సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Updated : 18/10/2021 04:54 IST

సంక్షిప్త వార్తలు

దీర్ఘకాలిక సెలవులో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌?

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్మోహన్‌రావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్టు సమాచారం. అనారోగ్య కారణాల రీత్యా తనకు ఆరు వారాలు సెలవు కావాలని గతంలోనే ఆయన ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా కేవలం నాలుగు రోజులు మాత్రమే ఇచ్చి, వెంటనే డ్యూటీ జాయిన్‌ అవ్వాలని ఆదేశించడంతో జగన్మోహనరావు తిరిగి విధుల్లో చేరారు. తాజాగా ఆయన మరోసారి ఆరు వారాల సెలవు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సీఎస్‌ఆర్‌ఎంఎ డాక్టర్‌ హనుమంతరావు, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ శోభ ఆస్పత్రి పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు.


నేడు స్పందన వినతుల స్వీకరణ

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విజయవాడ రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఈనెల 18వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్టు సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌ తెలిపారు. డివిజన్‌ పరిధిలోని ప్రజలు వివిధ సమస్యలపై నేరుగా వినతులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.


సముద్రంలోకి 47,905 క్యూసెక్కులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కృష్ణా నది దిగువున ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఎగువ నుంచి 63,570 క్యూసెక్కుల మేర ప్రవాహం రాగా, 65 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 47,905 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా డెల్టా పరిధిలోని పంట కాల్వలకు 15,665 క్యూసెక్కులు ఇస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు ఎగువ నుంచి 60,185 క్యూసెక్కులు రాగా, 60 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 44,520 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం ఉదయం 6 గంటలకు 67,815 క్యూసెక్కులకు పెరిగింది. 70 గేట్లను అడుగు మేర ఎత్తి, 52,150 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం మధ్యాహ్నం 12 గంటలకు 74,255, మధ్యాహ్నం 3 గంటలకు 70,990, సాయంత్రం 6 గంటలకు 63,570 క్యూసెక్కులకు క్రమేపీ తగ్గింది.


ప్రతిభ చూపే వారికి మరింత ప్రోత్సాహం

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ప్రతిభ చూపినవారికి శాఖాపరంగా మరింత ప్రోత్సాహం అందజేస్తామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ చెప్పారు. ఎంఎస్‌సీడీ డీివైస్‌ ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా 23 మంది అనుమానితులను గుర్తించడంలో సత్తా చాటిన ఆర్‌పేట కానిస్టేబుల్‌ రామాంజనేయులు, ఈచ్‌ వన్‌ టీచ్‌వన్‌ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన షెడ్యూల్‌ తయారు చేయడంతో పాటు కార్యక్రమ విజయవంతానికి చొరవ చూపిన ఐటీకోర్‌ కానిస్టేబుల్‌ ఆర్‌వీ నాగరాజు, జిల్లా ఆస్పత్రి నుంచి పసిపిల్ల అపహరణ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన చిలకలపూడి కానిస్టేబుల్‌ శ్రీనివాసరావులకు ప్రశంసాపత్రంతో పాటు నగదు రివార్డును ఎస్పీ అందజేశారు.


సౌత్‌జోన్‌ ఖోఖో కమిటీలో రాష్ట్ర సభ్యులకు స్థానం

విజయవాడ క్రీడలు: సౌత్‌ జోన్‌ ఖోఖో కమిటీలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు సభ్యులకు స్థానం లభించింది. అనంతపురం జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎం.పుల్లారెడ్డి ఎగ్జిక్యూటివ్‌ సభ్యునిగా, జాతీయ ఖోఖో సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు, కృష్ణా జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎంవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ రిఫరీ బోర్డు కన్వీనర్‌గా నియమితులయ్యారు.


విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్‌ చేశారు. నగరంలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం అధ్యక్షుడు కె.అల్‌ఫ్రెడ్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమస్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛను ఇవ్వాలని, 11వ పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఆర్‌లను విడుదల చేయాలని, ఎంప్లాయీస్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వాలని, 45 సంవత్సరాలు దాటిన వితంతు, విడాకుల మహిళలకు ఫ్యామిలీ పింఛను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.జయబాబుతో పాటు 13 జిల్లాలకు చెందిన సంఘ నాయకులు పాల్గొన్నారు.


‘20న బ్యాంకులకూ సెలవు ప్రకటించాలి’

పటమట, న్యూస్‌టుడే: మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించినట్లే, బ్యాంకు ఉద్యోగులకూ ఇవ్వాలని యూనైటెడ్‌ ఫోరమ్స్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్‌ కన్వీనర్‌ బి.ఎస్‌.రాంబాబు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. బ్యాంకు సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులనే విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

 


589.80 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ డ్యాం రెండు క్రస్టుగేట్లు ఎనిమిది అడుగులు ఎత్తి 24,848 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణాకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ కుడి కాలువకు 9700, ఎడమ కాలువకు 8041, సాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 29,516, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం 74,405 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 74,405 క్యూసెక్కుల నీరొచ్చి చేరుతోంది. సాగర్‌ నీటిమట్టం 589.80 అడుగుల గరిష్ఠస్థాయికి చేరువైంది.


