close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీకా కేక!

ప్రజల నుంచి అనూహ్య స్పందన
90 శాతం మందికి పైగా స్వీకరణ
పంపిణీ కేంద్రాల సంఖ్య పెంపు
నేటి నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ...

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ టీకాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి, 45-59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మూడు రోజులుగా కొనసాగుతున్న పంపిణీలో దాదాపు 90 శాతానికి పైగా లబ్ధిదారులు టీకాలు పొందడం విశేషం. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మూణ్నాలుగు రోజుల వరకూ టీకాలకు సమయం లభించకపోవడం స్పందనకు నిదర్శనం. దీంతో గురువారం నుంచి అన్ని జిల్లా, ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలివ్వాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. స్పందన అధికంగా ఉన్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కేంద్రాల సంఖ్య, రోజువారీ టీకాల పరిమితిని కూడా పెంచారు. ప్రస్తుతం 121 ప్రైవేటు ఆసుపత్రుల్లో పంపిణీ కొనసాగుతుండగా.. గురువారం నుంచి మరో 195 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అనుమతించారు. రోజుకు 100 మందికి టీకాలు వేయాలన్న పరిమితిని కొన్ని ఆసుపత్రుల్లో 400-800కి పెంచారు. మున్ముందు మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులకూ అనుమతులు ఇవ్వనున్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

మరో 15,474 మందికి..
రాష్ట్రంలో బుధవారం 60 ఏళ్లు, 45-59 ఏళ్ల విభాగాల్లో 15,474 మందికి టీకా వేశారు. 171 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,526 మంది లక్ష్యం కాగా, 7,203 (96 శాతం) మంది టీకాలు పొందారు. 121 ప్రైవేటు ఆసుపత్రుల్లో 8,963 మందికి గాను, 8,271 (92 శాతం) మంది స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ కేటగిరీల్లో 28,555 మందికి పంపిణీ పూర్తయ్యింది. వైద్యసిబ్బందిలో 618 మంది తొలిడోసు, 3,893 మంది రెండోడోసు స్వీకరించారు. పోలీసులు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బందిలో తాజాగా 260 మంది తొలిడోసు, ఆరుగురు రెండోడోసు తీసుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు