close

ప్ర‌త్యేక క‌థ‌నం

చెంతనే వైద్యం.. మెరుగైతేనే ఫలితం

 5,000 జనాభాకో బస్తీ దవాఖానా
 హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 106 ఏర్పాటు
 త్వరలో మరో 141 నెలకొల్పడానికి సన్నాహాలు
 పెరిగిన రోగుల తాకిడికి తగ్గట్లుగా సన్నద్ధత కరవు
 దిద్దుబాటు చర్యలు చేపడితే మేలంటున్న నిపుణులు

బస్తీ చెంతకే దవాఖానాలొచ్చాయి. 5,000 జనాభా ఉన్న మురికివాడల్లోనూ వైద్యసేవలు అందుబాటులోకొచ్చాయి. జ్వరాల తీవ్రత విజృంభిస్తున్న వేళ.. బస్తీ దవాఖానాల ఓపీ సమయాన్ని కూడా పెంచారు. డెంగీ, మలేరియా పరీక్షలను ఉచితంగా చేస్తామంటూ పెద్ద బోర్డులు ఏర్పాటుచేశారు. సగటున రోజూ 100 మంది వరకు రోగులు వస్తున్నారు. అయితే పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా బస్తీ దవాఖానాల్లో నిర్ధారణ పరీక్షలు, ఔషధ సేవలకు ఆరోగ్యశాఖ సన్నద్ధత కరవైంది. మూడు జిల్లాల్లోని అన్ని నమూనాలను నారాయణగూడలోని పరీక్షల కేంద్రానికి తరలిస్తుండడంతో.. కొన్నిసార్లు ఫలితాలు మూణ్నాలుగు రోజులకోసారి వెల్లడవుతున్నాయి. అంత సమయం వేచిచూడలేక కొందరు ప్రైవేటులో పరీక్షలు చేయించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని 149 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 106 బస్తీ దవాఖానాలు, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, వనస్థలిపురం, నల్గొండల్లోని ఉద్యోగుల ఓపీ కేంద్రాల్లో (వెల్‌నెస్‌ సెంటర్లు) సేకరించిన రక్త, మూత్ర నమూనాలను కూడా తెలంగాణ నిర్ధారణ పరీక్షల కేంద్రానికే తరలిస్తున్నారు. ఇలా అన్నిచోట్ల నుంచి నమూనాలు పెద్దసంఖ్యలో పెరిగిపోవడంతో నిర్ధారణ పరీక్షల రసాయనాలు, కిట్ల కొరతకు దారితీస్తోంది. బస్తీ దవాఖానాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ప్రభుత్వం సత్వరమే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాలని, వీటికి ప్రస్తుతం కేటాయించిన నిధులను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో అత్యధికం

హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ వంటి పెద్దాసుపత్రులు, కింగ్‌ కోఠి, వనస్థలిపురం, కొండాపూర్‌, నాంపల్లి తదితర జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, 149 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ) పనిచేస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవి ప్రాథమిక వైద్యసేవలు అందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బస్తీవాసులకు చేరువలోనే వైద్యసేవలందించాలనే సంకల్పంతో ఆవిర్భవించినవే ‘బస్తీ దవాఖానాలు’. వీటిని 5,000 జనాభా ఉన్న బస్తీల్లో.. అది కూడా వారి నివాస ప్రాంతానికి గరిష్ఠంగా 2-3 కి.మీ. లోపు దూరంలోనే నెలకొల్పారు. త్వరలో వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ నగరాలు, ప్రధాన పట్టణాల్లోనూ వీటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేశానికే ఆదర్శం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానా పథకానికి జాతీయ ఆరోగ్య మిషన్‌ కూడా ఆమోదముద్ర వేసింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ వైద్య సదస్సులో ఈ దవాఖానాల సేవల గురించి కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలూ ఈ పథకం అమలుపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ సదస్సుకు హాజరైన పలువురు కేంద్ర వైద్యాధికారులు హైదరాబాద్‌లోని కొన్ని బస్తీ దవాఖానాల పనితీరును స్వయంగా పరిశీలించారు.

అక్కడక్కడా సమస్యలు

* తరచూ ఔషధాల కొరత ఏర్పడుతోంది. జ్వరం, ఒళ్లునొప్పులు, బీపీ, వాంతులకు సంబంధించిన ఔషధాల సరఫరాలో జాప్యం జరుగుతోంది.
* నిర్ధారణ పరీక్షల ఫలితాలు 24 గంటల్లోనే అందజేస్తున్నా.. రద్దీ కారణంగా మూడు రోజులైనా ఫలితాలు వెల్లడవడంలేదు.
* ఐవీ ద్రావణాలను ఎక్కించేందుకు పరికరాలు సమకూర్చినా.. ప్రస్తుతం అమలు చేయకపోవడంతో వాంతులు, విరేచనాల రోగులు మరో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది.
* అన్ని దవాఖానాల్లోనూ నీటి సమస్య ఉంది.
* పొద్దూమాపూ సేవలందించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి పెరిగిపోతోందని కొందరు వైద్యులు ఆవేదన చెందుతున్నారు.

పరిష్కారమేంటి?
వైద్య సిబ్బందిని పెంచి, రెండు షిప్టుల్లోనూ వైద్యసేవలు కొనసాగిస్తే రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలందుతాయి.

ఇలా ఉంది పరిస్థితి..

* గన్‌ఫౌండ్రీలోని బస్తీ దవాఖానాలో ఐవీ ద్రావణాలు ఎక్కించడానికి పరికరాలను సమకూర్చినా ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు రాకపోవడంతో వాటిని వినియోగించడంలేదు.
* ముత్యాలబాగ్‌, మేదర్‌బస్తీలో వాంతులు, నొప్పి నివారణ మాత్రలు కూడా లేవని స్థానికులు చెప్పారు.
* గడ్డి అన్నారం, రెడ్‌హిల్స్‌లో నిర్ధారణ పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతుండడంతో ఉస్మానియా, గాంధీకి వెళ్తున్నామని రోగులు తెలిపారు.

ముఖ్యమైన పరీక్షలివి..

* సాధారణ రక్త, మల, మూత్ర సమగ్ర పరీక్షలు
* టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ
* కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్‌ పనితీరుపై పరీక్షలు
* రక్తంలో కొలెస్ట్రాల్‌, రక్తంలో మూణ్నెళ్ల సగటు చక్కెరస్థాయి, కీళ్లవాతం తదితర ఖరీదైన పరీక్షలు
* తొలిదశలో 10 బస్తీ దవాఖానాల్లో టెలీవైద్య సేవల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు
* ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రులకు చెందిన స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టులు టెలీ వైద్య విధానంలో రోగులకు సలహాలిస్తారు
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.