1326 రోజులు.. 8219 కాన్పులు - Kamareddy - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

1326 రోజులు.. 8219 కాన్పులు

ఆర్మూర్‌లో రికార్డు స్థాయి ప్రసవాలు

ప్రజలపై తగ్గిన రూ. 16 కోట్ల ఆర్థిక భారం

ఆదర్శంగా నిలుస్తున్న సర్కారు ఆసుపత్రి

న్యూస్‌టుడే, ఆర్మూర్‌

మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలు. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌కు చెందిన గర్భిణి శిరీష పురిటినొప్పులతో అవస్థలు పడుతుంటే కుటుంబ సభ్యులు ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రిపూట విధుల్లో ఉన్న సిబ్బంది ఆమెను పరీక్షించి, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌, స్త్రీ వైద్య నిపుణురాలు గీతకు ఫోన్‌ చేసి చెప్పారు. వారు వెంటనే ఆసుపత్రికి వచ్చి పరిస్థితి తీవ్రతను గమనించి సిజేరియన్‌ చేశారు. సకాలంలో స్పందించడంతో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ అంకితభావం వల్లే ఈ ఆసుపత్రిపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది.
సర్కారు దవాఖానా అంటే నిరుపేదలకు పరిమితమనే అభిప్రాయాన్ని ఆర్మూర్‌ వైద్యులు తొలగించేశారు. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ఎగువ మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వాధికారులు సైతం ఇక్కడ సేవలను పొందుతున్నారు. ప్రసవాలకు చిరునామాగా మారింది. ఉత్తమ ఉచిత వైద్యసేవలతో ప్రైవేటు ఆసుపత్రులను మరపింపజేస్తోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయి కాన్పులతో ఆదర్శంగా నిలుస్తోంది. అంకితభావం కలిగిన అధికారులు, ఉత్తమ సేవలందించే వైద్యులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి ఇదే ప్రబల నిదర్శనం. ఒకనాడు అధమస్థితిలో ఉన్న ఆసుపత్రి నేడు అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రతినెలా వందల కాన్పులతో, రాష్ట్రంలోనే 30 పడకల ఆసుపత్రుల్లో అత్యధిక ప్రసవాల కేంద్రంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

నాడు నెలకు రెండు.. నేడు రోజుకు అయిదు

గతంలో నెలకు రెండు, మూడు ప్రసవాలైతే ఎక్కువ. ప్రస్తుతం రోజుకు అయిదు నుంచి పది ప్రసవాలు చేస్తున్నారు. ప్రస్తుతం నెలకు 200 నుంచి 300కు పైగా, ఏడాదికి రెండు, మూడువేల వరకు ప్రసవం పొందుతున్నారు. 2008 నుంచి 2015 వరకు ఎనిమిదేళ్లలో 493 కాన్పులు జరిగితే, 2016 ఏడాదిలోనే 995 ప్రసవాలు చేయడం విశేషం. 2017లో రాష్ట్రంలోనే అత్యధికంగా 3,162, 2018లో 2,554 ప్రసవాలు చేశారు. ఈ సారి ఆగస్టు 18 వరకు 1,508 కాన్పులు చేశారు. రాష్ట్రంలో 30 పడకల ఆసుపత్రుల్లో నెలకు 300కు పైగా ప్రసవాలతో ఆర్మూర్‌ అగ్రస్థానంలో నిలిచింది.

ప్రయోజనాలివి

బాబు పుడితే రూ.12వేలు, పాప పుడితే రూ.13 వేల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం అందజేస్తోంది.

రోజూ ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్నం, రాత్రి కోడి గుడ్డుతో భోజన సదుపాయం.

గర్భిణులు, బాలింతల వెంట ఉన్నవారికి మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో రోజూ మధ్యాహ్న భోజన సదుపాయం.

సబ్బు, నూనె, ఆట వస్తువులు, పిల్లలకు అవసరమైన ఇతర సామగ్రితో కేసీఆర్‌ కిట్‌ ఇస్తున్నారు.

యువజన క్రీడల శాఖ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌

ముఖ్యమంత్రి నుంచి పురస్కారం అందుకుంటున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌

ఉత్తమ సేవలకు పురస్కారం

డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేష్‌ ఇక్కడ వైద్య సేవలు మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆసుపత్రిపై ప్రజలకు విశ్వాసం కల్పించి, ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచారు. రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సారెస్పీ అతిథిగృహంలో బసచేసిన సందర్భంలో నాటి పాలనాధికారి యోగితారాణా ఆర్మూర్‌ ఆసుపత్రి, డిప్యూటీ డీఎంహెచ్‌వో కృషి గురించి వివరించగా రాష్ట్రస్థాయి పురస్కారానికి ఆయన పేరు పంపించాలని సూచించారు. 2017 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయనకు పురస్కారం ప్రదానం చేశారు.

మొదట్లో అధ్వానం

నాలుగేళ్ల కిందట ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రి సేవల్లో అధ్వానంగా ఉండేది. కనీస వసతులు, సరైన వైద్యసేవలు లేక ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య నామమాత్రంగా ఉండేది. ప్రసవాలు చాలా తక్కువగా జరిగేవి. ప్రభుత్వాసుపత్రిలో అనవసర రిస్కు ఎందుకనే భావనతో ప్రజలు ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించేవారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయడానికి తప్ప ఆసుపత్రి ఎందుకూ ఉపయోగపడదనే భావన అందరిలో ఉండేది.

నాలుగేళ్లలో ఎంతో మార్పు

ఈ నాలుగేళ్లులో రూపురేఖలే మారిపోయాయి. గతంలో రోగులు లేక వెలవెలబోయిన ఆసుపత్రి ప్రస్తుతం కిటకిటలాడుతోంది. ఒక్కసారిగా ఇంత మార్పు రావడానికి గతంలో కలెక్టర్‌గా ఉన్న యోగితారాణా ప్రత్యేక శ్రద్ధ, స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌ అంకితభావం, వైద్యుల సేవాభావమే కారణం. ముఖ్యంగా ప్రసవాలతోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జిల్లాలో ఆయా మండలాల ప్రజలే కాకుండా పరిసర జిల్లాల నుంచి గర్భిణులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

ప్రజల్లో విశ్వాసం పెంచాం

రమేశ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో

నాలుగేళ్లుగా అందరం కష్టపడి పనిచేస్తూ ప్రజలకు విశ్వాసం కల్పించాం. ప్రసవాల సంఖ్యను పదింతలు పెంచాం. 30 పడకల ఆసుపత్రుల్లోనే రాష్ట్రంలో అత్యధిక ప్రసవాలు చేసి రికార్డు సాధించాం. పాలనాధికారి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, ఎమ్మెల్యే, వైద్యులు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైంది. వైద్యవిధాన పరిషత్‌ అధీనంలోకి వెళ్తే గైనకాలజిస్టులు, స్పెషలిస్టు వైద్యులు వస్తారు. అప్పుడు మరింత మెరుగైన సేవలు అందించొచ్ఛు

పేద, మధ్య తరగతికి వరం

పేద, మధ్య తరగతి ప్రజలు కాన్పుల కోసం ప్రైవేటును ఆశ్రయిస్తే రూ. వేలల్లో బిల్లులు చెల్లించాలి. ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడడం, ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేయడం, అదనంగా కేసీఆర్‌ కిట్లు ఇస్తుండడంతో ఎక్కువ మంది వస్తున్నారు. ప్రైవేటులో సాధారణ కాన్పుకు రూ. 12 వేల నుంచి రూ. 20 వేలు, సిజేరియన్‌ అయితే రూ. 30 వేల వరకు వ్యయం అవుతోంది. ఈ బిల్లు చెల్లించడానికి పేదలు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆర్మూర్‌ ఆస్పత్రిలో 1365 రోజుల్లో 8,219 ప్రసవాలు అయ్యాయి. సగటున రూ. 20 వేలు లెక్కేసినా ప్రజలపై రూ. 16 కోట్ల ఆర్థిక భారం తప్పింది.

ప్రైవేటులో రూ. వేలల్లో ఖర్చు

- సుమలత, బాలింత, తొండాకూర్‌

ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే రూ. వేలల్లో ఖర్చయ్యేవి. ఇక్కడ ఎలాంటి ఖర్చు లేకుండా కాన్పు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు, కేసీఆర్‌ కిట్‌ ఇస్తోంది. వైద్యసేవలు బాగుండడంతో దూరప్రాంతాల వారు కూడా వస్తున్నారు.

మొదటి కాన్పుకు రూ. 40 వేలు అయ్యాయి

- సుమన్‌, పచ్చలనడ్కుడ

నా భార్య లావణ్యను రెండో కాన్పు కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. మొదటి కాన్పు ప్రైవేటుకు వెళ్తే రూ. 40 వేలు ఖర్చయ్యాయి. అందరూ ఆసుపత్రి గురించి చెప్పడంతో రెండో కాన్పు కోసం ఇక్కడికే వచ్చాను. మంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.