20న కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

నగరం, న్యూస్‌టుడే : పిడుగురాళ్ల మండలం జువ్వలకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20న కబడ్డీ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా సంయుక్త కార్యదర్శి డి.నాగాంజనేయరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 9533388845 సెల్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు. ఎంపికైన జిల్లా జట్లు నవంబర్‌ 6, 7, 8 తేదీల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో నిర్వహించే రాష్ట్రసాయి పోటీల్లో పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు.


బాపట్లలో 101.2 మి.మీ వర్షపాతం

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు సగటున 7.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల మండలంలో అత్యధికంగా 101.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. యడ్లపాడు 42, పొన్నూరు 35, కర్లపాలెం 28.2, పెదనందిపాడు 24.8, చెరుకుపల్లి 16, పిట్టలవానిపాలెం 16, చేబ్రోలు 15.8, కాకుమాను 15.2, చుండూరు 14.4, నగరం 13.4, నగరం 13.4, సత్తెనపల్లి 12.2, ప్రత్తిపాడు 10.2, గుంటూరు 9.4, నరసరావుపేట 6.4, వేమూరు 5.8, నిజాంపట్నం 5.6, ముప్పాళ్ల 5.2, తెనాలి 4.8, నాదెండ్ల 4.6, నూజెండ్ల 4.4, వట్టిచెరుకూరు 4.4, అమృతలూరు 4.2, కొల్లిపర 3.6, కారంపూడి 3.4, చిలకలూరిపేట 3.2, శావల్యాపురం 2.6, దుగ్గిరాల 2.2, కొల్లూరు 2.2, భట్టిప్రోలు 1.8, వినుకొండ 1.4, క్రోసూరు 1.2, మాచవరం 1.2, పెదకాకాని 1.2, మేడికొండూరు 1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


కొవిడ్‌ విధుల కేటాయింపు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు కొవిడ్‌ విధులను కేటాయిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నమూనాల సేకరణ, 104 కాల్‌ సెంటర్‌, పాజిటివ్‌ కేసులను గుర్తించడం, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, జ్వరాల క్లినిక్స్‌ నిర్వహణకు మొత్తం 19 మందికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు తాత్కాలిక విధానంలో నియమించిన వారు ఈ పనులను చూస్తున్నారు. వారందరినీ ఈ నెల 13న విధుల నుంచి తొలగించారు. అందువల్ల వివిధ ప్రాంతాల్లో శాశ్వత విధానంలో పని చేస్తున్న వారిని వలస విధానంలో తీసుకున్నారు.


ఆర్‌యూపీపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీ) జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పి.సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా జి.నాగమునెయ్య, మహిళా కార్యదర్శిగా యు.ఏసుమేరి, కోశాధికారిగా పి.శశికిరణ్‌లు ఎన్నికయ్యారు. రాష్ట్ర బాధ్యులు పి.వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసరావులు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.


వీఆర్వోల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఏపీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్వోల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో ఆదివారం జరిగింది. గుంటూరు అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పి.ప్రసన్నకుమార్‌(గుంటూరు), ప్రధాన కార్యదర్శి బి.కె.వి.మురళీరాజు(ప.గో), అసోసియేట్‌ అధ్యక్షుడు బి.కోటేశ్వరరావు(ప.గో), కోశాధికారి ఎం.రాజమోహనరావు(గుంటూరు), అసోసియేట్‌ కార్యదర్శి సి.నాగేంద్ర(కర్నూలు), సమన్వయకర్త ఎ.బాలాజీ(నెల్లూరు), ఉపాధ్యక్షులు ఎం.ఎన్‌.అమర్‌నాథ్‌(కృష్ణా), ఆర్‌.నరసరాజు(కర్నూలు), ఎ.గౌరీశంకర్‌(విజయనగరం), ఎస్‌.శ్రీధర్‌(నెల్లూరు), డి.రాజేష్‌కుమార్‌(శ్రీకాకుళం), ఆరుగురు సంయుక్త కార్యదర్శులుగా, ఆరుగురు ఈసీ సభ్యులుగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసన్నకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా జయసింహా

గుంటూరు వైద్యం: ఇన్‌ఛార్జి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా సోమవారం జయసింహా కొనసాగనున్నారు. ప్రస్తుత డీఎంహెచ్‌వో యాస్మిన్‌ పది రోజులు సెలవుపై వెళ్లినందున తాత్కాలికంగా ఈ ఏర్పాటు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని