close

ప్ర‌త్యేక క‌థ‌నం

హుగ్లీ తీరం.. ఎవరికి వరం

పశ్చిమబెంగాల్‌లో ఐదో దశ పోలింగ్‌ సందడంతా హుగ్లీ నది చుట్టూనే
(పశ్చిమబెంగాల్‌ నుంచి శంతను సన్యాల్‌)

దేశానికి తూర్పున ఉన్న పశ్చిమబెంగాల్‌ గురించి మాట్లాడాల్సి వస్తే.. హుగ్లీ నది ప్రస్తావన లేకుండా ముగియదు. వంగ రాష్ట్ర ప్రజలకు ఆ నదితో ఉన్న అనుబంధం అలాంటిది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లో ఐదో దశలో పోలింగ్‌ జరగనున్న ఏడు నియోజకవర్గాల్లో 5 స్థానాలు (హావ్‌డా, ఉలూబెరియా, శ్రీరాంపుర్‌, హుగ్లీ, బైరక్‌పుర్‌) హుగ్లీ నదికి రెండువైపులా విస్తరించినవే. బంగాళాదుంపల సాగుకు పెట్టింది పేరైన ఈ ప్రాంతాల్లో ఈ నెల ఆరో తేదీన పోలింగ్‌ జరగనుంది.

బన్‌గావ్‌ మతువా తెగే నిర్ణయాత్మకం

24 పరగణాల జిల్లాలో ఉన్న బన్‌గావ్‌ నియోజకవర్గంలో మతువా తెగ ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్రంలోని ఎస్టీ తెగల్లో వీరే అధికం. రాష్ట్రవ్యాప్తంగా మతువాలు ఉన్నా బన్‌గావ్‌ పరిధిలోని ఠాకుర్‌నగర్‌లో ఎక్కువగా ఉంటారు. అన్ని పార్టీలతో వీరికి సత్సంబంధాలు ఉన్నాయి. లక్షలాది మంది మతువాలు సభ్యులుగా ఉన్న ఆధ్యాత్మిక సంస్థ మతువా మహాసంఘ్‌కు నేతృత్వం వహించే ‘బరామా’ మరణానంతరం ఆమె కుటుంబం రెండుగా చీలిపోయింది. బరామా కోడలు, సిటింగ్‌ ఎంపీ మమతబాల ఠాకుర్‌ ఓ వర్గానికి నేతృత్వం వహిస్తుండగా, శంతను ఠాకుర్‌ మరో వర్గానికి నేతృత్వం వహిస్తూ భాజపాకు మద్దతు పలుకుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బరామా కుమారుడు కపిల్‌కృష్ణ ఠాకుర్‌ బన్‌గావ్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి విజయం సాధించారు. అనంతరం కపిల్‌కృష్ణ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య మమత విజయం సాధించారు. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుకు దగ్గరగా ఉన్న బన్‌గావ్‌ పట్టణం నుంచి పశువుల అక్రమరవాణా ఎక్కువ. అధికారులకు ఇదే అతిపెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.

హావ్‌డా ఏదీ గత వైభవం

నిత్యం రద్దీగా ఉండే హావ్‌డా నగరం సహా ఏడు శాసనసభ స్థానాలు ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. లోహాలను కరిగించి విగ్రహాలు తయారుచేసే కళకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. భారీ పరిశ్రమలు, ఓడల మరమ్మతు కేంద్రాలు, రసాయన పరిశ్రమలు ఎక్కువ. ఇదంతా గతం. ప్రస్తుతం పరిశ్రమలు కనుమరుగై.. స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ప్రజలు అప్పటి వైభవాన్ని తలచుకుని మౌనంగా రోదిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటిష్‌ రోజుల నాటి బొటానికల్‌ గార్డెన్‌, ఇంజినీరింగ్‌ కళాశాల ఒక్కటే అప్పటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో 25 శాతం వరకు రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ నుంచి వచ్చిన హిందీ మాట్లాడే ప్రజలు. ప్రస్తుతం ఇక్కడి నుంచి భాజపా తరఫున రోట్నీదేవ్‌ సేన్‌గుప్తా, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి సిటింగ్‌ ఎంపీ, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ప్రసూన్‌ సేన్‌గుప్తా బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌, సీపీఎంల నుంచి అభ్యర్థులు  పోటీచేస్తున్నారు. ప్రసూన్‌ సేన్‌గుప్తా పేరు శారదా కుంభకోణంలో వినిపించడం ఆయనను ఇబ్బందికి గురిచేసే అంశం.

హుగ్లీ ‘శిథిల’ చరిత్రకు ప్రతిరూపం

టాటా నానో కార్ల పరిశ్రమ విషయంలో ఆందోళనలు చెలరేగడంతో దేశవ్యాప్తంగా పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కిన ప్రాంతం సింగూరు. ఈ ఆందోళనలకు నేతృత్వం వహించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమత అనంతర కాలంలో అధికారం దక్కించుకున్నారు. ఈ ఆందోళనలు తృణమూల్‌కు ఉపయోగపడినా.. ప్రజలకు ప్రయోజనం కలగలేదు. హుగ్లీ లోక్‌సభ పరిధిలోని సింగూరు సహా ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో చాలామటుకు తరలిపోయాయి. వీటిలో డన్‌లప్‌ టైర్లు ఒకటి. బంగాళాదుంపల సాగుకు హుగ్లీ ప్రసిద్ధి. ధరలో హెచ్చుతగ్గులు, శీతల గిడ్డంగుల లేమి రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. 1989 నుంచి 2009 వరకు హుగ్లీ నుంచి రూపాచంద్‌ పాల్‌ గెలిచారు. 2009లో సీపీఎం అభ్యర్థి రత్నదే నాగ్‌ గెలుపొందారు. ప్రస్తుతం ఆమే సిటింగ్‌ ఎంపీ. భాజపా తరఫున మాజీ సినీ నటుడు లాకెట్‌ ఛటర్జీ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌, సీపీఎంలు అభ్యర్థులను బరిలో ఉంచాయి. 

శ్రీరాంపుర్‌ తరలిపోతున్న పరిశ్రమలు

హుగ్లీ జిల్లాలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం శ్రీరాంపుర్‌. హావ్‌డా జిల్లా లోని జగత్‌బల్లావ్‌పుర్‌, దోంజుర్‌ శాసనసభ స్థానాలూ శ్రీరాంపుర్‌ లోక్‌సభ పరిధిలోనే ఉంటాయి. ఈ నియోజకవర్గంలో గతంలో ఓ వెలుగు వెలిగిన పారిశ్రామిక వాడలు, జౌళి పరిశ్రమలు, ఔషధ పరిశ్రమలు ప్రస్తుతం మూతపడ్డాయి. ముస్లింలకు పవిత్ర క్షేత్రంగా ఉన్న ఫుర్‌ఫురా షరీఫ్‌కు రైలు సౌకర్యం దశాబ్దాలుగా హామీగానే మిగిలిపోయింది. ఈ విషయమై అవసరమైన చర్యలు చేపడతానని రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో మమతా బెనర్జీ హామీ ఇచ్చినా.. అది నెరవేరలేదు. ముస్లిం ఓటర్లు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడి నుంచి రెండు సార్లు విజయం సాధించిన కల్యాణ్‌సింగ్‌ మరోమారు తృణమూల్‌ తరఫున బరిలో నిలిచారు.  భాజపా నుంచి దేవాజిత్‌ సర్కార్‌, సీపీఎం తరఫున తీర్థాంకర్‌ రాయ్‌, కాంగ్రెస్‌ నుంచి దేవవ్రత విశ్వాస్‌ పోటీ చేస్తున్నారు.

బైరక్‌పుర్‌ రాష్ట్రేతరుల పోరు గడ్డ

భారీస్థాయిలో పరిశ్రమలున్న బైరక్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో హిందీ రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరపడినవారే ఎక్కువ. ఇక్కడి నుంచి భాజపా తరఫున ఇటీవల వరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా ఉన్న అర్జున్‌ సింగ్‌ పోటీచేస్తున్నారు. ఈయన రాష్ట్రేతరుడు. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీచేస్తున్న దినేశ్‌ త్రివేదీ గుజరాతీయుడు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన త్రివేదీ రైల్వే మంత్రిగా పనిచేశారు. భాట్‌పరా ఎమ్మెల్యే అర్జున్‌సింగ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడేవరకూ.. దినేశ్‌ త్రివేదీకి కుడి భుజంగా ఉండేవారు. భాట్‌పరా శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో అర్జున్‌ కుమారుడు పవన్‌ భాజపా తరఫున పోటీచేస్తున్నారు. టీఎంసీ నుంచి ఒకప్పుడు మమతా బెనర్జీతో సన్నిహితంగా ఉన్న మదన్‌ మిత్ర బరిలో ఉన్నారు. అనేక జౌళి మిల్లులు, ఇంజినీరింగ్‌ కర్మాగారాలు మూత పడడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీటిని తిరిగి తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయడంలో సిటింగ్‌ ఎంపీ ఏమీ చేయలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

ఉలూబెరియా ముస్లిం ఓటర్లే కీలకం

హావ్‌డా జిల్లాలోనే ఉన్న మరో నియోజకవర్గమైన ఉలూబెరియాలో ముస్లింలు 40శాతం వరకు ఉన్నారు. భాజపా తప్ప అన్ని పార్టీలు ఇక్కడ ముస్లిం అభ్యర్థులకే టికెట్లు ఇచ్చాయి. సీపీఎం కంచుకోటగా ఉన్న ఉలూబెరియాకు 1980 నుంచి 2009 వరకు హనన్‌ మొల్లా ఎంపీగా ఉన్నారు. 2009లో టీఎంసీ తరఫున సుల్తాన్‌ అహ్మద్‌ ఎన్నికయ్యారు. 2014లోనూ విజయం సాధించారు. 2017లో సుల్తాన్‌ అహ్మద్‌ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సాజ్దా అహ్మద్‌ విజయం సాధించారు. మరోమారు తృణమూల్‌ తరఫున బరిలో నిలిచారు. భాజపా తరఫున జాయ్‌ బెనర్జీ పోటీ చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఉలుబేరియా నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టానని, పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం తన చొరవతోనే వచ్చిందని చెబుతూ సాజ్దా ప్రచారంలో దూసుకు వెళుతున్నారు.

ఆరాంబాగ్‌ నీటిపారుదల అంశాలే కీలకం

ఆరాంబాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం 2008 నుంచి ఎస్టీలకు రిజర్వు అయింది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. వ్యవసాయ సమస్యలతో పాటు.. దిగువ దామోదర్‌ నీటిపారుదల ప్రాజెక్టు, ముందేశ్వరి, ద్వారకేశ్వర్‌, దామోదర్‌ నదులపై వంతెల నిర్మాణం చాన్నాళ్లుగా నత్తనడకన సాగుతుండడంపై ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడి  నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున సిటింగ్‌ ఎంపీ అపురూప పొద్దార్‌ మరోమారు పోటీచేస్తున్నారు. భాజపా నుంచి కుమార్‌ రాయ్‌, సీపీఎం నుంచి శక్తి మోహన్‌ మాలిక్‌, కాంగ్రెస్‌ నుంచి జ్యోతికుమార్‌ దాస్‌ బరిలో నిలిచారు. ప్రధాన పోటీ తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం అభ్యర్థుల మధ్యే ఉండనుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.