close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

రెండో దశ.. కనిపించని దిశ!

రామచంద్రాపురానికి చివరి, తొలి సర్వీసులు మాత్రమే..
అనుకూల సమయాల్లో ఎంఎంటీఎస్‌లు లేవని పెదవి విరుపు
సర్వీసులు పెంచాలని శివారు వాసుల డిమాండ్‌
ఈనాడు - హైదరాబాద్‌

ఎంఎంటీఎస్‌ రెండో దశ పరుగుల కోసం జంటనగరాల ప్రజలతో పాటు శివారు ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎంఎంటీఎస్‌ రెండో దశ పరుగులు ప్రారంభమవుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. దీంతో శివారు వాసులు హర్హం వ్యక్తంచేశారు. ప్రస్తుతానికి రాత్రి పూట ఫలక్‌నుమా, హైదరాబాద్‌ నుంచి చివరి ట్రిప్పులు రామచంద్రాపురం వరకు ఉంటాయని.. తిరిగి తెల్లవారుజామున సర్వీసులు అక్కడి నుంచే బయలుదేరుతాయని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో 121 సర్వీసులు ప్రారంభమవుతాయని అంతా భావించారు. కానీ, రాత్రి వేళల్లో రైళ్లను నిలిపేందుకు మాత్రమే రామచంద్రాపురం రైల్వే స్టేషన్‌ పరిమితమవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* ఎంత దూరమైనా ఎంఎంటీఎస్‌ రైలుంది కదాని శివార్లలో అధికశాతం సొంత ఇళ్లను సమకూర్చుకున్నారు. 2014లో రూ.816 కోట్లతో చేపట్టిన పనులు 2018 నాటికి పూర్తవుతాయని.. అప్పటికి పూర్తి స్థాయిలో రైళ్లు పరుగులు పెడతాయని భావించారు. వివిధ కారణాల వల్ల 2019 జూన్‌ 9 నాటికి పాక్షికంగా ప్రారంభమయ్యాయి. లింగంపల్లి తర్వాత తెల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం(పటాన్‌చెరు) నుంచి నగరానికి సునాయాస ప్రయాణం వస్తుందని భావించారు. నెలా 10 రోజులవుతున్నా ఆ చివరి, తెల్లవారి ప్రారంభమయ్యే సర్వీసులు తప్ప ఎంఎంటీఎస్‌ జాడలేని స్టేషన్లుగా తెల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం మిగిలిపోయాయి.

సమయాలు సర్దుబాటు చేస్తే..
ఎంఎంటీఎస్‌ రెండో దశ రైలు సర్వీసుల పెంపుపై ద.మ. రైల్వే అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో మొదటి దశలో భాగంగా తిరుగుతున్న 121 సర్వీసుల సమయాలను సర్దుబాటు చేయాల్సి ఉందంటున్నారు. ప్రజలు మాత్రం లింగంపల్లిలో హాల్ట్‌ చేసే సమయంలో తెల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం వెళ్లి వచ్చేయవచ్చని అనుకుంటున్నారు. కేవలం 5.5 కిలోమీటర్ల దూరంలోని మూడు స్టేషన్లకు సర్వీసులు పెంచితే ఎంతో మంది ప్రజలకు రవాణా పరంగా మేలు చేకూరనుంది.

నిరాశ చెందుతున్న ప్రజలు
బాహ్య వలయ రహదారి అందుబాటులోకి రావడంతో నగరం బాగా విస్తరించింది. ఐటీ కారిడార్‌కు దగ్గరగా ఉండడంతో తెల్లాపూర్‌, నాగులపల్లి, శంకర్‌పల్లి, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. శంకర్‌పల్లి, నాగులపల్లి నుంచి కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. ఔటర్‌కు చేరువగా ఉన్న తెల్లాపూర్‌ ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. అక్కడివరకు సొంత వాహనాల్లో వచ్చినా..తెల్లాపూర్‌ నుంచి ఎంఎంటీఎస్‌లో ప్రయాణించవచ్చని అనుకున్నారు. ఎవరికీ అవసరం లేని సమయంలో అంటే రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఫలక్‌నుమా నుంచి వచ్చే రెండు రైళ్లు రామచంద్రాపురం వెళ్తున్నాయి. తెల్లవారుజామున ఎవరూ నిద్ర లేవకముందు అంటే ఉదయం 5.05 నిమిషాలకు ఒకటి హైదరాబాద్‌కు.. ఉదయం 6.10 గంటలకు మరొకటి ఫలక్‌నమాకు రామచంద్రాపురం నుంచి బయలుదేరుతున్నాయి.

మరోవైపు సేవలెన్నడు?
ఎంఎంటీఎస్‌ రెండో దశ 98 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొత్తం 7 కారిడార్లలో పనులు జరుగుతున్నాయి. తెల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం నగరానికి పడమర వైపు ఉన్న ఔటర్‌ రింగురోడ్డును తాకుతోంది. సికింద్రాబాద్‌ - బొల్లారం మార్గం నగరానికి ఈశాన్యం వైపు ఔటర్‌ రింగు రోడ్డుకు చేరువ చేస్తుంది. సికింద్రాబాద్‌ - బొల్లారం మధ్య 14 కిలోమీటర్ల మేర నగర ప్రజలకు ఎంఎంటీఎస్‌ రెండో దశ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో రైళ్లను నడిపేందుకు రైల్వే భద్రతా కమిటీ పచ్చ జెండా ఊపింది. కేవలం కొత్త రైళ్లు అందుబాటులో లేక ఈ మార్గంలో  నడపలేకపోతున్నారు. మరి కొన్ని చోట్ల రైల్వే అండర్‌ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. ఘట్‌కేసర్‌ మీదుగా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టాల్సి ఉంది. అలాగే సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య 20 కిలోమీటర్ల మేర మార్గం అందుబాటులోకి రానుంది. ఇవన్నీ వస్తే.. నగరం నలువైపులా ఔటర్‌ రింగు రోడ్డు చేరువకు ఎంఎంటీఎస్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ యంత్రాంగాలు ఈ దిశగా దృష్టి పెట్టాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.