విజయ నాదం!
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

విజయ నాదం!

నాదస్వరం వాయిస్తున్న విజయలక్ష్మి

 

బాపట్ల, న్యూస్‌టుడే : భారతీయ సంగీత కళల్లో నాదస్వరానికి ప్రత్యేకత ఉంది. హైందవ సంస్కృతి సంప్రదాయాలకు ఈ కళ ప్రతీకగా నిలుస్తోంది. బాపట్లకు చెందిన విజయలక్ష్మి తాత, తండ్రి స్ఫూర్తితో బాల్యంలోనే నాదస్వరంపై ఆసక్తి పెంచుకొని మూడున్నర దశాబ్దాలుగా రాణిస్తున్నారు. మహిళలు సైతం నాదస్వరం అద్భుతంగా వాయించగలరని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె కళాసేవలో తరిస్తున్నారు.

విజయలక్ష్మి తాత కడవకుదురు ఆంజనేయులు, తండ్రి వెంకటేశ్వర్లు ప్రముఖ నాదస్వర కళాకారులు. తాత, తండ్రి తొలి గురువులుగా వారు అందించిన ప్రోత్సాహంతో ఎనిమిదేళ్ల వయసు నుంచే నాదస్వరం వాయించడం ప్రారంభించారు. నాన్నతో కలిసి పలు కచేరీల్లో పాల్గొన్నారు. కుమార్తె ప్రతిభను గుర్తించిన వెంకటేశ్వర్లు తితిదే ఆస్థాన విద్వాంసుడు గల్లా లక్ష్మయ్య వద్ద శిక్షణ ఇప్పించారు. వెంకన్న సన్నిధిలో ఐదేళ్లు ఆమె నాద స్వరం సాధన చేశారు. తమిళనాడు తిరుచ్చి సమీపంలోని శ్రీరంగంలో ప్రముఖ కళాకారుడు కాలేషా వద్ద తర్ఫీదు పొంది ప్రతిభకు మెరుగులు దిద్దుకొన్నారు.

ఏకధాటిగా ఎనిమిది గంటల ప్రదర్శన..

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో విజయలక్ష్మి పలుమార్లు ప్రదర్శనలు ఇచ్చారు. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నేపాల్‌ నారాయణ ఘాట్‌ నరసింహస్వామి ఆలయ కుంభాభిషేకంలో కచేరీ ప్రదర్శన చేశారు. చెన్నై, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, గుంటూరులో పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చి నాద స్వరంతో సంగీత ప్రియులను అలరించారు. భర్త రాము ప్రోత్సాహంతో నాలుగు పదుల వయసులోనూ ఆమె కళాసేవ చేస్తున్నారు. ఏకధాటిగా ఎనిమిది గంటలు నాదస్వరం వాయించి ప్రశంసలు అందుకొన్నారు. ప్రస్తుతం జిల్లెళ్లమూడి అమ్మ, పూండ్ల చంద్రశేఖర స్వామి ఆలయ ఆస్థాన విద్వాంసురాలిగా ఉన్నారు. ప్రభుత్వం సంప్రదాయ కళలు ప్రోత్సహించాలని, నాద స్వర కళాకారులుగా మహిళలు బాగా రాణించగలరని ఆమె పేర్కొన్నారు. యువ కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

పరిపూర్ణానంద, శ్రీనివాస జీయర్‌ స్వామీజీలు, సహచర కళాకారులతో..

 

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని