close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాలికలకు బాధ్యతమప్పే తీర్పు

రాజ్యాంగం పౌరులందరికీ ప్రసాదించిన జీవనహక్కుకు నడివీధుల్లోనే నూకలు చెల్లే దురవస్థ వేరే ఎక్కడో కాదు... దేశవ్యాప్తంగా ఘన నగరాల్లోనే పోగుపడి ఉంది. నాగరికతకు నెలవై అభివృద్ధికి ఆలవాలమై రాజిల్లాల్సిన నగరాలు తీరైన రహదారులు, సరైన రవాణా సదుపాయాలు లేక నరకానికి నకళ్లుగా మారి ప్రజల ప్రాణాల్ని తోడేయడంలో పరస్పరం పోటీపడుతున్నాయి. పుర, నగర పాలికల విధిద్రోహానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా రహదారులపై ఎక్కడికక్కడ గుంతలు- పాదచారులు, వాహన చోదకుల ప్రాణాలతో ప్రతిరోజూ చెలగాటమాడుతున్న దయనీయావస్థకు విరుగుడుగా నిరుడు కర్ణాటక హైకోర్టు శ్లాఘనీయమైన ఆదేశాలు వెలువరించింది. అధ్వానంగా ఉన్న రోడ్లు, పాదచారి మార్గాల వల్ల ఎవరికైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలు తగిలినా వారు ‘బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె’ నుంచి నష్టపరిహారం కోరవచ్చునంటూ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు కావాలనీ నిర్దేశించింది. ఆ ఉత్తర్వుల అమలులో తాత్సారంపై హైకోర్టు కన్నెర్ర చేసిన నేపథ్యంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహానగర పాలికకు అక్కడా తల బొప్పి కట్టింది. రహదారులు సక్రమంగా లేకపోయినా వీధులు, పాదచారి బాటలు గుంతలమయమైనా పౌరుల ప్రాణాలకే ప్రమాదమంటూ హైకోర్టు నిర్ణయానికే సర్వోన్నత న్యాయపాలిక వత్తాసు పలికింది. కర్ణాటక మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టంలో- రోడ్లపై గుంతల వల్ల ప్రమాదానికి గురైనవారికి నష్టపరిహారం చెల్లించే నిబంధన ఏదీ లేదని, నష్టపరిహారంపై ప్రకటనలు ఇస్తే కార్పొరేషన్‌పై ఆర్థికభారం తడిసి మోపెడవుతుందంటూ అధికార శ్రేణులు వినిపించిన వాదనల్ని హైకోర్టు లోగడే కొట్టేసింది. ‘రోడ్లపై గుంతల్ని కేఎమ్‌సీ చట్టం అనుమతిస్తోందా, అక్రమ నిర్మాణాలు చట్టబద్ధమా?’ అంటూ బెంగళూరు నగర పాలిక చెవి మెలేసిన హైకోర్టు న్యాయనిర్ణయం- దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విధివిహిత బాధ్యతల్ని గుర్తుచేస్తోంది. పౌరుల జీవన హక్కే ‘సుప్రీం’ అని సర్వోన్నత న్యాయపాలికే స్పష్టీకరించడంతో- రహదారి భద్రత ఏ మేరకు గాడినపడుతుందో చూడాలి!

