పర్యాటకులకు రైలుయాత్ర
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

పర్యాటకులకు రైలుయాత్ర

ఆగస్టు 27 నుంచి 3 రైళ్ల ప్రారంభం

మాట్లాడుతున్న ఐఆర్‌సీటీసీ డీజీఎం కిశోర్‌ (మధ్యలోని వ్యక్తి)

కడప ఏడురోడ్లు, న్యూస్టుడే: దేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ‘పిలిగ్రిమ్‌ స్పెషల్‌ టూరిస్ట్‌ ట్రైన్స్‌’ను ఏర్పాటు చేసినట్లు ఐఆర్‌సీటీసీ డీజీఎం కిశోర్‌ పేర్కొన్నారు. కడప రైలునిలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర, దక్షిణ భారతదేశ యాత్రలకు ఆగస్టు 27, సెప్టెంబరు 25, అక్టోబరు 19వ తేదీల్లో రైళ్లను నడపనున్నామని ఆయన వివరించారు. ఆయన వెంట రైలు నిలయం మేనేజరు మోహన్‌రెడ్డి, ఐఆర్‌సీటీసీ ప్రాంతీయ మేనేజరు ప్రసాద్‌, రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు యానాదయ్య, ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టరు శంకరరావు తదితరులున్నారు. ● ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్తర భారతదేశ యాత్రలో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్‌సర్‌, హరిద్వార్‌, దిల్లీలోని పలు సందర్శనీయ ప్రదేశాలను చూపించ నున్నట్లు తెలిపారు. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, ఖాజీపేట, పెద్దపల్లి, రామగుండం, నాగపూర్‌లో రైలు ఆగుతుందన్నారు. స్లీపర్‌ క్లాస్‌కు రూ.10,400, ఏసీ 3 టైర్‌కు రూ.17,330 వసూలు చేస్తామన్నారు. ● మహాలయ పిండదాన్‌తర్పన్‌ రైలు సెప్టెంబరు 25వ తేదీ నుంచి బయలుదేరుతుందన్నారు. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, గయ ప్రాంతాల్లోని సందర్శనీయ ప్రదేశాలను చూడవచ్చునన్నారు. సికింద్రాబాద్‌ నుంచి రైలు బయలుదేరుతుందన్నారు. సికింద్రాబాద్‌, ఖాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బ్రహ్మపూర్‌, ఖుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, జజ్‌పూర్‌కియోన్‌జహర్‌, భద్రక్‌, బాలసోర్‌, హిజ్లి, టాటానగర్‌, బొకారో స్టీల్‌సిటీ ప్రాంతాల్లో రైలు ఆగుతుందన్నారు. స్లీపర్‌ క్లాస్‌కు రూ.6,620, ఏసీ 3టైర్‌కు రూ.11,030 వసూలు చేయనున్నట్లు తెలిపారు.

దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా అక్టోబరు 19వ తేదీ నుంచి రైలు బయలుదేరుతుందన్నారు. తిరుచిరాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, మహాబలిపురం, కాంచీపురంలోని వివిధ సందర్శనీయ ప్రదేశాలు చూపిస్తామన్నారు. రైలు సికింద్రాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైలునిలయాల్లో మాత్రమే ఆగుతుందన్నారు. స్లీపర్‌ క్లాస్‌కు రూ.6,620, ఏసీ 3టైర్‌కు రూ.11,030 వసూలు చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్‌సైట్‌ను చూడవచ్చునన్నారు. కరోనా నిబంధనలతోనే రైళ్లు నడుస్తాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని