
ఆత్మస్థైర్యమే స్వశక్తిపై నిలిపింది
● నేడు దివ్యాంగుల దినోత్సవం
కృత్రిమ కాలితో పంక్చర్ వేస్తున్న పరశురాముడు
పత్తికొండ పట్టణం, న్యూస్టుడే: వారెలాంటి తప్పు చేయలేదు.. అయినా వారి ప్రమేయం లేకుండా పెద్ద శిక్ష ఖరారైపోతుంది. పర్యవసానం.. జీవితమంతా విషాదభరితం.. ఇది స్థూలంగా ప్రతి దివ్యాంగుడి బతుకుచిత్రం.. అయితే సెక్రెడ్ సంస్థ అందించిన స్నేహహస్తం పరశురాముడికి సాంత్వన చేకూర్చింది. ఒంటికాలితో ఆత్మస్థైర్యంతో పరశురాముడు ముందుకు సాగుతున్నారు. పత్తికొండ మండలం జూటూరు గ్రామానికి చెందిన పరశురాముడు తన 20వ ఏట ట్రాక్టరు ప్రమాదంలో కాలు కోల్పోయారు. మోకాలి కింది వరకు కాలు తొలగించారు. బతుకుదెరువు దారులు మూసుక పోయాయి. ఆర్థికంగా ఎలాంటి భరోసా లేని పరశురాముడిని సెక్రెడ్ సంస్థ కమ్యూనిటీ మొబలైజర్ జూటూరు హనుమంతప్ప గుర్తించారు. దీంతో సంస్థ ఆయనకు రబ్బరు తొడుగుతో కృత్రిమ కాలిని సమకూర్చి ఆర్థికసాయం అందించారు. వాహనాలకు పంక్చర్లు వేసే వృత్తిని ఎన్నుకుని పత్తికొండ శివారులో దుకాణం తెరిచారు. రోజూ రూ.300దాకా సంపాదిస్తున్నట్లు తెలిపారు.