రాతినేలకు పచ్చ తోరణం!
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

రాతినేలకు పచ్చ తోరణం!

ఓ రాయి.. దానిపై వేళ్లూనుకుని రాజసంగా నిలుచున్న ఓ మహా వృక్షం.. చూసేందుకు కనువిందు చేసేలా ప్రకృతి సృష్టించిన ఈ దృశ్యాలు తెలంగాణలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి. రాష్ట్రంలో ఎక్కువగా పరుచుకున్న రాతి నేలలు, రాళ్ల గుట్టలనూ పచ్చగా మార్చేందుకు ప్రణాళికలు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే కేబీఆర్‌ జాతీయ ఉద్యానవనంలో ప్రయోగాత్మకంగా ఈ మొక్కల్ని నాటుతోంది.ఇది విజయవంతమైతే రాష్ట్రమంతటా ఉన్న రాతి గుట్టల్ని హరితమయం చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఎలా చేస్తారు..? మర్రి, రావి, జువ్వితో పాటు మరికొన్ని పండ్ల జాతి మొక్కలు ఎలాంటి పరిస్థితులున్నా మట్టిని వెతుక్కుంటూ వేర్లను విస్తరించుకుంటాయి. ఓ పెద్ద రాయిపై చిన్నరాళ్లను పేర్చి మధ్యలో కొంత మట్టి, అవసరమైన పోషకాల్ని అందించి మొక్కల్ని నాటుతున్నారు. దాదాపు 3నెలల పాటు వీటి ఎదుగుదలకు ఎరువులు, డీఏపీలు వేయనున్నారు. ఇందులో ఒక్కో మొక్కకు కనీసం రూ.1500 దాకా ఖర్చు వస్తుందని ఓ అధికారి తెలిపారు.

నాటి పాఠాలే ధీమా.. రాళ్లపై మొక్కల్ని కృత్రిమంగా నిలపగలమా అనే ప్రశ్నకు.. 1984లో తిరుమల కొండల్లో చేపట్టిన విధానమే జవాబని చెబుతున్నారు అధికారులు. ఎటు చూసినా రాళ్లతో కనిపించే కొండల్ని హెలికాప్టర్ల ద్వారా విత్తనాలు జల్లించి.. ప్రత్యేక శ్రద్ధతో ఆరేళ్లలో వాటి రూపు మారేలా చేసి, ఇప్పుడు దట్టపుటడవుల్లా కనిపించేలా మారేందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావు అమలుచేసిన ప్రణాళిక ఇక్కడా పనిచేస్తుందని నమ్ముతున్నారు.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని