close

బుధవారం, మార్చి 20, 2019

ప్రధానాంశాలు

ఇసుక బంగారమాయెగా 

అక్రమ దందాతో పెరిగిన ధరలు 
ప్రభుత్వ కేంద్రంలో అమ్మకాలు నిలిపివేత

జిల్లా కేంద్రంలో ప్రభుత్వపరంగా ఇసుక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు ఇసుక అమ్మకాలను నిలిపివేశారు. గత నెల రోజుల నుంచి ప్రభుత్వ అభివృద్ధి పనులతోపాటు ప్రైవేటు గృహ నిర్మాణాల వేగం పుంజుకుంది. దీంతో ఇసుకకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. జిల్లాలో ఇసుక క్వారీలను గుర్తించినా కేవలం ప్రభుత్వ నిర్మాణాలకే అనుమతి ఉంది. దీనిని అదునుగా చేసుకున్న ఇసుకాసురులు అక్రమ దందాకు తెరలేపి ఒక్కసారిగా ధరలు పెంచేశారు. మంజీర నదిలో మాత్రమే నాణ్యమైన ఇసుక దొరుకుతోంది. గత్యంతరం లేని ఇళ్ల నిర్మాణదారులు నాణ్యత లేకున్నా వాగులు, వంకల్లో దొరికిన దానినే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. 
ప్రైవేటు నిర్మాణాలకు ఇసుక దొరక్క నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విక్రయ కేంద్రాలుంటే నేరుగా తీసుకునే వీలుండేది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మైనింగ్‌ శాఖ ఆధ్వర్యంలో విక్రయ కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటుగా ఇసుకను విక్రయించే వారినే ఆశ్రయించాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. దీంతో ఇష్టారీతిన ధరలు పెంచేసి ఇసుకను విక్రయిస్తున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం కామారెడ్డి  జిల్లాకేంద్రంగా ఆవిర్భవించడంతో ప్రైవేటు నిర్మాణ రంగం జోరందుకుంది. 
వాడవాడలా ప్రైవేటు ఇసుక విక్రయ కేంద్రాలు 
జిల్లాకేంద్రంలో సుమారు 30 ఇసుక విక్రయ కేంద్రాలను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకొని విక్రయాలు చేస్తున్నారు. జిల్లాలోని బీర్కూర్‌తో పాటు సిరిసిల్ల జిల్లాలోని ఇసుక క్వారీల నుంచి ఇసుకను లారీల్లో తీసుకొచ్చి భారీగా ధరలు పెంచి విక్రయాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో తెల్లవారు జామున ఇసుక లారీలు వరుస కట్టి ఉంటాయి. రోజుకు 40 నుంచి 50 వరకు లారీల ఇసుక జిల్లాకేంద్రానికి వస్తోంది. ప్రభుత్వ ఇసుక విక్రయ కేంద్రాల్లో విక్రయం నిలిచిపోవడాన్ని గమనించిన ఇసుక విక్రయదారులు ఇసుకతో పాటు కంకరను సైతం కొనుగోలు చేయాలని నూతన గృహ నిర్మాణదారులకు షరతు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక ధరలు అధికం కావడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోందని వారు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా మైనింగ్‌ అధికారులు ఇసుక విక్రయకేంద్రాన్ని ప్రారంభించి నాణ్యమైన ఇసుకను అందించేలా చూడాలని కోరుతున్నారు. 
ఆగని దందా 
జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ అనేక వాహనాలు దొరుకుతున్నా దందా మాత్రం ఆగడం లేదు. వాగులు, వంకలతో పాటు మంజీర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలించి ఒక్కో ట్రిప్పును రూ.4 వేల వరకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇది రూ. 5 వేలు ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా గత ఆర్నెల్ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తున్నారు. అయినా రోజు వందల ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలుతోంది. అక్రమంగా రవాణా చేసే వారు ప్రభుత్వ నిర్మాణాల పేరిట అనుమతులు పొంది దందా సాగిస్తున్నారు. అభివృద్ధి పనులు చేపట్టే అధికారులతో నెలకు కొంత బేరం కుదుర్చుకొని దందా చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాను అరికట్టాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన రోజే కింది స్థాయి అధికారులు ట్రాక్టర్ల యజమానులకు ముందే సమాచారం ఇచ్చి కొద్ది రోజులు రవాణా నిలిపి వేయాలని సూచిస్తున్నారు. వారం, పది రోజుల తర్వాత మళ్లీ ఎప్పటి మాదిరిగానే వ్యాపారం కొనసాగిస్తున్నారు. 
‘డబుల్‌’ పేరిట దోపిడీ 
జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు, రెండు పడక గదుల ఇళ్లు, ఇతర ప్రభుత్వ నిర్మాణాల కోసం సర్కార్‌ బీర్కూర్‌, బిచ్కుంద మండలాల్లో ఇసుక రీచ్‌లను గుర్తించింది. ముఖ్యంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ ఉచితంగా ఇసుకను ఇవ్వాలని నిర్ణయించడంతో జిల్లాలో నిర్మాణాలకు సిరిసిల్ల జిల్లాతో పాటు బీర్కూర్‌, బిచ్కుంద మండలాల్లో ఇసుక క్వారీల నుంచి సరఫరా చేస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న అక్రమార్కులు ఇసుకను దారిమళ్లించి గృహ నిర్మాణదారులను దోచుకుంటున్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.