భారతీయ బాలికకు ఐరాస గౌరవ పదవి

తాజా వార్తలు

Published : 24/09/2020 00:53 IST

భారతీయ బాలికకు ఐరాస గౌరవ పదవి

సూరత్‌: భారత్‌కు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి ప్రాంతీయ రాయబారిగా ఎంపికయ్యారు. పర్యావరణ పరిరక్షణ అంటే ప్రాణం పెట్టే ఖుషీ చిందాలియా అనే ఈ బాలిక.. ‘టుంజా ఎకో జనరేషన్‌’ అనే ఈ కార్యక్రమ రాయబారిగా ఫిబ్రవరి 2021 వరకు ఈ గౌరవ పదవిలో ఉంటారు.

ఆ పచ్చదనం ఇక లేదు..

పర్యావరణ ప్రేమ, దానికి నష్టం కలిగిస్తే తలెత్తే పరిణామాల పట్ల అవగాహనే తనకు ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టిందని సూరత్‌కు చెందిన ఖుషీ వివరించింది. తమ ఊరు కాంక్రీట్‌ అరణ్యంగా మారిపోవడాన్ని చూసి తనకు  పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రేరణ లభించిందని ఆ బాలిక తెలిపింది. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం నేను మా ఊరికి వచ్చినపుడు మా ఇంటి దగ్గరున్న ఓ సపోటా చెట్టు నాకు స్నేహితురాలైంది. దాని మీద లెక్కలేనన్ని పక్షులుండేవి. నిజానికి ఆ ప్రాంతమంతా హరితమయమై ఉండేది. కానీ నేను పెరిగి పెద్ద అయ్యే క్రమంలో ఆ పచ్చదనమంతా మాయమై, మా ఊరు ఓ కాంక్రీట్‌ అడవిగా మారిపోయింది. నేను చూసి, ఆనందించిన పచ్చదనాన్ని నా చెల్లి ఎప్పటికీ చూడలేదని తెలిసి చాలా బాధ కలిగింది.’’ అని ఖుషీ వెల్లడించింది.

ఈ విధంగా జరగడానికి కారణమేమిటి, దీని నివారణకు ఏం చేయాలనే ఆలోచనలోనే తాను మునిగి ఉండేది. వస్త్ర వ్యాపారి బసంత్‌ చిందాలియా, బనితాల కూతురైన ఖుషీ కరోనా కాలంలో కూడా తనకు ఇష్టమైన పర్యావరణంపైనే పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా.. పర్యావరణం పట్ల సరైన స్పృహ కలిగిఉండేలా నా పిల్లలను నేను తీర్చి దిద్దాను.  ఖుషీకి ఇంత పెద్ద  అంతర్జాతీయ అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.’’ అని ఆమె తల్లి బినీతా చెప్పారు.
ఈ గౌరవ నియామకంతో ఖుషీకి పర్యావరణ ప్రాముఖ్యం, పరిరక్షణ, ఇందుకు భారత్‌ సహకారం గురించి ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు ఓ వేదిక లభిస్తుంది. అంతేకాకుండా ఈ అంశాలపై  ఇతర ప్రపంచ స్థాయి రాయబారులతో చర్చించేందుకు కూడా వీలు కలుగుతుంది. కాగా, యునెస్కో ప్రచురించనున్న ‘ఇయర్‌ 1 ఏసీ (ఆఫ్టర్‌ కరోనా వైరస్): ఎస్సేస్‌ బై 100 యంగ్‌ ఇండియన్స్’ (కరోనా వైరస్‌ తర్వాత మొదటి సంవత్సరం: 100 భారతీయ యువత వ్యాసాలు) అనే పుస్తకంలో ఖుషీ వ్యాసం చోటుచేసుకోనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని