close

తాజా వార్తలు

వీడ్కోలు కళ తెలిసేదెలా?

ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ఎంఎస్‌ ధోనీ

‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా. బుల్లెట్టు దిగిందా లేదా..’ తెలుగు చిత్రసీమను ఊపేసిన డైలాగుల్లో ఇదొకటి. క్రికెట్లో మాత్రం అలా కాదు. అరంగేట్రం అదిరిపోవాలి. ప్రత్యర్థి గుండెల్లో బుల్లెట్లు దించాలి. ఇక కెరీర్‌కు శుభం పలకడం అంతకన్నా ముఖ్యం. విజయ్‌ మర్చంట్‌ చెప్పినట్టు ప్రజల చేత ‘ఇంకెప్పుడు’ అని కాకుండా ‘ఇప్పుడే ఎందుకు’ అనిపించుకోవాలి. కాలం గడిచే కొద్దీ మహీ ‘ఇంకెప్పుడు’ దశకు చేరుకుంటున్నాడేమో అనిపిస్తోంది. సన్నీలా ‘ఇప్పుడే ఎందుకు’ అనిపించుకొనే అందమైన కళ అతడికి అబ్బడం లేదా?


తప్పించుకోలేని దశ

ప్రతి క్రీడాకారుడు తప్పించుకోలేని దశ ఒకటుంటుంది. అదే ప్రాణంగా ప్రేమించిన ఆటకు వీడ్కోలు పలకడం. ఇన్నాళ్లూ తనకన్నీ ఇచ్చిన ఆటను వదిలేయడం అంత తేలికేమీ కాదు. ఎంతో  బాధ ఉంటుంది. ‘నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము’ అని అన్నమయ్య చెప్పినట్టు చివరికి ప్రతి ఒక్కరూ ‘ఆట’కు వీడ్కోలు పలకాల్సిందే. అద్భుతమైన ఆటగాళ్లతో నిండిన భారత క్రికెట్‌ రంగంలో కొందరు స్టార్లు మాత్రం దీనిని ఎందుకో అర్థం చేసుకోలేకపోతున్నారు. దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ తరహాలో అందంగా, ఘనంగా వీడ్కోలు పలికే కళ అందరికీ అబ్బదని చాలామంది అభిప్రాయం. 1987లో పాక్‌పై చిన్నస్వామిలో సన్నీ చివరి టెస్టు ఆడాడు. టర్నింగ్‌, బౌన్సీ పిచ్‌పై దాయాది బౌలర్లను ఎదుర్కొని 96 పరుగులు చేశాడు. అప్పుడతని వయసు 37. తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. మరో రెండేళ్లు ఆడగలడు. రిటైర్మెంట్‌ పలికి అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఇంకొన్ని రోజులు ఆడుంటే బాగుండేది అనిపించుకున్నాడు. ధోనీ పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు!!


దేశవాళీ ఆడటం లేదు

ప్రస్తుతం ధోనీ వయసు 38. రెండు నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. నవంబర్‌ వరకు అందుబాటులో ఉండడు! బంగ్లాదేశ్‌ సిరీస్‌కూ దూరమే. ఇప్పటికే సీనియర్‌, భారత్‌-ఏ జట్ల కోసం 45 రోజుల దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూలు, శిక్షణ, డోపింగ్‌ నిరోధ పరీక్షల ప్రణాళికలను బీసీసీఐ సిద్ధం చేసింది. ఇందులో ఎక్కడా ధోనీ పేరు లేదని సమాచారం. అంటే అతడు ఝార్ఖండ్‌ తరఫున విజయ్‌ హాజరే సైతం ఆడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితి, ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ‘ఎవరూ పంపించకుండానే అతడు వెళ్లిపోతాడని అనుకుంటున్నా. ధోనీకి ఆవల ఆలోచించాలి. అతడు కనీసం నా జట్టులోనూ లేడు’ అని గావస్కర్‌ చెప్పారంటేనే మహీ భవితవ్యం త్రిశంకు స్వర్గంలో ఉందని అర్థం.


