close

ప్రధానాంశాలు

కారు ముగ్గులు.. కేసీఆర్‌ పతంగులు

ప్రచారం వినూత్నంగా సాగాలి
కేటీఆర్‌ సూచన
మోదీ, రాహుల్‌కు మేం భయపడం
తప్పు చేస్తే తరతమ భేదాల్లేకుండా వేటు తప్పదని స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌ : తెరాసకు నరేంద్రమోదీ అన్నా రాహుల్‌గాంధీ అన్నా భయం లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చెప్పారు. తమ బాస్‌లు దిల్లీలో వారు కాదని, ఇక్కడి గల్లీ ప్రజలేనన్నారు. భాజపా ఆరువందలకు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలపలేకపోయినా భయపడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హుజూర్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్థికన్నా తక్కువ ఓట్లు తెచ్చుకొని, చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని లక్ష్మణ్‌ మరిచిపోవద్దన్నారు. పింఛన్లలో కేంద్రం వాటా గురించి భాజపా నేతలు అబద్ధాలు చెబుతున్నారన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో పురపాలక సంఘాలకు ఎక్కువ నిధులిచ్చామంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాలు చేశారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి, ఉన్నది ఉన్నట్లు, అనుకున్నది అనుకున్నట్లు చెప్పడానికి సామాజిక మాధ్యమాలు చక్కటి వేదికలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్‌ చెప్పారు. సోమవారం తెలంగాణభవన్‌లో తెరాస సామాజిక మాధ్యమాల విభాగ సభ్యులతో మంత్రి మాట్లాడారు.‘సామాజిక మాధ్యమాలు శక్తిమంతమైనవిగా మారాయి.ప్రజల్లో ఏ బలం లేకున్నా కొన్ని పార్టీలు పెయిడ్‌ ఆర్టిస్టులతో హడావిడి చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో 11 లక్షలు, ట్విటర్‌లో 3.6 లక్షల మంది మన పార్టీని అనుసరిస్తున్నారు. ఇతర పార్టీలేవీ మనకు దరిదాపుల్లో లేవు. కొన్ని పార్టీలు చిచ్చు పెట్టేందుకే సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నాయి. మనం వాస్తవాలను వివరించాలి. ఎన్నికల సందేశం ప్రతి గడపకి వెళ్లాలి. 3,148 వార్డులు, డివిజన్ల అభ్యర్థుల ఫోన్‌ నంబర్లు ఇస్తాం. వారందరికీ సమాచారం చేరాలి.కాంగ్రెస్‌ హయాంలో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్త పురపాలక చట్టం అమలు నా ముందున్న బాధ్యత. చట్టం అమలులో తరతమ భేదాలుండవు. ఎవరైనా తప్పు చేస్తే తొలగిస్తాం. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణాల అనుమతులు.. స్వీయ ధ్రువీకరణ చట్టం(టీఎస్‌బీపాస్‌)తో అవినీతి చీడ రూపుమాపుతాం.  సామాజిక మాధ్యమాల సైనికులకు గుర్తింపు, గౌరవం ఇస్తాం. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగాలి. ప్రతి ఇంటి ముందు కారుగుర్తు ముగ్గులేయాలి.కేసీఆర్‌ బొమ్మలతో పతంగులు ఎగరవేయాలి’’

సమన్వయకర్తల నియామకం
క్రిశాంక్‌, సతీష్‌రెడ్డి, పాటిమీది జగన్‌మోహన్‌రావు ,దినేశ్‌చౌదరిలను సామాజిక మాధ్యమాల సమన్వయకర్తలుగా కేటీఆర్‌ నియమించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పురపాలక సమన్వయకర్తలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, తదితర నేతలు పాల్గొన్నారు.

టీఎస్‌బీపాస్‌పై కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి
ఈనాడు, హైదరాబాద్‌: పారదర్శక, సత్వర, అవినీతి రహితంగా భవన నిర్మాణ అనుమతుల జారీ కోసం  ప్రభుత్వం రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు, స్వీయధ్రువీకరణ చట్టం (టీఎస్‌బీపాస్‌)ని తెస్తోంది. ఇది పురపాలక ఎన్నికల్లో తెరాసకు లబ్ధి చేకూరుస్తుందని కేటీఆర్‌ విశ్వసిస్తున్నారు.మంత్రి ఆదేశాల మేరకు దీని ముసాయిదాను సోమవారం ఎమ్మెల్యేలకు పంపించారు. తెలంగాణ పురపాలక చట్టం,-2019 కు అనుగుణంగా లేఅవుట్లు, భవనాల ద్వారా భూ అభివృద్ధికి అవసరమైన వివిధ అనుమతుల జారీ కోసం దీనిని ఉద్దేశించారు. 75 చదరపు గజాల వరకు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదని.. దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని,  500 చదరపు మీటర్ల వరకు స్థలం, 10 మీటర్ల ఎత్తు వరకు స్వీయధ్రువీకరణ ద్వారా తక్షణ భవన నిర్మాణ అనుమతి.. నివాసేతర  భవనాలకు అనుమతులు 21 రోజుల్లో మంజూరు.. తదితర అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.