close

ప్రధానాంశాలు

ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలి

కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు

కొవ్వూరు డివిజన్‌ స్థాయి సమావేశం

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు

 

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం అన్ని శాఖల అధికారులతో డివిజన్‌ స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, వ్యవసాయ, పురపాలక శాఖలపై పథకాల వారీగా సమీక్షించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 25 లక్షల గృహనిర్మాణాలు చేపట్టడమే లక్ష్యమన్నారు. గతంలో వచ్చినవి, స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. తహశీల్దారు, ఉప తహశీల్దారు నేతృత్వంలో ప్రతి మండలంలో రెండు బృందాలు ఏర్పాటవుతాయని, అన్ని గ్రామాల్లోనూ పర్యటించి స్థలాలను సేకరించాలన్నారు. ప్రభుత్వ భూమి, గతంలో కేటాయించి ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే గ్రామానికి సమీపంలో రాకపోకలకు అనువుగా ఉన్న ప్రైవేటు భూమిని సేకరించాలన్నారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 2500 ఎకరాలు అవసరం కానుందన్నారు. ర్యాంపుల్లో పారదర్శకంగా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోను చేసి తహశీల్దారు ద్వారా సులభంగా ఇసుక పొందవచ్చన్నారు. అర్హులైన కౌలు రైతులందరికీ సకాలంలో రుణాలందించేందుకు బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్షించామన్నారు. బోగస్‌ కార్డులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రతి ఇంటికీ నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. సంయుక్త కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి రెవెన్యూ, గృహనిర్మాణ, వ్యవసాయ శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. సమావేశంలో కొవ్వూరు ఆర్డీవో బండి నవ్య, గృహనిర్మాణ శాఖ పీడీ రామచంద్రారెడ్డి, డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లు, వ్యవసాయం, గృహనిర్మాణ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

‘స్పందన’పై ముఖ్యమంత్రి అభినందనలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పశ్చిమలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమ నిర్వహణను ముఖ్యమంత్రి అభినందించారని కలెక్టర్‌ ముత్యాలరాజు అన్నారు. సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన ఉదయం 11 నుంచి 12.15 గంటల వరకు ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో స్పందన కార్యక్రమ నిర్వహణ బాగుందని, వాటిలో పశ్చిమకు స్థానం దక్కిందని చెప్పారన్నారు. ఇదే స్ఫూర్తితో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించే కార్యాచరణతో ఉన్నామని కలెక్టర్‌ తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.