close
ఐపీఎల్‌-12 ఫైనల్‌  హైదరాబాద్‌లో.. 

ఖరారు చేసిన బీసీసీఐ 
వైజాగ్‌లో రెండు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు 
దిల్లీ

అనుకున్నదే అయింది. ఐపీఎల్‌ 12వ సీజన్‌ తుది పోరుకు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. చెన్నైలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను భాగ్యనగరానికి తరలిస్తూ బీసీసీఐ సోమవారం నిర్ణయం తీసుకుంది. అనుకోకుండా విశాఖపట్నానికి కూడా ఐపీఎల్‌ ఆతిథ్య అవకాశం దక్కడం విశేషం. ఇక్కడ రెండు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. 
హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు మరోసారి ఐపీఎల్‌ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కనుంది. మే 12న చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్‌-12 తుది పోరును బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) ఉప్పల్‌ స్టేడియానికి తరలించింది. చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే చెపాక్‌ స్టేడియంలో దీర్ఘకాలంగా నడుస్తున్న స్టాండ్స్‌ గొడవకు తెరపడకపోవడంతో ఫైనల్‌ను అక్కడి నుంచి తరలించాలని సీఓఏ నిర్ణయించింది. ప్లేఆఫ్‌ దశలో తొలి క్వాలిఫయర్‌ మాత్రం చెన్నైలోనే జరిగే అవకాశాలున్నాయి. ఐతే అందుకు ఆ జట్టు లీగ్‌ దశ పూర్తయ్యేసరికి పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలవాల్సి ఉంటుంది. ఆ స్థితిలో తొలి క్వాలిఫయర్‌ చెపాక్‌లోనే జరుగుతుంది. లేదంటే దాన్ని కూడా తరలించే అవకాశముంది. లీగ్‌ దశలో సీఎస్‌కే టాప్‌-2లో నిలిస్తే క్వాలిఫయర్‌ చెన్నైలోనే జరుగుతుందని ప్రకటించిన సీఓఏ.. లేని పక్షంలో ఎక్కడికి తరలిస్తారన్నది వెల్లడించలేదు. ప్లేఆఫ్‌ దశలో మిగతా రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వబోతుండటం విశేషం. నిరుడు చెన్నై ఛాంపియన్‌గా నిలిచి, హైదరాబాద్‌ రన్నరప్‌ అయిన నేపథ్యంలో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను ఈ రెండు నగరాల్లోనే నిర్వహించాల్సి ఉంది. కానీ చెన్నైలో స్టేడియం సమస్య ఉండగా.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లేవీ నిర్వహించరాదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో మే 8, 10 తేదీల్లో జరగాల్సిన ఎలిమినేటర్‌, రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను విశాఖకు కేటాయించారు. గతంలోనూ ఇలా వేరే వేదికల్లో సమస్యలు, ఇతర కారణాలతో విశాఖ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. చెపాక్‌ స్టేడియంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) నిర్మించిన మూడు స్టాండ్స్‌ విషయంలో వివాదం ఉంది. 2012లో నిర్మించిన ఈ స్టాండ్స్‌కు చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి నిరాకరించింది. దీంతో 12 వేల సామర్థ్యం ఉన్న ఈ స్టాండ్స్‌ అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో మ్యాచ్‌ జరిగిన ప్రతిసారీ ఈ స్టాండ్స్‌ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఐతే టీఎన్‌సీఏ ఈ సమస్యను వారం రోజుల్లోపు పరిష్కరించుకోని పక్షంలో ఐపీఎల్‌ ఫైనల్‌, ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను తరలిస్తామని రెండు వారాల కిందట సీఓఏ అల్టిమేటం విధించింది. గడువు ముగిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మ్యాచ్‌లను తరలిస్తూ సీఓఏ నిర్ణయం తీసుకుంది.

మహిళల మినీ ఐపీఎల్‌ 6 నుంచి

గత ఏడాది మహిళల కోసం ప్రయోగాత్మకంగా ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌ నిర్వహించిన బీసీసీఐ.. ఈసారి వారి కోసం నాలుగు మ్యాచ్‌లు కేటాయించింది. మూడు జట్లు పోటీ పడే ఈ లీగ్‌ను మహిళల మినీ ఐపీఎల్‌గా పేర్కొంటున్నారు. భారత, విదేశీ మహిళా క్రికెటర్లతో మూడు జట్లను రూపొందించి ఈ లీగ్‌ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు జైపుర్‌లో మే 6-10 తేదీల మధ్య జరుగుతాయి. నిరుడు ఆడిన ట్రయల్‌బ్లేజర్స్‌, సూపర్‌నోవాస్‌కు తోడు వెలాసిటీ అనే కొత్త జట్టును లీగ్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.