‘రాజ్యాంగంలోని 21వ అధికరణ మేరకు గుంతలు లేని రోడ్లు, సరైన పాదచారి బాటలు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు’ అని 2015 మే నెలలో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ అభయ్‌ ఒకా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అదే న్యాయనిర్ణయ ప్రకటనకు సంసిద్ధమైనప్పుడు- బెంగళూరు మహానగర పాలిక అధికార గణం ఏకంగా తమకు సార్వభౌమత్వ రక్షణలు (సావరిన్‌ ఇమ్యూనిటీ) ఉన్నాయని అడ్డంగా వాదించింది. రహదారుల్ని సక్రమంగా నిర్వహించాలన్న ప్రాథమిక విధుల్ని మున్సిపల్‌ అధికారులు అలక్ష్యం చేసినప్పుడు- ఎవరికి ఎలాంటి ప్రమాదం వాటిల్లినా రాజ్యాంగంలోని 226 అధికరణ కింద పరిహారం పొందవచ్చునన్న హైకోర్టు ఆదేశం సంస్తుతి పాత్రమైనది. జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల మేరకే ఏటా లక్షన్నర మందికి పైగా రహదారి ప్రమాదాల్లో కడతేరిపోతున్న దేశంలో- పుర, నగర పాలికల నిర్లక్ష్యానికి సూచికలైన గోతులు వేల కుటుంబాల్లో శోకాగ్నుల్ని రగిలిస్తున్నాయి. 2013-2017 మధ్య అయిదేళ్ల కాలంలో 15 వేలమంది రోడ్లపై గుంతల కారణంగానే మృత్యువాత పడిన బాధాకర వాస్తవాన్ని సుప్రీంకోర్టు నియమించిన కమిటీయే ప్రస్తావించింది. సరిహద్దుల్లో లేదా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కంటే ఈ సంఖ్య అధికమన్న సుప్రీం ధర్మాసనం- అందుకు కార్పొరేషన్లు, జాతీయ హైవే అథారిటీ, గుత్తేదారులు, రాష్ట్రాల రహదారి విభాగాల అధికారులు అందరూ బాధ్యులేనని స్పష్టీకరించింది. గుంతల ద్వారా అభాగ్యుల ప్రాణాలు కబళించడంలో ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమ్‌ బంగ, బిహార్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లదే సింహభాగమని రుజువైన దరిమిలా- పౌరుల ప్రాణాలపట్ల అధికార గణాలకు బాధ్యత మప్పే క్రతువు అన్నిచోట్లా ఊపందుకోవాలి!

మేలిమి ప్రమాణాలతో మౌలిక సౌకర్యాలను పౌరసమాజానికి కల్పించడం, వాటి సక్రమ నిర్వహణకు పూచీపడటం పుర, నగర పాలికల ప్రాథమిక విధి. పల్లెల నుంచి వలసలు పోటెత్తి నగరీకరణ చిలవలు పలవలు వేసుకుపోతున్న వేళ- సవాళ్లకు దీటుగా రాణించాల్సిన కార్పొరేషన్లు అవినీతి అడుసులో నిర్లక్ష్యం మడుగులో ఈదులాడుతున్న నిజం కళ్లకు కడుతూనే ఉంది. నిర్భయ ఘోరకలి నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ- చీకటి శక్తులు తోకముడిచేలా వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారించాలని గట్టిగా సూచించింది. ప్రతి రోజూ సగటున పదిమంది అభాగ్యుల్ని బలిగొంటున్న రహదారి గుంతలపై 2018 జులైలో పార్లమెంటు చర్చించినా, ఒరిగిందేముంది? పేరుగొప్ప జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రోడ్ల భద్రతాంశాల్ని గాలికొదిలేస్తున్న తీరుపై మూడు నెలల క్రితం కేంద్రం తీవ్రంగా స్పందించింది! వాన నీటితో నిండిన గుంతను కడ నిమిషంలో గుర్తించి ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన మహిళను ఓ ట్రక్కు బలిగొన్న ప్రమాదంలో- నిర్లక్ష్యంగా వాహనం నడిపిందంటూ ముంబయి పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన దేశీయంగా పేరుకున్న అవ్యవస్థకు పరాకాష్ఠ! ఈ తరహా ప్రమాదాలకు రోడ్ల గుత్తేదారులనో, ఆయా కార్పొరేషన్లనో జవాబుదారీ చేసి మరణాలకు నష్టపరిహారం రాబట్టాలన్నది సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సూచన. దానికి న్యాయపాలికా తథాస్తు పలుకుతున్న తరుణంలో- ప్రజల మౌలిక అవసరాలకు పుర, నగర పాలికలు నిష్ఠగా నిబద్ధమయ్యే వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూచీపడాలి. అవినీతి కలుపు ఏరివేత నుంచి అభివృద్ధి నిధుల అందజేత దాకా సంస్కరణలు బహుముఖమైతేనే- ప్రజల జీవనహక్కుకు మన్నన దక్కుతుంది!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు