ప్రధానాంశాలు

Published : 28/08/2020 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా.. ఎందుకో తెలుసా? 

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కమలేశ్‌ నాగర్‌కోటి

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆరు నెలలు వాయిదా పడినా అటు అభిమానులు, ఇటు క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈమెగా ఈవెంట్‌ ప్రారంభమవుతుందా అని వేచి చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే అందర్నీ ఆకట్టుకునేలా నిర్వహించాలని బీసీసీఐతో పాటు, యూఏఈ క్రికెట్‌ బోర్డు కూడా తీవ్రంగా కష్టపడుతోంది. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంఛైజీలు ఇప్పటికే దుబాయ్‌, అబుదాబికి చేరుకున్నాయి. అయితే, దుబాయ్‌లో బస చేస్తున్న జట్లలో కొన్ని క్వారెంటైన్‌ సమయాన్ని పూర్తి చేసుకోగా దిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గడువు రేపటితో ముగుస్తుంది. దీంతో చెన్నై, ఆర్సీబీ, రాజస్థాన్‌, పంజాబ్‌ జట్లు ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్‌ మొదలు పెట్టాయి. 

మరోవైపు అబుదాబికి వెళ్లిన ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో వారం రోజులు క్వారెంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ఆ రెండు జట్ల పరిస్థితి మరోలా ఉంది. ఈ క్రమంలోనే పలువురు కోల్‌కతా క్రికెటర్లు గురువారం పలు వీడియోల్లో మాట్లాడారు. వాటిని ఆ జట్టు ట్విటర్‌లో పంచుకుంది. ఈ సందర్భంగా ఇండియా ఏ క్రికెటర్‌ కమలేశ్‌ నాగర్‌కోటి మాట్లాడాడు. 2018లోనే ఆ జట్టుకు ఎంపికైనా కమలేశ్‌ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈసారి ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. 

‘ఈసారి ఐపీఎల్‌ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే దీని కోసం రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నా. చివరికి ఇప్పుడా అవకాశం వచ్చింది. కాబట్టి నేనెంతో ఆనందంగా ఉన్నా. గాయాల కారణంగా ఇంతకుముందు సీజన్లలో ఆడలేకపోయా. తర్వాత ముంబయిలో ఎంతో కష్టపడి సాధన‌ చేశాను. మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై అవసరమైనప్పుడల్లా మా సహాయక సిబ్బందిని సంప్రదించా. అలాగే ఏడాది కాలంగా ఆటకు దూరమయ్యా. ఆ సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా ఉండే అవకాశం దొరికింది. అలాగే ఇంతకుముందు పుస్తకాలు చదివే అలవాటు లేకుండేది. ఇప్పుడు అది కూడా ప్రారంభించా. ఇంట్లోనే శారీరక వ్యాయామాలు కూడా సాధన చేశా. ఇప్పుడు కోల్‌కతాకు బౌలింగ్‌ చేసే అవకాశం వస్తే తప్పకుండా మంచి ప్రదర్శన చేస్తా. కేకేఆర్‌ తరఫున ఆడటం కోసం ఆసక్తిగా ఉన్నా’ అని కమలేశ్‌ పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net