close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

సాగులో సహకారం..ఆదివాసులకు వరం

● వ్యవసాయ పరికరాలు అందించి ఆదుకొంటున్న కోనేరు సంస్థ

ఆహార ధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం

న్యూస్‌టుడే, అమ్రాబాద్‌

లింగాల మండలం ఎర్రపెంటలో చెంచురైతు సాగు చేసిన రాగుల పంట

నల్లమలలోని ఆదివాసీ చెంచులకు కోనేరు సంస్థ అండగా నిలుస్తోంది. సాగుకు పొలం, పని చేసేందుకు ఒంట్లో సత్తువ ఉండీ వ్యవసాయ పరికరాలు లేక తిండికి నోచుకోని చెంచురైతులకు చేయూత ఇస్తోంది. 2017లో చెంచుల జీవనంపై సర్వే చేసిన కోనేరు స్వచ్ఛంద సంస్థ.. నల్లమలలోని చెంచు రైతులు పరికరాల్లేక వ్యవసాయం చేసుకోలేని స్థితిలో ఉన్నారని గుర్తించింది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ పీపుల్స్‌ ఫారెస్ట్రీ సహకారంతో వారికి వ్యవసాయ పరికరాలు అందించడానికి శ్రీకారం చుట్టింది. అమ్రాబాద్‌ మండలంలోని మాచారం, ఉప్పునుంతల(బికె), పదర మండలంలోని పెట్రాల్‌చేను, బాపన్‌పాడు, బల్మూరు మండలంలోని బాణాల, బిల్లకల్లు, గుడిబండ, చెంచుగూడెం, అంబగిరి లింగాల మండలంలోని ధారారం, ఎర్రపెంట, శ్రీరంగాపురం గ్రామాల్లోని చెంచు రైతులకు పరికరాలు అందచేస్తూ పంటల సాగుకు సహకరిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం, సిరి ధాన్యాలు, పెరటి తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తూ.. ఆహార ధాన్యాల ఉత్పత్తుల వైపు ప్రోత్సహిస్తున్నారు.

ఉప్పునుంతల (బికె)లో పెరటితోట విత్తనాలు పంపిణీ చేస్తున్న కోనేరు సభ్యులు

గిరిజన రైతు సేవాకేంద్రాల ద్వారా చైతన్యం.. : చెంచు రైతులను సహకరించేందుకు కోనేరు సంస్థ గ్రామం యూనిట్‌గా గిరిజన రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంస్థ ద్వారా కేంద్రాలకు వ్యవసాయ పరికరాలను అందచేస్తున్నారు. అవసరమైన రైతులు వాటిని వినియోగించుకొని తిరిగి కేంద్రానికి అప్పగిస్తారు. దానికి గాను నామమాత్రపు అద్దె వసూలు చేసి ఆ డబ్బుతో కొత్త పరికరాల కొనుగోలు, మరమ్మతులు చేసి తిరిగి కేంద్రాల్లో పెడుతున్నారు. ఒక్కో కేంద్రానికి అవసరాన్ని బట్టి గడ్డపారలు, పారలు, తట్టలు, టార్పాలిన్‌ కవర్లు, డ్రమ్ములు, చేతిపంపులు, నల్లిగొర్రులు, గన్‌ పంపులు, పొలాల్లో కలుపు తీసేందుకు వీడర్‌ అందజేస్తున్నారు.


సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

గిరిజన రైతులు రసాయన ఎరువులు కొని పెట్టుబడి ఖర్చు పెంచుకోకుండ, సేంద్రియ ఎరువులు వాడేలా కోనేరు సంస్థ ప్రతినిధులు ప్రోత్సహిస్తున్నారు. కషాయాలు, ఎరువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. వాణిజ్య పంటలకు బదులు ఆహార పంటల ప్రాధాన్యత తెలిపి వాటిని పండించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడే చెంచులను పోషకాలు అధికంగా ఉండే పప్పు దినుసులు, పెరటి తోటలు, సిరి ధాన్యాల సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు.


12 చెంచు గ్రామాల్లో సాగు : చెంచులు ప్రధానంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అందుకని వారిని సేంద్రియ పద్ధతిలో సిరిధాన్యాలు, పప్పు దినుసుల పంటలు సాగు చేసేలా కృషి చేస్తున్నాం. దీని కోసం అచ్చంపేట నియోజకవర్గంలోని 12 చెంచు గ్రామాలను ఎంచుకొన్నాం. 350 మంది చెంచు రైతులకు వివిధ వ్యవసాయ పరికరాలు అందించి, అధునాతన సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది 133 మంది రైతులు కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేశారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేలా కృషి చేస్తున్నాం.

- ఎంఏ సలీం, కోనేరు సంస్థ డైరెక్టర్‌, అచ్చంపేట


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.