4.39 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేత!

తాజా వార్తలు

Published : 06/11/2020 23:56 IST

4.39 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేత!

వెల్లడించిన కేంద్రం

దిల్లీ: గడిచిన ఏడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 4.39కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులను ఏరివేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2013 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 4.39కోట్ల అర్హతలేని లేదా బోగస్‌ రేషన్ కార్డులను తొలగించినట్లు తెలిపింది. ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ.. సంస్కరణలు చేపడుతున్నట్లు కేంద్ర వినియోగదారుల, ఆహార మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతోపాటు, సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా లబ్దిదారుల సమాచారాన్ని ఆధునీకరించినట్లు అభిప్రాయపడింది. వీటిని ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా బోగస్‌, అనర్హత రేషన్‌ కార్డులను గుర్తించడం వీలయ్యిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అంతేకాకుండా వీటి ద్వారా రెండు కార్డులు, మరణించిన వారి, వలస వెళ్లిన వారి కార్డులను కూడా తొలగించడం సాధ్యమయిందని కేంద్రం పేర్కొంది.

జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) అమలులో భాగంగా కేవలం ఆర్హులైన లబ్దిదారులకే ప్రయోజనం చేకూర్చేందుకు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపింది. అయితే, అర్హులైన లబ్దిదారులకు ఈ రేషన్‌ కార్డులను ఇచ్చే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఇదిలాఉంటే, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 81.35కోట్ల మంది లబ్దిదారులకు సబ్సిడీతో కూడిన ఆహారధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం అందిస్తోంది. ఇందుకోసం ప్రతి ఏటా దాదాపు రూ.లక్షకోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెడుతోంది. ప్రస్తుతం వినియోగదారులు ఏ రాష్ట్రంలోనైనా రేషన్‌ తీసుకునే విధంగా ‘ఒకే దేశం-ఒకే రేషన్‌కార్డు’ విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తోన్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని