరుగా ఇళ్లకే వెళ్లి అందించే సౌకర్యాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సేవలను ప్రయోగాత్మకంగా చేపట్టారు. రెగ్యులర్‌గా సాగే వ్యాపారానికి తోడు డోర్‌ డెలివరీ ద్వారా అదనంగా ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వ్యాపారం ఆశాజనకంగా ఉండడంతో మరింత చొచ్చుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

*● పైలెట్‌ ప్రాజెక్టు కింది ప్రస్తుతం జిల్లాలోని మూడు చోట్ల నుంచి ఈ సేవలు నడుస్తున్నాయి. పది కిలోల లోపు ఉండే పార్శిళ్లు, కొరయర్లను ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నారు. ఇందుకుగాను విజయవాడ, ఆటోనగర్‌, మచిలీపట్నంలోని కార్గో పాయింట్ల నుంచి 10 కి.మీ దూరంలోని ప్రాంతాలకు 24 గంటల్లోనే ఇళ్లకు చేరుస్తున్నారు. ఇప్పటి వరకు 1,020 పార్శిళ్లను బుక్‌ చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా పీఎన్‌బీఎస్‌లోని పాయింట్‌ నుంచి బుక్‌ అయ్యాయి. ఇక్కడి నుంచి అత్యధికంగా 885 రాగా, మచిలీపట్నంలో 80, ఆటోనగర్‌ పాయింట్‌లో 55 వచ్చాయి. ఇప్పటి వరకు సగటున రోజుకు 50 చొప్పున వచ్చాయి. ఈ సంఖ్యను వంద వరకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* విద్యా కేంద్రంగా ఉన్న విజయవాడ నగరం చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ ఉండి చదువుకునే విద్యార్థులు ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. వీరికి ఇళ్ల నుంచి తల్లిదండ్రులు పార్శిళ్లు పంపిస్తున్నారు. ఒక్క రోజులోనే చిరునామాకు అందజేస్తుండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. పార్శిల్లో ఎక్కువ చిన్న కవర్లు, తినుబండారాలు, పుస్తకాలు, చిన్నపాటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, దస్త్రాలు, తదితరాలను పంపించేందుకు ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. బుకింగ్స్‌ మరింత పెరిగితే ఎక్కువ బరువు ఉన్న పార్శిళ్లను కూడా ఇళ్లకు తీసుకెళ్లి అందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని