Taliban Govt: తాలిబన్‌ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం..!

తాజా వార్తలు

Published : 02/09/2021 20:03 IST

Taliban Govt: తాలిబన్‌ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం..!

శుక్రవారం ప్రార్థనల అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం

కాబుల్‌: తాలిబన్‌ ఆక్రమిత అఫ్గానిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పాలనా వ్యవహారాలను చేపట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసిన తాలిబన్లు.. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తాలిబన్‌ వర్గాలు వెల్లడించాయి. కాబుల్‌లోని అధ్యక్ష భవనంలో ఈ కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ వెల్లడించారు.

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశ పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపామని తెలిపారు. ముఖ్యంగా సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. తాలిబన్‌ సర్కారు ఏర్పడ్డ తర్వాత రోజువారీ పరిపాలనా వ్యవహారాలను తమ రాజకీయ విభాగపు అగ్రనేత అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముందని తాలిబన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. పరిపాలన కోసం ఎలాంటి మండలి ఏర్పాటయినా.. దానికి అధినాయకుడిగా తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా ఉంటారన్నారు. అయితే, తాలిబన్‌ ఆధీనంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కాందహార్‌లో ఉన్న హైబతుల్లా అఖుంద్‌జాదాతోపాటు బరాదర్‌ త్వరలోనే బహిరంగంగా కనిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, రెండు దశాబ్దాల అనంతరం అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలు పూర్తిస్థాయిలో వెళ్లిపోయాయి. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అఫ్గాన్‌ను (ఆగస్టు 15న) తాలిబన్లు వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గడిచిన రెండు వారాలుగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ద్వారా అక్కడ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు తాలిబన్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

కాబుల్‌ విమానాశ్రయం తెరిచేందుకు ప్రయత్నాలు..

అమెరికా బలగాలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత కాబుల్‌ ఎయిర్‌పోర్టు రణరంగంగా మారింది. విమానాశ్రయం వద్ద బాంబుల దాడి ఘటనలతో ఆ ప్రాంతమంతా వణికిపోయింది. దీంతో ఆగస్టు 31 నుంచి కాబుల్‌ ఎయిర్‌పోర్టు పూర్తిగా మూతబడిపోయింది. అయితే, ఎయిర్‌పోర్టు తిరిగి తెరచుకునేలా తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కతర్‌ వర్గాలు పేర్కొన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని