close

తాజా వార్తలు

కాలుష్యంపైఫరెవర్‌ యుద్ధం!

విద్యార్థులు మార్కులకోసం కుస్తీపట్టడం సాధారణం. కానీ అమెరికాలో స్థిరపడిన పదిహేడేళ్ల తెలుగమ్మాయి చదువుతో పాటు సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ తనదైన ముద్రవేస్తోంది. పదిహేనేళ్లకే పెట్రోలియం రిఫైనరీల కాలుష్యంపై పరిశోధనలు చేసింది. ఎన్జీవోను ప్రారంభించి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నిర్వహణా చేస్తోంది. పర్యావరణహితమే ప్రధానాంశంగా అడుగులేస్తోన్న ఆమే రియా ఉప్పలపాటి.

మా అమ్మానాన్నలు అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడ్డారు. నాన్న సుహాస్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అమ్మ మధురిమ డాక్టరు. ప్రస్తుతం పన్నెండో తరగతి చదువుతున్నా. మా తాతయ్య ఉప్పలపాటి సుబ్బారావు హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టరుగా పనిచేసి పదవీవిరమణ పొందారు. నాపై ఆయన ప్రభావం ఎక్కువ. రెండేళ్ల క్రితం సమ్మర్‌ ప్రాజెక్టులో భాగంగా ‘ఎఫెక్ట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఆన్‌ ఎకానమీ’ అనే అంశంపై పరిశోధన చేశా. నా పరిశోధనలు కేవలం చదువుకోవడానికి మాత్రమే పరిమితం కాకూడదని నా ప్రొఫెసర్లు సూచించారు. ఈ క్రమంలో కొన్ని పెద్ద కంపెనీల సీఈవోలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నా. అప్పుడే ఆర్థిక వ్యవస్థను పర్యావరణ కాలుష్యం ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకున్నా. కాలుష్య నివారణకు నావంతు కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే ‘ఫరెవర్‌ ఎర్త్‌’ పేరుతో ఓ ఎన్జీవోను ప్రారంభించా. ఇలాంటి ఆలోచనలే కలిగిన మరికొందరిని కలుసుకున్నా. మేమంతా కలిసి, ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం.

పుస్తకాలూ రాశా... పర్యావరణ కాలుష్యం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై పరిశోధన పత్రాలు సమర్పించా. ‘ఇన్‌ మై బ్యాక్‌యార్డ్‌’ పేరుతో ఆయిల్‌ రిఫైనరీ కంపెనీల ద్వారా వెలువడుతున్న ఉద్గారాలపై ఓ పుస్తకం రాశా. దీనిలో అవి మానవాళికి, పర్యావరణానికి ఎలా చేటు చేస్తున్నాయనే అంశాలు ఉన్నాయి. ఈ పుస్తకం మంచి పేరు తీసుకొచ్చింది. ఇది ఆన్‌లైన్‌లోనూ దొరుకుతుంది. ప్రస్తుతం ఆసుపత్రులతో వ్యర్థాల నిర్వహణకోసం సంప్రదింపులు జరుపుతున్నా. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల్ని సరైన పద్ధతుల్లో రీసైక్లింగ్‌ చేయకపోతే ప్రమాదకర రసాయనాలు వెలువడి ప్రాణాలు పోయే అవకాశమూ ఉంది. అలాంటి వాటిని మేం సేకరిస్తున్నాం. కొన్ని పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఎక్కడవి అక్కడే రీసైక్లింగ్‌ చేస్తున్నాం. వాటినుంచి తయారైన ఉత్పత్తులనూ మేం విక్రయిస్తున్నాం. ఇలా వచ్చిన ఆదాయాన్ని అవగాహనా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని ఎలా నివారించాలో స్థానిక వ్యాపారులు, చిన్న సంస్థలకి చెబుతున్నాం.

అవార్డులూ వచ్చాయి... అట్లాంటా ట్వంటీ అండర్‌ 20- బెస్ట్‌ ఇన్నొవేటర్స్‌ విభాగంలో పదో స్థానంలో నిలిచా. ‘అట్లాంటా ఇన్నో- యంగ్‌ టాలెంట్‌’ అవార్డూ అందుకున్నా. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా... చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. 0.1 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించిన అమెరికన్‌ కాలేజ్‌ టెస్టింగ్‌ పరీక్షలో వందశాతం స్కోరు సాధించా. ప్రస్తుతం యూనివర్సిటీ అడ్మిషన్‌కోసం వేచిచూస్తున్నా. ఇప్పటికే పాఠశాలకు నిధుల సేకరణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించా. మాకు వచ్చే నిధులు, పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బు, ఖాళీ సమయాల్లో పనిచేస్తూ సంపాదించిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తున్నా. గతంలో హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఓ పేద విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పి నెలవారీగా కొంతమొత్తం చెల్లిస్తున్నా. పాఠశాల స్థాయి విద్యార్థులనే మా కార్యక్రమాలకు వాలంటీర్లుగా నియమించుకుంటాం. భవిష్యత్తు తరాలకు వీరు మార్గదర్శకులుగా నిలవాలనేది నా ఆలోచన.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.