close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఓటరు మహాశయా మీ పేరుందా?

జాబితాలో పేరుందో లేదో చూసుకోండి
26 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం

* ఓటరు గుర్తింపు కార్డు ఉంది. కానీ జాబితాలో పేరు లేదు. ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాం.
* గత ఎన్నికల్లో ఓటేశాం. అధికారులు, ఫలానా పార్టీ వాళ్లతో కుమ్మక్కై ఈసారి మా ఓట్లు తీసేశారు.
లాంటి వ్యాఖ్యలు ప్రతి ఎన్నికల్లోనూ వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సుమారు 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓట్లు తొలగించటంతోపాటు ఇష్టారాజ్యంగా బోగస్‌ ఓట్లను చేర్పించారంటూ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి మొరపెట్టుకున్నాయి. అక్కడక్కడా ఇబ్బందులు వాస్తవమేనని, అందుకు క్షమాపణలను కోరుతున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అంగీకరించారు కూడా. వచ్చే ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాను సవరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి. ప్రజలు కూడా ఓటు నమోదు చేసుకోవటంతోపాటు ఓటు ఉందా? లేదా? అన్నది ఎన్నికల సమయంలో పరిశీలించుకోవాలి.

నామినేషన్ల చివరి రోజు వరకు
ఓటు హక్కు నమోదు నిరంతర ప్రక్రియ. ఏడాది పొడవునా నమోదు చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకు ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో కానీ, ప్రత్యక్షంగా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులకు ఓటు హక్కును కల్పిస్తారు.

కార్డున్నా... ఓటు గ్యారెంటీ కాదు
ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఉంటుందన్న హామీ ఏమీ లేదు. ఏటా ఓటర్ల జాబితా సవరిస్తారు. అధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు మీ ఇంటికి తాళం వేసి ఉంటే ఓటు హక్కు రద్దు చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఆ తర్వాత తుది జాబితా ప్రకటించడానికి దాదాపు 45 రోజుల వ్యవధి ఉంటుంది. ఈలోగా జాబితాలో పేరుందా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలి. లేకుంటే ఓటు హక్కు నమోదు చేసుకోవాలి.

ఏ దరఖాస్తు ఎందుకు?

ఫారం - 6
2019 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన వారెవరైనా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఫారం-6ను భర్తీ చేయాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం పరిధిలోకి ఓటు మార్చుకోవాలనుకున్న వారికీ ఇదే దరఖాస్తు.

ఫారం- 6ఎ
విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌరులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలంటే ఈ దరఖాస్తును పూర్తి చేయాలి. ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ లేదా పోస్టు ద్వారానైనా ఈ ఫారాన్ని నింపి పంపవచ్చు.

ఫారం - 7
ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించుకునేందుకు ఈ దరఖాస్తును పూర్తి చేయాలి.

ఫారం - 8
ఓటు హక్కు ఉండి, సవరణలు చేసుకునేందుకు ఈ దరఖాస్తు వెసులుబాటు కల్పిస్తుంది. ఓటరు గుర్తింపు కార్డులో  పేరు, వయసు, బంధుత్వం, ఫొటోల్లో తప్పులు ఉంటే ఈ దరఖాస్తుతో సరిదిద్దుకోవచ్చు.

ఫారం- 8ఎ
ఓటు ఉన్న నియోజకవర్గ పరిధిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇల్లు మారినప్పుడు చిరునామా మార్పు కోసం ఈ దరఖాస్తును వినియోగించుకోవాలి.

ఆన్‌లైన్‌లో..

టు ఉందా? లేదా? సరిచూసుకోవటానికి, ఓటు నమోదు చేసుకునేందుకు ‌www.ceotelangana.nic.in  లేదా www.nvsp.in వెబ్‌సైట్లను పరిశీలించవచ్చు. ఆ రెండు వెబ్‌సైట్లలోకి వెళ్లి సెర్చ్‌ యువర్‌ నేమ్‌ అనే చోట క్లిక్‌ చేసి మీ నియోజకవర్గం, పేరు, ఓటరు గుర్తింపుకార్డు నంబరు నమోదు చేసిన వెంటనే మీకు ఓటు ఉందా? లేదా? ఉంటే ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉందో చెబుతోంది. ఆ రెండు వెబ్‌సైట్ల నుంచి ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు. సీఈవో తెలంగాణ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ-రిజిస్ట్రేషన్‌ లేదా ఎన్వీఎస్పీ వెబ్‌సైట్‌లోకి వెళ్లినా నూతన ఓటరు నమోదు ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయగానే ఓటరు నమోదుపత్రం వస్తుంది. అందులో కావాల్సిన భాషను ఎంపిక చేసుకుని వివరాలను నమోదు చేయటంతోపాటు ఫొటో, చిరునామా నిర్ధారిత పత్రాలను నిక్షిప్తం చేస్తే రశీదు వస్తుంది.

తహసిల్దార్‌ కార్యాలయాల్లో జాబితాలు

హసిల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వారు ఉపకమిషనర్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ఓటర్ల జాబితాలను పరిశీలించి మీ పేరుందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ నెల 26న ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేయనుంది. ఓటు లేదని తేలితే అక్కడ లభించే దరఖాస్తును నింపి ఫొటోతోపాటు ధ్రువపత్రాలను జత చేసి అధికారులకు అందజేయాలి. విచారణ నిర్వహించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తారు.

‘నా ఓటు’ యాప్‌

టీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు అన్వేషణ కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ‘నా ఓటు’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఓటరు ఐడీ నంబరును ఆ యాప్‌లో నమోదు చేయగానే ఓటు ఉందా? లేదా? తెలుస్తుంది. ఓటు ఉంటే ఏ నియోజకవర్గంలో ఉంది? పోలింగ్‌ కేంద్రం వివరాలను చెబుతుంది.  మీరున్న ప్రాంతం నుంచి మీ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు మార్గాన్ని కూడా గూగుల్‌ మ్యాప్‌లో సూచిస్తుంది. దివ్యాంగులైన ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లేందుకు వాహన సదుపాయాన్ని కూడా కల్పించారు.

24 X 7 పని చేసే కాల్‌సెంటర్‌

టు హక్కుపై సందేహాలున్నాయా? ఏదైనా ఫిర్యాదు చేయాలా? అయితే ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన 1950 నంబరును వినియోగించుకోవచ్చు. 24 గంటలపాటు పని చేసే ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే మనం ఏ రాష్ట్రం నుంచి ఫోన్‌ చేశామో ఆ రాష్ట్రంలోని ఎన్నికల సంఘం కాల్‌సెంటరుకు కాల్‌ వెళుతుంది. ఓటు ఉందా? లేదా? అనే సమాచారంతోపాటు ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారి ఫోన్‌ నంబర్లు కావాలన్నా అందుబాటులో ఉంటాయి.

ఓటర్ల జాబితా  సవరణ షెడ్యూల్‌

* ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: 2018 డిసెంబరు 26
* అభ్యంతరాల స్వీకరణ చివరి గడువు: 2019 జనవరి 25
* అభ్యంతరాల పరిష్కార గడువు: 2019 ఫిబ్రవరి 11
* తుది ఓటర్ల జాబితా ప్రచురణ: 2019 ఫిబ్రవరి 22

సరిచూసుకోవటం ఓటరు బాధ్యత
- రజత్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

ఓటు ఉందా? లేదా? అన్నది సరిచూసుకోవటం ప్రజల బాధ్యత. ఓటు లేకపోతే ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాను ఏటా సవరిస్తారు. నియోజకవర్గం మారిన ప్రతి సందర్భంలోనూ సంబంధిత ఓటర్ల జాబితాను సవరణ చేసుకోవాలి. ప్రజలు అనుకున్నట్లుగా ఓటు హక్కును తొలగించటం సులువేమీ కాదు. ముందస్తుగా ఆ ఓటరుకు ఏడు రోజుల వ్యవధితో నోటీసు జారీ చేయాలి. ఆ తర్వాతే జాబితా నుంచి ఓటరు పేరును తొలగిస్తారు.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.