close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలి

ఫిర్యాదు చేయడానికి వెబ్‌లింక్‌ సౌకర్యం కల్పించాలి
కేంద్రం ఇచ్చిన అధికారాలతో ఫీజులు నిర్ణయించాలి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాల్సిందేనంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులు చేయడానికి వెబ్‌లింక్‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. కేంద్రం బదలాయించిన అధికారాల ఆధారంగా వివిధ టెస్ట్‌లు, ప్రొసీజర్లకు ఫీజులను నిర్ణయించాలని ఆదేశించింది. కరోనా పరీక్షలకు, చికిత్సకు ఫీజులను నిర్దేశిస్తూ ప్రభుత్వం జూన్‌ 15, జులై 6న జారీ చేసిన జీవోల్లోని అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. నిర్ణీత ధరల్లో సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ వంటి పరీక్షలను చేర్చలేదని, బీమాకు, ప్రైవేటు ఆస్పత్రులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నవారికి ఈ ధరలు వర్తించవన్న విషయాన్ని తెలపాలంది. కరోనా వైద్యానికి సంబంధించి ప్రభుత్వ జీవోలు, ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజులతో ప్రజల్లో అయోమయం నెలకొందని, వీటిపై స్పష్టతనివ్వాలంది.
ప్రైవేటు ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్లు చెబుతున్న ప్రకారం నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో మనోజ్‌ కొఠారి అనే వ్యక్తికి రూ.4.21 లక్షలు బిల్లు వేశారని, రూ.1.21 లక్షలు బీమా కింద రాగా మిగిలిన మొత్తం చెల్లించేదాకా రోగిని నిర్బంధంలోనే ఉంచారంది. దీనిపై పంజాగుట్టస్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారంది. మరో ఆసుపత్రిలో చికిత్స పొందిన మీర్‌ అలీఖాన్‌కు రూ.4.25 లక్షల బిల్లు వేశారని, ఈ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారా? అని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావును ప్రశ్నించింది. ఫీజులను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రైవేటు ఆస్పత్రులు ఉల్లంఘిస్తున్నాయని, వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని నోటీసులిచ్చారా? ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ ఉందా? లేదా? అని ప్రశ్నించింది. డైరెక్టర్‌ సమాధానమిస్తూ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌, ఎపిడమిక్‌ డిసీజ్‌ చట్టాల కింద లైసెన్సులను రద్దు చేయవచ్చన్నారు. జిల్లాల్లో జిల్లా వైద్యాధికారికి, రాష్ట్రంలో డైరెక్టర్‌కు ఆ అధికారాలున్నాయనగా.. ఏవైనా ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారా? అని ప్రశ్నించింది. ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో ఎందుకు స్వీకరించరాదనగా 104 నంబరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, ఫోను చేస్తే స్పందిస్తామని డైరెక్టర్‌ చెప్పారు.
పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.ఎస్‌.అర్జున్‌కుమార్‌ తమకు ఇచ్చిన అఫిడవిట్‌లో గాంధీలో 1141 బెడ్‌లు ఖాళీ ఉన్నాయన్నారని, కొవిడ్‌ ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం లేకపోతే చికిత్స అందించడంలేదని, దీన్ని ప్రైవేటు ఆస్పత్రులు అవకాశంగా తీసుకుంటున్నాయన్నారు. మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రతాప్‌ నారాయణ్‌ సంఘీ వాదనలు వినిపిస్తూ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఫీజులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అలా తెలంగాణలో ఎందుకు అమలు చేయరాదని ధర్మాసనం ప్రశ్నించింది. ఫీజులను నిర్దేశించే అధికారం రాష్ట్రానికి లేదని డైరెక్టర్‌ తెలిపారు. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు అప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తూ ఫీజులను నిర్దేశించే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం లేఖలు రాసిందని, ఈ విషయాన్ని కేంద్రం కోర్టుకు తెలిపింద]న్నారు.ఆ లేఖ అందలేదని డైరెక్టర్‌ చెప్పగా.. దాన్ని ప్రభుత్వానికి అందజేయాలని కేంద్రం తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. కేంద్రం బదలాయించిన అధికారాలతో టెస్ట్‌లు, ప్రొసీజర్‌కు ఫీజులను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 27కు వాయిదా వేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.