అర్థం చేసుకోని కపిల్‌

గొప్ప క్రికెటర్లందరికీ సన్నీలా సరైన సమయం ఏదో తెలిసుండకపోవచ్చు. భారత్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన  కపిల్‌దేవ్‌ పరిస్థితే ఇందుకు సరైన ఉదాహరణ. తన మునుపటి పటిమ తగ్గాక, ఇలా ఆడుతున్నాడేంటీ అనుకునే సమయంలో 1991లో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కపిల్‌ వీడ్కోలు పలికాడు. తనలో వేగం తగ్గినా అలాగే కొనసాగాడన్న విమర్శలు ఉన్నాయి. అప్పటి సారథి అజహర్‌ అతడితో కొన్ని ఓవర్లు వేయించి బంతిని స్పిన్నర్లకు ఇచ్చేవాడు. ఆ కాలంలో అత్యంత వేగంగా బంతులు విసిరే పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌కు కపిల్‌ వల్లే మూడేళ్లపాటు టెస్టుల్లో చోటు దక్కలేదని కొందరి మాట. అతడికి సందేశం ఎలా పంపించాలో సెలక్టర్లకూ అర్థం కాలేదట. 10 ఏళ్లప్పుడు క్రికెట్‌ నేర్చుకొని, 20 ఏళ్లకు అరంగేట్రం చేసి 35 ఏళ్ల వరకు ఆడి ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతా మనం ఎందులో మెరుగో తెలుసుకోకపోతే ఎలా? అని ఓ సీనియర్‌ క్రికెటర్‌ ప్రశ్నిస్తున్నాడు.


గ్రహించిన దాదా, ద్రవిడ్‌

‘జట్టు నుంచి తప్పిస్తే చాలాసార్లు కోపం వస్తుంది. మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తుంది. క్రికెట్‌కు దూరం కావాలనుకున్నప్పుడు అందరికీ సచిన్‌లాంటి ఘనమైన వీడ్కోలు లభించకపోవచ్చు. తన గుర్తింపునకు తగిన ఫేర్‌వెల్‌ కావాలని మాత్రం ఎవరైనా భావిస్తారు. మనమొక గాలి బుడగలో జీవిస్తున్నాం. దానిలో సర్దుకుపోవడమే లేదు’ అని ఈ మధ్యే రిటైరైన ఓ క్రికెటర్‌ అన్నాడు. సన్నీలా కాకున్నా కొందరు క్రికెటర్లు ఈ దశను త్వరగా అర్థం చేసుకున్నారు. గ్రెగ్‌ ఛాపెల్‌ శిక్షణలో కష్టాలు పడ్డ గంగూలీ తన చివరి రెండేళ్లు అద్భుతంగా ఆడాడు. 2008, సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు రిటైరయ్యాడు. కొత్త టెస్టు సారథి ధోనీ, సెలక్టర్లు మళ్లీమళ్లీ తనను తప్పించొద్దనే భావంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2011లో ద్రవిడ్‌ సైతం అదే చేశాడు. సంకేతాలను ముందుగానే అర్థం చేసుకున్నాడు. ఓ మంచి టెస్టు సిరీస్‌ తర్వాత హఠాత్తుగా వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. ఆర్నెళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఘోర పరాజయంతో ఇక తాను పూర్తిగా నిష్ర్కమించాల్సిన అవసరం వచ్చిందని గ్రహించాడు.


 

త్రిశంకు స్వర్గంలో ధోనీ

సచిన్‌ తెందుల్కర్‌ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. అతడు శతకాలు చేయకపోయినప్పటికీ బాగానే పరుగులు చేశాడు. ఫిట్‌గానే కనిపించాడు. కొన్నాళ్ల తర్వాత వన్డే జట్టును యువరక్తంతో నింపాలని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సందీప్‌ పాటిల్‌ చెప్పడంతో 2012, డిసెంబర్‌లో సచిన్‌ వన్డేలకు వీడ్కోలు పలికాడు. భారత క్రికెట్‌ తమను దాటేసి ముందుకు వెళ్తోందన్న పరిస్థితిని వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌ ఆలస్యంగా గ్రహించారు. చాన్నాళ్లు అవకాశం కోసం ఎదురుచూశారు. సంకేతాలు గ్రహించి వీడ్కోలు పలికేశారు. ఇవన్నీ దాటేసిన స్థితిలో మహీ కనిపిస్తున్నాడు. ఎప్పుడేం చేయాలో ధోనీ బాగా తెలుసని అందరూ అంటారు. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన ‘మిస్టర్‌ కూల్‌’ మదిలో ఏముందో మాత్రం ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతడు ‘వీడ్కోలు కళ’ తెలుసుకోవాలని మాజీలు కోరుకుంటున్నారు. లేదంటే ఎంఎస్‌ ధోనీ సినిమాలో ‘మేమంతా సేవకులం. మేమంతా జాతీయ విధులను నిర్వర్తిస్తున్నాం’ అనే సంభాషణకు నేపథ్యం లాంటి పరిస్థితే రావొచ్చని అంటున్నారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.