కొవిడ్‌-19 పరీక్షలు: వుహాన్‌ వాసుల్లో ఆందోళన!

తాజా వార్తలు

Published : 17/05/2020 01:10 IST

కొవిడ్‌-19 పరీక్షలు: వుహాన్‌ వాసుల్లో ఆందోళన!

వుహాన్‌: కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వుహాన్‌ నగరంలో నిర్వహిస్తోన్న కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు అక్కడి స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం వుహాన్‌లో మరోసారి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్న వ్యక్తుల్లో వైరస్‌ లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో కొవిడ్‌-19 తీవ్రత తెలుసుకోవడంతోపాటు లక్షణాలు బయటిపడకుండా వైరస్‌ వాహకులుగా ఉన్నవారిని గుర్తించేందుకు భారీ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని తలపెట్టారు. దీనిలో భాగంగా నగరంలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాలు, క్లినిక్‌లతో పాటు ఇతర ప్రదేశాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో వైద్య పరీక్షలకు హాజరవుతున్నారు.

ఈ సమయంలోనే తమకు కూడా కరోనా వైరస్‌ సోకుతుందనే ఆందోళన వుహాన్‌ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. కోటికి పైగా జనాభా కలిగిన వుహాన్ నగరంలో ఇంత భారీ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడంతో చాలా చోట్ల ప్రజలు గుంపులుగా ఏర్పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పేర్కొంటున్నారు. తద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు ఎన్నడూలేని విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అధికారులకు, సిబ్బందికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా భారీ ఖర్చుతో కూడుకున్న ఈ కార్యక్రమం ద్వారా ఫలితాలు మాత్రం ఆశించినంతగా ఉండకపోవచ్చని మరికొందరు నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదనే ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉన్న వాలంటీర్లు కూడా అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి తాము సహకరిస్తామని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ, వీటిని సంబంధించి ఫలితాలను మాత్రం ఎప్పుడు తెలియపరుస్తారనే విషయాన్ని అధికారులు చెప్పడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో ఇప్పటివరకు 82,941 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 4633 మంది మృత్యువాతపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని