బంగారు బుల్లోడు...

ప్రధానాంశాలు

Published : 01/08/2021 02:56 IST

బంగారు బుల్లోడు...

డ్రెసెల్‌ ఖాతాలో మూడో స్వర్ణం

టోక్యో: ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన డ్రెసెల్‌ పతక మోత మోగిస్తున్నాడు. శనివారం పురుషుల 100మీ. బటర్‌ఫ్లై ఫైనల్స్‌లో 49.45 సెకన్లలో రేసు పూర్తి చేసిన అతను ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలిచాడు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అతనే నెలకొల్పిన రికార్డు (49.50సె)ను ఇప్పుడు మెరుగుపర్చుకున్నాడు. మిలాక్‌ (హంగేరియా- 49.68సె), పోంటి (స్విట్జర్లాండ్‌- 50.74సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు.

కళ్ల జోడు జారి..: టోక్యోలో ఇంతకుముందే 100మీ. ఫ్రీస్టైల్‌, 4×100మీ. రిలే స్వర్ణాలను గెలుచుకున్న డ్రెసెల్‌కు ఓ విభాగంలో నిరాశ తప్పలేదు. ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన 4×100మీ. మెడ్లె రిలేలో అతను పోటీ పడగా.. ఇందులో అమెరికా కాంస్యం కూడా గెలవలేదు. బ్రిటన్‌ ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించింది. ఫైనల్లో 3 నిమిషాల 37.58 సెకన్లలో ఆ దేశ స్విమ్మర్లు లక్ష్యాన్ని చేరుకున్నారు. చైనా (3:38.86సె), ఆస్ట్రేలియా (3:38.95సె) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా (3:40.58సె) అయిదో స్థానంలో నిలించింది. ఈ రిలేలో ఇద్దరు చొప్పున పురుష, మహిళా స్విమ్మర్లు కలిసి పోటీపడతారు. ఒక్కో స్మిమ్మర్‌ ఒక్కో విభాగంలో 100మీ. పూర్తి చేయాలి. అమెరికా.. డ్రెసెల్‌ను ఫ్రీస్టైల్‌లో దించింది. అందులో మిగతా దేశాల నుంచి అమ్మాయిలే పోటీపడ్డారు. రెండో 100మీ. దూరాన్ని పూర్తి చేసేందుకు బ్యాక్‌స్ట్రోక్‌లో పోటీపడ్డ జకోబి డైవింగ్‌ చేసినపుడు కళ్లద్దాలు జారి నోటి దగ్గరకు వచ్చాయి. అలాగే ఈత కొనసాగించిన ఆమె ఒక్క నిమిషం 5.09 సెకన్లలో తన రేసు పూర్తి చేసింది. ఈ టైమింగే అమెరికాను దెబ్బకొట్టింది. చివరి 100మీ. రేసులో డ్రెసెల్‌ 46.99 సెకన్లలోనే రేసు పూర్తి చేసినా అమెరికాకు పతకం దక్కలేదు.


లెడెకీ  సిక్సర్‌

అమెరికా అమ్మాయి లెడెకీ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల 800మీ. ఫ్రీస్టైల్‌లో 8 నిమిషాల 12.57 సెకన్లలో రేసు పూర్తి చేసి విజేతగా నిలిచిన ఆమె.. ఒలింపిక్స్‌ చరిత్రలో ఆరు వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన తొలి మహిళా స్విమ్మర్‌గా రికార్డు సాధించింది. లెడెకీకి పోటీ ఇస్తుందనుకున్న టిట్మస్‌ (ఆస్ట్రేలియా- 8:13.83సె) రజతం గెలిచింది. సిమోనా (ఇటలీ- 8:18.35) కాంస్యం దక్కించుకుంది. వ్యక్తిగత విభాగంలో.. మహిళల 1500మీ. ఫ్రీస్టైల్‌తో కలిపి ఈ క్రీడల్లో రెండు వ్యక్తిగత స్వర్ణాలు నెగ్గిన లెడెకీ.. 2012 క్రీడల్లో ఓ పసిడి, 2016లో మూడు స్వర్ణాలు సొంతం చేసుకుంది. 800మీ. ఫ్రీస్టైల్‌లో ఆమె ఒలింపిక్స్‌ ఛాంపియన్‌గా నిలవడం ఇది వరుసగా మూడోసారి.


కేలీ.. మరోసారి

ఆస్ట్రేలియా స్విమ్మర్‌ కేలీ మెక్‌కియ్వాన్‌ మరో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. మహిళల 200మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో 2:04.68సె టైమింగ్‌తో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. మాసె (కెనడా- 2:05.42సె), ఎమిలీ (ఆస్ట్రేలియా- 2:06.17సె) తర్వాతి స్థానాల్లో నిలిచారు. కెలీకి టోక్యోలో ఇది రెండో స్వర్ణం. మరో ఆస్ట్రేలియా స్విమ్మర్‌ ఇప్పటికే రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం అయిదు పతకాలు గెలిచింది. ఆదివారం పోటీ పడే రెండు విభాగాల్లో గెలిస్తే ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు గెలిచిన తొలి మహిళా స్విమ్మరవుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన