అట్టడుగు వ్యక్తి అభ్యున్నతే మోదీ ధ్యేయం

ప్రధానాంశాలు

Updated : 18/09/2021 05:33 IST

అట్టడుగు వ్యక్తి అభ్యున్నతే మోదీ ధ్యేయం

భారత్‌ను శక్తిమంతంగా మార్చేందుకు జీవితాన్ని అంకితం చేశారు
ప్రధానిని కొనియాడిన భాజపా నేతలు
‘సేవ-సమర్పణ అభియాన్‌’ను ప్రారంభించిన నడ్డా
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, దేశ విదేశీ ప్రముఖులు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సహా... పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రులు, నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భాజపా శ్రేణులు దేశ వ్యాప్తంగా వేడుకలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాయి. గుజరాత్‌ సీఎంగా అందించిన సేవలు సహా, 20 ఏళ్ల మోదీ ప్రజాజీవితానికి గుర్తుగా... 20 రోజుల ‘సేవ-సమర్పణ అభియాన్‌’ను పార్టీ అధ్యక్షుడు నడ్డా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద దేశ వ్యాప్తంగా 14 కోట్ల రేషన్‌ కిట్లను పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలను, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన నడ్డా- ‘‘మోదీ... ప్రపంచంలోనే అత్యంత ప్రజాకర్షణ ఉన్న నేత. మునుపటి ప్రధానులెవరూ తీసుకోని సాహసోపేత నిర్ణయాలను ఆయన అమలుచేసి చూపించారు. భారత్‌ను శక్తిమంతమైన దేశంగా నిలిపేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. అట్టడుగు వ్యక్తి అభివృద్ధికి అహరహరం శ్రమిస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.

మున్ముందూ సేవలు అందించాలి..

మోదీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించాలని, అలుపెరగని స్ఫూర్తితో మున్ముందూ దేశానికి ఆయన సేవలు అందించాలని రాష్ట్రపతి కోవింద్‌ ఆకాంక్షించారు. ‘‘మోదీ అసాధారణ దార్శనికత, ఆదర్శప్రాయ నాయకత్వం, అంకితభావంతో కూడిన సేవాతత్వం... దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడింది. ఏడాదిగా నెలకొన్న ఎన్నో సవాళ్ల నడుమ... ఆయన చూపిన స్వావలంబన స్ఫూర్తి ఫలించింది’’ అని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా, బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలై లామా తదితరులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

చేయాల్సింది చాలా ఉంది: మోదీ

పుట్టినరోజు శుభాకాంక్షలు అసంఖ్యాకంగా వెల్లువెత్తడం తనను మాటలకందని ఆనందంలో ముంచెత్తిందని ప్రధాని మోదీ చెప్పారు. దేశం కోసం మరింత కష్టపడి పనిచేసేందుకు తనకు అవి శక్తినిచ్చాయన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపినవారికి కృతజ్ఞతలు చెబుతూ ఆయన శుక్రవారం వరుసగా ట్వీట్లు చేశారు. ‘‘సమ్మిళిత, శక్తిమంత భారత్‌ను సాకారం చేసుకోవడానికి, దేశాన్ని అభివృద్ధి పథాన పరుగులు పెట్టించడానికి మనం చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. ఆ దిశగా మన ప్రయాణం కొనసాగుతుంది’’ అని మోదీ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన