చెరువులున్నది విగ్రహాలు వేయడానికా?

ప్రధానాంశాలు

చెరువులున్నది విగ్రహాలు వేయడానికా?

 హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై వైఖరి చెప్పండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ‘చెరువులు ఉన్నది విగ్రహాల నిమజ్జనాల కోసం కాదు. వాటిని శుభ్రంగా నిర్వహించడంతోపాటు సుందరీకరణ చేసి ప్రజలను ఆకర్షితులను చేయాల్సి ఉండగా చెడగొడతారా? విశ్వాసాలు ఉండవచ్చు. కానీ వాటికి మరోమార్గం కూడా ఉంది’ అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొవిడ్‌ నేపథ్యంలో సెప్టెంబరులో జరిగే వినాయక చవితికి, విగ్రహాల నిమజ్జనానికి అనుమతిస్తున్నారో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయం తీసుకునే ముందు కొవిడ్‌ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని, ముంచుకొచ్చే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తూ విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.  ప్రతి సంవత్సరం కోర్టు ఎందుకు పర్యవేక్షించాలని ప్రశ్నించింది. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గతంలో ఇచ్చిన పలు ఉత్తర్వులు అమలుకాకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ వాదనలు వినిపిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పారు. ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పరిషద్‌ వాదనలు వినిపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో పర్యావరణ శాఖ కార్యదర్శి అఫిడవిట్‌ దాఖలు చేశారన్నారు. నిమజ్జనాలపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, విగ్రహాల పరిమాణాలను నియంత్రించిందని చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది అనుమతిస్తున్నారో లేదో చెప్పాలంది. నగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను ఏం చేయాలనుకుంటున్నారంది. ఎన్ని విగ్రహాలను అందులో వేస్తారని, వాటితో దాన్ని నాశనం చేస్తారా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ గత రెండేళ్లుగా అనుమతించలేదని, ఈ ఏడాదిపై వివరణ తీసుకుని చెబుతానని తెలిపారు. అందుకు గడువు కావాలని కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని