
తాజా వార్తలు
జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదు
టీమ్ఇండియాపై ఇంజమామ్ ప్రశంసలు
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాను సొంత గడ్డపై టీమ్ఇండియా ఓడించడం అద్భుతమని, తన జీవితంలో ఇలాంటి జట్టును ఎప్పుడూ చూడలేదని పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ 2-1 తేడాతో ఆసీస్‌పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానల్లో స్పందించిన ఇంజమామ్.. భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్ఇండియా చరిత్రలో ఇంత పెద్ద విజయం ఎప్పుడూ లేదని చెప్పాడు. భారత జట్టు ఎన్నో విజయాలు సాధించినా అందులో ఇది ప్రత్యేకమని కొనియాడాడు.
టెస్టుల్లో అనుభవమే లేని ఆటగాళ్లు ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టును వారి సొంత గడ్డ మీద ఓడించడం విశేషమని ఇంజమామ్ ప్రశంసించాడు. సిరాజ్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్.. ఇలా రాణించిన ఎవరికీ పెద్దగా అనుభవం లేదన్నాడు. పైగా టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేయడం అంత తేలిక కాదన్నాడు. కోహ్లీ, బుమ్రా, అశ్విన్, జడేజా లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా చివరి మ్యాచ్‌లో యువకులు బాగా ఆడారన్నాడు. డ్రా గురించి ఆలోచించకుండా గెలుపుకోసం ఆడడం ప్రశంసనీయమన్నాడు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె నాయకుడిగా సత్తా చాటాడని మెచ్చుకున్నాడు.
మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైని, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లాంటి ఆటగాళ్ల వెనక భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని ఇంజమామ్ గుర్తు చేశాడు. ఈ ఆటగాళ్లంతా అండర్-19 స్థాయిలో ఉండగా ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడని, దాంతో వాళ్లంతా ఆటలో రాటుదేలారని ఇంజమామ్ అన్నాడు. ద్రవిడ్ భారత జట్టుకు ఆడేటప్పుడు ఎక్కడైనా, ఏ స్థానంలోనైనా ఎంతో మానసిక స్థైర్యంతో ఆడేవాడని ఇంజమామ్ పేర్కొన్నాడు. అలాగే భారత విజయంలో హెడ్‌కోచ్ రవిశాస్త్రి సేవల్ని అందరూ మర్చిపోయారని, అతడి వల్లే భారత్ సిరీస్ గెలిచిందని ఇంజమామ్ అభిప్రాయపడ్డాడు. ఆటపై అతడికి మంచి పరిజ్ఞానం ఉందని, దాంతో నైపుణ్యం గల ఆటగాళ్లను పట్టుకోవడంలో అతడు సిద్ధహస్తుడని తెలిపాడు. అడిలైడ్ ఓటమి తర్వాత నిరుత్సాహ పడకుండా శాస్త్రి జట్టును ముందుకు తీసుకెళ్లాడని పాక్ మాజీ సారథి ప్రశంసించాడు.
ఇవీ చదవండి..
ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే