close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

రాష్ట్ర వార్తలు

ఎక్కడుంటున్నారో..?

3 వేల మంది వివరాల గల్లంతు

● చిరునామాల కోసం మళ్లీ సర్వే

● ‘అందరికీ ఇళ్లు’పై ఆందోళన

పాలకొల్లులో నిర్మించిన అందరికీ గృహాల సముదాయాలు

పాలకొల్లు, న్యూస్‌టుడే : అందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి తాజాగా జిల్లాలో మూడు పట్టణాల్లోని అర్హుల జాబితాలో కొందరు లబ్ధిదారులు ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో తెలియని పరిస్థితి. వారంతా ఏ వార్డులో నివసిస్తున్నారు, పట్టణంలో ఉంటున్నారా లేదా అనే దిశగా ఆయా పురపాలక సంఘాలు దృష్టి పెట్టాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో అందరికీ ఇళ్లు పథకంలో నిర్మాణాలు ప్రారంభించారు. జీ ప్లస్‌ త్రీ విధానంలో మూడు కేటగిరీల్లో వీటిని నిర్మించి ఫ్లాట్లు కేటాయించి ధ్రువపత్రాలు లబ్ధిదారులకు అందించారు. అనంతరం ప్రభుత్వం మారింది. ప్రస్తుత ప్రభుత్వం గతంలో గృహాలు మంజూరైన లబ్ధిదారులతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇళ్లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా గతంలో ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులు స్థానికంగా ఉన్నారా లేదా అనేది గుర్తించేందుకు సర్వే చేశారు. ఈ మూడు పట్టణాల్లో కలిపి 3 వేల మంది లబ్ధిదారుల వివరాలు దొరకలేదు.

పాలకొల్లు పురపాలక సంఘంలో మొత్తంగా 6,784 మందికి ఫ్లాట్లను కేటాయించగా 966 మంది వివరాలు తెలియలేదు.

భీమవరంలో 8,352 మందికి ఫ్లాట్లు కేటాయించగా 2 వేల మంది వివరాలు తెలియలేదు. అందులో 1500 మంది వరకు నివాసం మారినట్లు గుర్తించగా ఇంకా 500 మంది చిరునామాలు గుర్తించలేక పోయారు.

తాడేపల్లిగూడెంలో 5,376 మందిలో దాదాపు 500 మంది వివరాలు తెలియడం లేదని చెబుతున్నారు. దీంతో మరోసారి సర్వేను మొదలు పెట్టారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తిచేసి అందరికీ ఇళ్లు లబ్ధిదారుల జాబితాను విడుదల చేసేందుకు పురపాలక సంఘాలు సిద్ధమవుతున్నాయి.

భిన్న కారణాలు

వివరాలు తెలియకపోవడానికి పలు కారణాలు చెబుతున్నారు. ఇళ్ల కేటాయింపు జరిగిన సమయంలో ఒక వార్డులో అద్దింట్లో ఉన్న లబ్ధిదారులు ఆ తరువాత మరొక వార్డులోకి మారడంతో వాలంటీర్లు ఆ ఇంట్లో నివాసం ఉండటం లేదని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో చాలామంది ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. కొందరు వాలంటీర్లు మాత్రం జాబితాలో ఉన్న చరవాణి ద్వారా ఏ ప్రాంతంలో ఉంటున్నారో తెలుసుకొని నమోదు చేశారు. మరికొద్దిమంది లబ్ధిదారులు సమీప గ్రామాల్లో నివాసం ఉండటంతో వివరాలు తెలియరాలేదు. సమీప గ్రామాల ప్రజలు కూడా రేషన్‌కార్డులను మార్పు చేసుకొని పేర్లు నమోదు చేయించుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ మూడు పట్టణాల్లో కలిపి 20,512 మందికి ఫ్లాట్లను కేటాయించారు. ప్రస్తుత సర్వే పేరుతో మీ పేరు తొలగిస్తామంటూ వార్డు స్థాయి నాయకులు బెదిరిస్తున్నారని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎదురుచూపు: మూడు పట్టణాల్లోనూ 70 శాతం గృహాలు పూర్తికావడంతో ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు ఫ్లాట్లను కేటాయించి గృహప్రవేశాలు చేయించారు. ఆయా ప్రాంతాల్లో తాగునీరు, డ్రెయినేజీ, రహదారులు వంటివి నిర్మించక పోవడం వల్ల నివాసం ఉండటానికి అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం గృహ నిర్మాణాలతోపాటు ఈ పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహాయంతో జీప్లస్‌ త్రీ విధానంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తలపెట్టారు. వీటికి సంబంధించి కేటగిరి-1 లో 300 చదరపు అడుగులు, కేటగిరి- 2లో 365 చదరపు అడుగులు, కేటగిరి- 3లో 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ రూ. 3 లక్షలు భరించగా మిగిలిన సొమ్ము లబ్ధిదారుని వాటా, బ్యాంకు రుణం చెల్లించాలి. లబ్ధిదారుడు వాటా సొమ్ముకు సంబంధించి తొలి విడత పట్టణాల్లో కేటగిరి -1కి రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రెండు కేటగిరీలకు సంబంధించి రూ. 50 వేలు, రూ. లక్షను నాలుగు వాయిదాల్లో చెల్లించాలి. ఇందులో రెండు మూడు వాయిదాలను చెల్లించారు. బ్యాంకు రుణ ప్రక్రియ జరుగుతుండగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆ కార్యక్రమం నిలిచిపోయింది. తాము అధికారంలోకి వస్తే రుణ భారం లేకుండా గృహాలను అందిస్తామని ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఆ మాట ఎప్పుడు నెరవేరుతుందీ.. సొంతింటిలోకి ఎప్పుడు వెళ్లతామా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.