
తాజా వార్తలు
ఒకే ఆటగాడు. ఒకే బంతి.. రెండుసార్లు రనౌట్
బిగ్‌బాష్ లీగ్‌లో అనూహ్య ఘటన..
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్లో అప్పుడప్పుడూ కొన్ని సరదా సంఘటనలు.. ఆసక్తికర విశేషాలు చోటుచేసుకుంటాయి. అవి ఫీల్డర్ల మెరుపు విన్యాసాలైనా అవ్వచ్చు.. వికెట్ కీపర్ల నైపుణ్యాలైనా ఉండొచ్చు. ఈ ఫీల్డింగ్ విన్యాసాలతో.. ఒకే ఆటగాడు.. ఒకే బంతికి రెండుసార్లు రనౌటయ్యాడు.. అది కూడా రెండు వైపులా. ఇలాంటి ఘటన ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ, అదే జరిగింది ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న బిగ్‌బాష్ టీ20 క్రికెట్ లీగ్‌లో. ఆ విశేషాలేంటో మీరే చదవండి..
అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్ జట్ల మధ్య ఆదివారం 51వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అడిలైడ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడగా జేక్ వెదరాల్డ్(31) అనే బ్యాట్స్‌మన్ ఒకే బంతికి రెండుసార్లు రనౌటయ్యాడు. క్రిస్‌గ్రీన్ వేసిన 10వ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న ఫిలిప్ సాల్ట్(31) ఒక బంతిని నేరుగా బౌలర్‌వైపే షాట్ ఆడాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జేక్ క్రీజుదాటి ముందుకు వచ్చాడు. అప్పటికే ఆ బంతి బౌలర్ చేతికి తాకుతూ వికెట్లను కొట్టేసింది. అసలేం జరిగిందో అర్థంకాని జేక్ ఆ బంతిని చూస్తూ అక్కడే నిలిచిపోయాడు. ఈలోపు షాట్ ఆడిన ఫిలిప్ సింగిల్ కోసం యత్నించాడు. ఆలస్యంగా స్పందించిన జేక్ కీపర్ వైపు పరుగెత్తగా ఆలోపే ఫీల్డర్ బంతిని అందుకొని కీపర్‌కు విసిరాడు. జేక్ క్రీజులోకి చేరేలోపే కీపర్ వికెట్లను గిరాటేశాడు.
టీవీ రీప్లేలో జేక్ రెండు వైపులా రనౌటైనట్లు తేలింది. అయితే, తొలుత బౌలర్ చేతికి బంతి తగిలి బెయిల్స్ ఎగరడంతో ఆ వికెట్ క్రిస్‌గ్రీన్ ఖాతాలో చేరింది. ఈ వీడియోను బిగ్‌బాష్ లీగ్ ట్విటర్లో పంచుకోగా అది వైరల్‌గా మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో చివరికి అడిలైడ్ జట్టే విజయం సాధించింది. తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 159/6 స్కోర్ సాధించగా, ఛేదనలో సిడ్నీ థండర్స్ 20 ఓవర్లకు 153/7తో నిలిచింది. దీంతో అడిలైడ్ 6 పరుగుల స్వల్ప తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇవీ చదవండి..
యువ హవా