పక్కాగా పోషణ లెక్క
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

పక్కాగా పోషణ లెక్క

అంగన్‌వాడీ కేంద్రాల్లో కచ్చిత వివరాల నమోదు


సంపూర్ణ పోషణ కిట్లతో లబ్ధిదారులు

చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపంతో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రతినెలా పోషకాహారం అందజేస్తోంది. కొన్నిచోట్ల ఇబ్బందులున్నట్లు గుర్తించిన అధికారులు అందరికీ సక్రమంగా అందేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. యాప్‌ను రూపొందించి  వివరాలు నమోదు చేయడం, అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ఆధారంగా సరకులు పంపిణీ చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు. 

న్యూస్‌టుడే, రొంపిచర్ల జిల్లాలో 4405 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లతోపాటు చిక్కీలు, జొన్నపిండి, రాగిపిండి, బెల్లం, ఖర్జూరాలు అందిస్తున్నారు. అయితే కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు పోషకాహారం సరిగా అందడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు అవకతవకలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం దృష్టి పెట్టింది. అక్రమాలకు తావు లేకుండా సరకులను బయోమెట్రిక్‌ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. 
వివరాలన్నీ అందులోనే..: ఆగస్టు నుంచి సరకులు పంపిణీ వివరాలు, లబ్ధిదారుల సమాచారం ఎప్పటికప్పుడు పొందుపరిచేలా ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చారు. వీటిపై ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. చిన్నారుల్లో పోషకాహార లోపం ఉందా, ఏ మేరకు ఉంది, అందరికీ సరకులు సక్రమంగా అందుతున్నాయా వంటి లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 10వ తేదీలోగా చిన్నారుల బరువు, ఎత్తు తదితర వివరాలు పొందుపరిచి ఆ మేరకు వారికి పోషకాహారం ఇవ్వాలి. ఇక నుంచి అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తల వివరాలన్నీ ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉండటంతో అవకతవకలకు అడ్డుకట్ట పడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల నుంచి ఆధార్‌ తదితర వివరాలు సేకరించారు.

జిల్లాలో ఇలా..
అంగన్‌వాడీ కేంద్రాలు 4405 
చిన్నారుల సంఖ్య 2,51,325 
బాలింతలు, గర్భిణుల సంఖ్య 40,977

బయోమెట్రిక్‌ విధానంలో పంపిణీ
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు సరకులు పక్కాగా అందించేందు చర్యలు చేపడుతున్నాం. యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేయాలి. కేంద్రాల్లో బయోమెట్రిక్‌ విధానంతో వస్తువుల పంపిణీ చేపడుతున్నాం. - మనోరంజని, పీడీ  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని