close

తాజా వార్తలు

Published : 17/01/2021 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆ మార్పును గుర్తించలేకపోయాం: కిషన్‌రెడ్డి

మజ్లిస్‌‌ పార్టీతో స్నేహం లేకపోయుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో కూడా తెరాస గెలిచేది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు చేసుకున్న చీకటి ఒప్పందం కారణంగానే తెరాస 50కి పైగా స్థానాల్లో గెలవగలిగిందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన భాజపా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయన్నారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ రాష్ట్రంలో దుబ్బాక తరహా పోటీ నెలకొందని.. 17 స్థానాల్లో పోటీ చేస్తే తెరాస కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగిందన్నారు. అయితే ఆ విషయాన్ని రాజకీయ పార్టీగా తెలుసుకోలేకపోయామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైతుల ఉద్యమం: 19న నిపుణుల కమిటీ భేటీ!

కొత్త వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ తొలి భేటీ ఈ నెల 19న జరుగనున్నట్లు సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ వెల్లడించారు.  ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. అయితే ఈ భేటీలో అనిల్‌ ఘన్వాత్‌తో పాటు డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీ, అశోక్‌ గులాటీలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. సభ్యుల్లో మరొకరైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇదివరకే వెల్లడించిన నేపథ్యంలో అప్పటిలోగా సుప్రీంకోర్టు మరో సభ్యుడిని సూచించకపోతే కేవలం ముగ్గురు సభ్యులం మాత్రమే హాజరవుతామని అనిల్‌ ఘన్వాత్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రైతుల ఆదాయం రెట్టింపు కోసమే..సాగు చట్టాలు!

3. టీకా పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డ్‌!

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా భారత్‌ రికార్డు స్థాయిలో టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజే  దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని తెలిపింది. ఇది అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒకేరోజు వేసిన సంఖ్య కంటే ఎక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహన్ అగ్నాని వెల్లడించారు. తొలి రోజు రెండు లక్షల 7వేల మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, రెండో రోజు 17 వేల మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఇప్పటి వరకు 2,24,301 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన వాహనాలతో జాతీయ రహదారిపై ఆదివారం రద్దీ నెలకొంది. సొంత, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు భాగ్యనగరానికి పయనం కావడంతో ఏపీలోని కృష్ణా జిల్లా కీసర, చిల్లకల్లు.. తెలంగాణలోని చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ఫ్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు కీసర టోల్‌ వసూలు కేంద్రం వద్ద నాలుగు వరుసలు ఉండగా, అదనంగా మరో రెండు వరుసల్లో వాహనాలను అనుమతించారు. టోల్‌ వసూలు కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీజీ.. జీ-7 సదస్సుకి అతిథిగా రండి!

ఈ ఏడాది జ‌రగ‌బోయే జీ-7 స‌ద‌స్సుకు హాజ‌రు కావాల్సిందిగా ప్రధాని న‌రేంద్ర మోదీని యునైటెడ్ కింగ్‌డ‌మ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్‌ తీర ప్రాంతంలో ఉన్న కార్న్‌వాల్‌ రిసార్ట్‌ వేదిక కానుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల కూటమే ఈ జీ-7. ఈ స‌ద‌స్సులో భాగంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి, ప‌ర్యావ‌ర‌ణ మార్పులు, సాంకేతిక‌ప‌ర‌మైన అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కర‌ణ‌లు, స్వేచ్ఛా వాణిజ్యంపై చ‌ర్చించ‌నున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ-కామర్స్‌ ఆఫర్ల సందడి!

పండగలు.. ప్రత్యేక రోజుల్లో కొనుగోలుదారుల కోసం ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటించే ఈ-కామర్స్‌ సంస్థలు.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి ఆఫర్లు ప్రకటించాయి. ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ పేరుతో అమెజాన్‌.. ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ మరో రెండ్రోజుల్లో అమ్మకాలు ప్రారంభించనున్నాయి. జనవరి 20వ తేదీన ప్రారంభమయ్యే ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ జనవరి 23న ముగుస్తుంది. అయితే, ప్రైమ్‌ చందాదారులకు ఒక్క రోజు ముందే అంటే.. 19వ తేదీనే ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసే వస్తువులపై పదిశాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మహీంద్రా బంపర్‌ ఆఫర్‌..!

7. కర్ణాటకతో వివాదం.. ఉద్ధవ్‌ కీలక వ్యాఖ్యలు

మరాఠీ మాట్లాడే ప్రాంతాల విషయంలో కర్ణాటకతో నెలకొన్న వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రం పరిధిలో ఉన్న మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తిరిగి రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆయా ప్రాంతాల కోసం ప్రాణాలర్పించిన వారికి ఇదే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఆదివారం ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం కర్ణాటక పరిధిలో ఉన్న బెల్గాం, కొన్ని ఇతర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం: శివసేన

8. ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు అత్యాచారం!

మధ్యప్రదేశ్‌లో వరుస అత్యాచార ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల సింధి జిల్లాలో ఓ 45 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం మరువక ముందే.. ఉమేరియా జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది మంది వ్యక్తులు 13ఏళ్ల బాలికపై ఐదురోజుల వ్యవధిలో రెండు సార్లు సామూహికంగా అత్యాచారానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఏళ్ల బాలిక తనకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా జనవరి 4వ తేదీన తొలిసారి అపహరణకు గురైంది. అపహరించిన యువకుడితో పాటు మరో ఆరుగురు వ్యక్తులు బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు

బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన ఏకాగ్రత దెబ్బతీయడానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారని టీమిండియా పేసర్‌ శార్దూల్ ఠాకూర్‌ తెలిపాడు. 186/6 స్కోరుతో కష్టాల్లో ఉన్న జట్టును సుందర్‌ (62)తో కలిసి శార్దూల్ (67) ఆదుకున్న విషయం తెలిసిందే. ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్ధశతకాన్ని సాధించాడు. కాగా, మూడో రోజు ఆట ముగిసిన అనంతరం తన ప్రదర్శనపై శార్దూల్ మీడియాతో మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నాన్న.. నా హీరో! 

10. సోనూసూద్‌ హీరోగా ‘క్రాక్‌’ రీమేక్‌..!

సోనూసూద్‌ హీరోగా మారనున్నాడట. ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్న ‘క్రాక్‌’ను హిందీలో రీమేక్‌ చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. బీటౌన్‌లో సాగుతున్న చర్చ ఇది. ఇటీవల మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్‌’ విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందులో ప్రధానపాత్ర పోషించేందుకు సోనూసూద్‌ ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడట. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని