close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పీఎస్‌ఎల్‌వీ కౌంట్‌డౌన్‌ ప్రారంభం

 భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం సోమవారం ఉదయం 9.27 గంటలకు జరుగుతుంది. దీనికి సంబంధించి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమయ్యింది. ఇది నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహకనౌక డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్‌తో పాటు, విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మూడు కక్ష్యల్లో వాటిని ప్రవేశపెట్టనుంది.

2. జగన్‌, మమత, నవీన్‌, మాయా, అఖిలేశ్‌ అంతా మనతోనే: కేటీఆర్‌

‘‘పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి, ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేశ్‌యాదవ్‌, మాయవతి.. ఇలా చాలామంది మనతోనే ఉన్నారు. మన మధ్యనే 150 సీట్లు వచ్చే అవకాశం ఉంది. దేశంలో ప్రసుత్తం భాజపాకు 150, కాంగ్రెస్‌కు 100 సీట్ల కంటే ఎక్కువగా వచ్చే పరిస్థితి లేదు. 16 మంది మన ఎంపీలు ఉంటే జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం మన నాయకుడు కేసీఆర్‌కు ఉంటుంది’’ అని  తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు.

3. తెదేపాకు సాయిప్రతాప్‌ రాజీనామా

 మూడేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, కనీస గౌరవం దక్కలేదని, అందుకే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ ప్రకటించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ చెల్లాచెదురైందని, ఆ నేపథ్యంలో గంటా, సి.ఎం రమేష్‌ల ప్రోద్బలంతో ముఖ్యమంతి చంద్రబాబు సూచనల మేరకు తెదేపాలో చేరానని సాయిప్రతాప్‌ చెప్పారు. రాజంపేట పార్లమెంట్‌ నియోజక వర్గానికి బాధ్యతలు తనకు అప్పగించారన్నారు. అదే సమయంలో తన అల్లుడు సాయి లోకేష్‌కు పార్లమెంట్‌ టిక్కెట్‌ అడిగామని, చంద్రబాబు పిలిచినపుడల్లా అమరావతికి వెళ్లినా సెకను కూడా మాట్లాడలేదని ఆరోపించారు.

4. తెలంగాణ అంతా జలంతో కళకళలాడాలి

 ‘‘ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందాలి. కాలువల ద్వారా వచ్చే నీళ్లు, వర్షం, నీళ్లు అన్ని చెరువులకూ మళ్లాలి. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. రాష్ట్రంలోని చెరువులు, కుంటలతో పాటు కాల్వలు, వాగులు, వంకలపై ఉన్న చెక్‌డ్యాంలలో నీరు నిల్వ ఉండాలి. తెలంగాణలోని భూమి అంతటా జలంతో కళకళలాడాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎస్‌ ఎస్‌కే జోషి, సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, హరిరాంలతో సీఎం సమీక్ష నిర్వహించారు.
5. ఆంధ్రప్రదేశ్‌లో బీమా ధీమా

కోడికత్తి పార్టీ అధికారంలోకి వస్తే వీధికో రౌడీ.. ఊరికో కబ్జాదారు పుట్టుకొస్తారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. తెదేపా తిరిగి అధికారాన్ని చేపడితే చంద్రన్న బీమాను రూ.10లక్షలకు పెంచుతామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద అందించే సాయాన్ని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామని, నచ్చిన కార్పొరేట్‌ ఆస్పత్రిలో పురుడు పోసుకుంటే అందుకయ్యే బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు. 

6. పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా పేర్కొన్నారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇంతియాజ్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు గాంధీభవన్‌లో కుంతియాను కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంతో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.

7. ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా విశ్వజిత్‌

ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు. విశ్వజిత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. విశ్వజిత్‌ 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. వైకాపా నేతల ఫిర్యాదు మేరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

8. నీరవ్‌ బెయిల్‌ కోసం కుక్కనూ వాడేశారు

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ(48)కి బెయిల్‌ మంజూరు చేయించడానికి ఆయన తరఫు న్యాయవాదుల బృందం చివరకు కుక్కను సైతం వదల్లేదు. కుక్క బాగోగులు చూసుకోవాల్సింది నీరవ్‌ మోదీయేనని, అందుకోసం బెయిల్‌ ఇవ్వాలని బారిస్టర్‌ క్లేర్‌ మాంట్‌గోమెరి అభ్యర్థించారు. బ్రిటన్‌లో పెంపుడు జంతువులపై ప్రజలు ప్రత్యేకాభిమానం చూపిస్తారని తెలిసిందే. నీరవ్‌ కుమారుడు లండన్‌లోనే చదువుతున్నాడని, త్వరలో విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందబోతున్నాడని, వృద్ధులైన తల్లిదండ్రులను సైతం చూసుకోవాల్సిన బాధ్యత నీరవ్‌పైనే ఉందని రకరకాల కారణాలు చెప్పారు.

9. జీఎస్‌టీ, ఐటీ కార్యాలయాలు నేడూ పనిచేస్తాయి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) చివరి రోజు కావడంతో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేసే నిమిత్తం ఆదివారం కూడా ఆదాయపు పన్ను, జీఎస్‌టీ కార్యాలయాలు పనిచేయనున్నాయి. శనివారం రోజూ వీటి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ‘పన్ను చెల్లింపుదార్లు పన్నులు చెల్లించేందుకు వీలుగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వారాంతంలో (మార్చి 30, 31 తేదీల్లో) కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డుకు (సీబీఐసీ) సంబంధించి అన్ని కార్యాలయాలు తెరిచే ఉంటాయ’ని సీబీఐసీ ఒక అధికారిక ప్రకటనను జారీ చేసింది.

10. విశాఖ మీదుగా 4 విమాన సర్వీసుల రద్దు

వేసవి రద్దీ మొదలవుతున్న సమయంలో విశాఖ నుంచి నిత్యం నడుస్తున్న పలు విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కోల్‌కతా-విశాఖ (సర్వీసు నెంబరు 6ఈ833), విశాఖ-కోల్‌కతా (6ఈ886), బెంగళూరు-విశాఖ (6ఈ622), విశాఖ-బెంగళూరు (6ఈ647) సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. చెన్నై నుంచి విశాఖ, భువనేశ్వర్‌ మీదుగా కోల్‌కతాకు వెళ్లాల్సిన సర్వీసు (6ఈ557)ను భువనేశ్వర్‌లో ఆగకుండా నేరుగా కోల్‌కతా వెళ్తుంది. దీంతో విశాఖ - భువనేశ్వర్‌ సేవలు ఆగిపోయాయి. తిరుగు ప్రయాణంలోనూ (6ఈ512) నేరుగా కోల్‌కతా నుంచి విశాఖకు వచ్చేలా చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.