నిఘా పెట్టి.. అక్రమాలు కనిపెట్టి!
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

నిఘా పెట్టి.. అక్రమాలు కనిపెట్టి!

ఒక్క ఫిల్లింగ్‌ కేంద్రం నుంచే ఉచిత ట్రిప్పులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉచిత నీటి ట్యాంకర్లలో జరుగుతున్న అక్రమాల గుట్టును రట్టు చేయడంతో జలమండలికి భారీస్థాయిలో ఆదా అయింది. కేవలం ఒకే ఒక ఫిల్లింగ్‌ కేంద్రం నుంచి అడ్డదారుల్లో తరలుతున్న వేల ట్యాంకర్లకు జలమండలి అడ్డుకట్ట వేసింది. పాతబస్తీలోని మీరాలం ఫిల్లింగ్‌ కేంద్రం నుంచి కాటేదాన్‌ పారిశ్రామిక వాడకు నెలకు 12 వేల ఉచిత ట్రిప్పులు వెళ్లేవి. తద్వారా ఒక్క మీరాలం కేంద్రంలోనే ట్యాంకర్ల యజమానులకు జలమండలి నెలనెలా రూ.50 లక్షల వరకు బిల్లులు చెల్లించేది. నీటిని అక్రమదారుల్లో విక్రయించి మరో రూ.50 లక్షల వరకు అడ్డదారుల్లో సంపాదించేవారు. గత కొన్నాళ్లుగా ఈ తతంగం జరుగుతోంది. ‘ఈనాడు’ ఈ అక్రమ తతంగాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు క్షుణ్నంగా పరిశీలించడంతో కళ్లు చెదిరేస్థాయిలో అక్రమాల గుట్టు రట్టయ్యింది.

పరిశ్రమలకు తరలింపు: నగరంలోని ఇతర 43 కేంద్రాల వద్ద నిఘా పెంచారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిశీలన చేస్తున్నారు. 43 ఉచిత ట్యాంకర్లు తరచూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో వాటిని తొలగించారు. ఆయా యజమానులపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా వైశాలినగర్‌, బండ్లగూడజాగీర్‌, జీడిమెట్ల, హైదర్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, రాధిక తదితర ఫిల్లింగ్‌ కేంద్రాల నుంచి ఎక్కువ ట్యాంకర్లు బయటకు పోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కువ శాతం పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీటిని తరలిస్తున్నారు. బిస్కెట్‌ కంపెనీలు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేసే యూనిట్లకు పెద్దఎత్తున నీటి అవసరం ఉంది. అక్కడ ప్రత్యేకించి పైపులైన్ల వ్యవస్థ ఉండదు. వాణిజ్య అవసరాల కోసం జలమండలి ఇలాంటి సంస్థలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. వీటి ధర ఎక్కువగా ఉండటంతో ఉచిత ట్యాంకర్ల యజమానులకు కొంత నగదు ఇస్తూ నీరు పోయించుకొంటున్నారు. ఈ దందాకు అలవాటు పడ్డ కొందరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో ట్యాంకర్లను జలమండలికి అద్దెకిచ్చి అక్రమాలకు తెరతీస్తున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో దృష్టి పెడితే ఏటా జలమండలికి కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంది. అంతేకాక జలమండలి కొత్తగా ఆయా పరిశ్రమలకు నీటి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆదాయం పెరగనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని