Top Ten News @ 9 PM

తాజా వార్తలు

Updated : 20/04/2021 21:45 IST

Top Ten News @ 9 PM

1. Curfew వేళ ప్రజలు సహకరించాలి: డీజీపీ

తెలంగాణలో రాత్రి వేళ కర్ఫ్యూ పటిష్ఠంగా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి పోలీసులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో ఈ రోజు రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నందున పోలీసు జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్ఫ్యూ నిబంధనలపై పౌరులను చైతన్యపర్చాలని సూచించారు. స్వీయరక్షణకు ఎంత బాధ్యతగా ఉంటామో సమాజ శ్రేయస్సు విషయంలోనూ అంతే బాధ్యతగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాత్రి కర్ఫ్యూ కంటితుడుపు చర్య: భట్టి

2. డైట్‌ సప్లిమెంట్స్‌: కొవిడ్‌ ముప్పును తగ్గిస్తాయా..?

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. దీనిబారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ పోషకాల (డైట్‌ సప్లిమెంట్స్‌) వాడటం వల్ల కరోనా వైరస్‌ ముప్పు నుంచి కాస్త రక్షణ పొందవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మల్టీవిటమిన్లు, ఒమేగా-3, విటమిన్‌-డీ సప్లిమెంట్‌లు కరోనా వైరస్‌ ముప్పును తగ్గిస్తాయని బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన నివేదిక బీఎంజే న్యూట్రీషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మరింత తీవ్రమైన సవాలు: మోదీ

కొవిడ్‌ రెండో వేవ్ తుపానులా‌ విరుచుకుపడిందని.. ఈసారి అది మరింత తీవ్రమైన సవాలు విసురుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి మనం తప్పక బయటపడాలన్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Corona: ఏపీలో భారీగా పెరిగిన కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 37,922 నమూనాలను పరీక్షించగా 8,987 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే  ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,347, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 99 మందికి వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,76,987కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: 25నుంచి గుంటూరులో రాత్రి కర్ఫ్యూ

5. తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్‌

 కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాత్రి 9 తర్వాత దుకాణాలు, హోటళ్లు, బార్లు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూవీ థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లను మూసివేయనున్నట్లు ఈ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌

Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ ఛానళ్లలో అవకాశాల పేరుతో ఓ బాలికను భార్గవ్‌ మోసం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈనెల 16న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు.. విచారణ చేపట్టి హైదరాబాద్‌లో భార్గవ్‌ను అరెస్ట్‌ చేశారు. అతడిపై పోక్సో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒకే దేశం.. ఒకటే ధర: కాంగ్రెస్‌

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ ధరల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఆక్షేపించింది.  ఒకే దేశం- ఒకే మార్కెట్‌ అని నినదించే కేంద్రం.. వ్యాక్సిన్‌ విషయంలో ‘ఒకే దేశం... ఒకటే ధర’ అని ఎందుకు అనడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం విమర్శించారు.‘‘ వ్యాక్సిన్‌ తయారీదారులకు లాభాలొస్తాయంటే మాకేం సమస్య లేదు.కానీ, కేంద్రం తన బాధ్యతను మరువకూడదు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ధోనీ వారసుడిగా జడేజా..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో మహేంద్రసింగ్‌ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు అన్ని అర్హతలు ఉన్నాయని, ధోనీ వారసుడిగా అతడే సరైన ఆటగాడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాటు ఆలోచనా విధానం కూడా బాగుంటుందని కొనియాడాడు. ఈ నేపథ్యంలోనే జడేజాను భవిష్యత్‌ కెప్టెన్‌గా భావిస్తూ చెన్నై సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలని వాన్‌ సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫైజర్‌ టీకా: భారత వేరియంట్లపై పనిచేస్తుందా..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోన్న వేళ.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్‌లు సవాల్‌గా మారాయి. ఈ కొత్తరకాలను ప్రస్తుతం వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌లు ఎదుర్కొంటాయా అనే కోణంలో ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో వెలుగుచూసిన కరోనా కొత్తరకం వేరియంట్‌పై ఫైజర్‌ టీకా పాక్షికంగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సినీ కార్మికులకు ఉచితంగా టీకా: చిరంజీవి

కరోనా సమయంలో తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమలోని వారందరి నుంచి విరాళాలు సేకరించి కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా లాక్‌డౌన్‌లో సమయంలో కార్మికులకు నిత్యావసరాలు అందించారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి పర్యవేక్షణలో సాగిన సీసీసీ ఇప్పుడు మరో బృహత్‌ కార్యానికి నడుం బిగించింది. సినీ పరిశ్రమలో 45ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు వీడియోను పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పునర్నవి యోగా.. రకుల్‌ ట్రెక్కింగ్‌ కథలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని