అమ్మ మనసు - Sunday Magazine
close

అమ్మ మనసు

సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌లో అమ్మలకోసం ఏర్పడ్డ సమూహం ‘తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌’. వేలమంది ఇందులో సభ్యులుగా చేరి తమ కష్టసుఖాలను కలబోసుకుంటూ, అనుభవాలను పంచుకుంటూ, కొత్త అమ్మలకు సలహాలూ సూచనలూ ఇస్తూ సందడి చేస్తుంటారు. ఆ బృంద సభ్యులే తమ మాతృమూర్తులను తలచుకుంటూ మనసులో పెల్లు బికిన భావాలకు అక్షరరూపం ఇచ్చిన సంకలనం ఇది. ‘అమ్మ’ అంటే ఇలా ఉండాలి అంటూ సమాజం కొన్ని గుణగణాలను నిర్దేశించింది కానీ అమ్మ అనే నాణానికి ‘బొమ్మ- బొరుసు’ రెండూ ఉండొచ్చంటుంది ఒక కథ. మా అమ్మ నిజంగా ‘మమతల మూట’ అని ఒక కూతురు చెబితే, ‘అమ్మా... నీలా నేను’ పిల్లల్ని మంచి నడవడికతో పెంచడమే కాదు, చదువు కొనసాగిస్తాను, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానంటూ హామీ ఇస్తుంది ఇంకో కూతురు. తలచుకోగానే తల్లీ కూతుళ్లిద్దరూ ఒకరినొకరు కలలో చూసుకున్న వైనం ‘అమ్మకల’ అయితే, ‘ఆడపిల్లలకు చదువెందుకు...’ అనే రోజుల్లో కష్టపడి చదివి డాక్టరై పల్లె ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న ఒక తల్లికి కూతురూ తన బాటలోనే నడవడం చూసి సంతోషంతో ‘మనసు తడి’ కావడం మరో కథ. మొత్తంగా ఇందులో రచనలన్నీ అమ్మతనానికి ఉన్న బహుముఖాల్ని పరిచయం చేస్తాయి.

- పద్మ
 

అమ్మంటే (కథలు, వ్యాసాలు, కవితలు)
సంకలనకర్త: ప్రదీప్తి విస్సంశెట్టి
పేజీలు: 232; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 8096310140


రామానుజుని కథ

న్యాయశాస్త్ర నిపుణులూ అధ్యాపకులూ అయిన ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ ఈ పుస్తకం రాయడానికి బీజం ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే పడింది. బహుమతిగాగెలుచుకున్న ‘సిద్ధపురుషులు’ అనే పుస్తకంలో రామానుజుని గురించి చదివినపుడు మొదలైన ఆలోచన ఆయనను ఆ దిశగా ఎన్నోపర్యటనలూ పరిశోధనలూ చేయించింది.  మామయ్య మాటలు, నారాయణుని 108 దివ్యదేశాల పర్యటన, తిరుగోష్ఠియూర్‌ గోపురంపైన రామానుజుని విగ్రహదర్శనం... ఒక్కో ఘటనా ఒక్కో అడుగు ముందుకు వేయించగా రూపుదిద్దుకున్న ఈ గ్రంథం రామానుజుని సంపూర్ణ జీవితం గురించి సమగ్రంగా వివరిస్తుంది. వేయేళ్ల కిందట జన్మించిన జగద్గురువు, అంబేద్కర్‌ ప్రశంసలు పొందిన మతగురువు... ఎవరీయన- అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. శ్రీపెరుంబుదూరులో పుట్టి, మూడు భాషల్లో నిష్ణాతుడై, నవరత్నాలను అందించి, 120 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని ధర్మరక్షణకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి రామానుజుడు. విద్య అందరిదీ అనీ, అన్నానికి కులభేదాలు ఉండకూడదనీ, సంవాదమే సమస్యకు పరిష్కారమనీ, ఊరి చెరువు అందరిదీ అనీ, ఆలయ ప్రవేశానికి అర్హతలు అక్కర్లేదనీ... చెప్పి సమానతను చాటిన రామానుజుడు ఆధునిక భావాలకు ఆద్యుడంటారు రచయిత.

- శ్రీ

రామానుజ మార్గం
రచన: ప్రొ.మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు
పేజీలు: 432; వెల: రూ.450/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


కథల అలలు

పాత, కొత్త సాహిత్యకారులు సృష్టించిన 120 కథల బృహత్‌ సంకలనమిది. 12 మంది సీనియర్‌ రచయితల కథలను విభిన్న నేపథ్యాంశాలుగా విభజించి వాటిలో ఒదిగేలా 108 మంది సమకాలీన రచయితల కథలను ఇందులో పొదిగారు. తనికెళ్ల భరణి సినీ పరిశ్రమలోకి రాకముందు రాసిన కథ, యండమూరి వీరేంద్రనాథ్‌తో పాటు ఆయన సోదరుడు కమలేంద్రనాథ్‌ రాసిన కథలతో పాటు మల్లాది, వంశీ, యర్రంశెట్టి శాయి,భువనచంద్ర, బ్నిం, ఖదీర్‌ బాబు, మంథాభానుమతి, అత్తలూరి విజయలక్ష్మి లాంటి ప్రసిద్ధుల రచనలు ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రాసిన కథలనూ ఇందులో చేర్చారు. అనుబంధాలనూ మానవ సంబంధాలనూ ఆసక్తికరమైన కథలుగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రశంసనీయం. మూడు తరాల కథకుల సృజనకు అద్దంపట్టే అరుదైన సంకలనం ఇది. ఈ సంకలనం కోసమే కొందరు తొలి కథలు రాయడం విశేషం. కాలం విడదీసినా ప్రేమ ఇగిరిపోని జంట గాథ ‘బొట్టు’. విజయానందాన్ని పంచుకునే మనిషి కోసం రోజంతా తహతహలాడిన విభిన్న వ్యక్తి ‘ఊయల’లో తారస పడతాడు. మంచి చేస్తే తప్పక మంచి జరుగుతుందని నమ్మకం పెంచే కథ ‘తాతమ్మ తాయెత్తు’. ఇలా ఎన్నో రచనలు వైవిధ్యంతో ఆకట్టుకుంటాయి. వేర్వేరు దేశాల్లో నివసిస్తూ కూడా పుస్తకం కోసం ఒక్కతాటి మీదికి వచ్చిన వీరంతా సాహితీప్రియులు దాచిపెట్టుకోదగ్గ సంకలనాన్ని వెలువరించడం విశేషం.

- సీహెచ్‌.వేణు

      క్షీరసాగరంలో కొత్త కెరటాలు
   120మంది సాహితీవేత్తల కథా సంకలనం
పేజీలు: 424; వెల: రూ. 300/-
ప్రతులకు: ఫోన్‌- 8558899478


సంవేదన

దశాబ్ద కాలంలో రాసిన వందలాది కవితలనుంచి కొన్నిటిని ఎంచి ప్రచురించిన పుస్తకం ఇది. ‘అక్షరం’ నిత్య అసంతృప్తవాది అయితే, ‘పదం’ అసహనంతో తండ్లాడే తాపసి అనీ, ‘వాక్యం’ అభద్రతతో బాధపడే లోకసంచారి అనీ పేర్కొన్న కవి తనకర్థమైనంత వరకూ కవిత్వం మాత్రం ఒంటరే, కవితాసృజనే ఒంటరీకరణ... అని సిద్ధాంతీకరిస్తారు. వర్షం కురిస్తే- ఇన్నాళ్లుగా నిర్వేదంగా, నిర్లిప్తంగా బండబారిన కొండలు/ ఒక్కసారిగా ఎంత తేజోవంతమైనాయనీ/ ఇంటి కోడిపెట్ట, తెల్లపిల్లి, కలుగులోని ఎలుక... అన్నీ పునర్‌ పునర్జన్మ పొందినట్లే ఉంటే ‘నాగరికుడు’ మాత్రం వానచుక్క ఒంటిని తడపకుండా నడుస్తున్న వైనాన్ని ఎత్తిచూపుతారు. ‘ప్రతివాడికి తనకోసం ఒక గది ఉండాలి/ పల్లకి
ఎక్కేవాడిలోనో, మోసేవాడిలోనో/ తనను తడుముకోవడానికి...’ అంటూ ‘అంతర్లోకం’లో రాసుకుంటారు. ‘సముద్రం మరొక్కసారి ఒంటరైంది’ అంటూ ప్రేమగా, ఆర్తిగా ఒంటరితనాన్ని కౌగిలించుకుంటూ సరికొత్త భావనాప్రపంచంలోకి తలుపులు తెరుస్తారు. మరోచోట ‘ఎప్పుడూ ఇక్కడ ఏమీలేదు. ఇంతకాలంగా ఏదో ఉందనుకున్న అనుభవ జ్ఞానం కూడా’ అని తాత్వికత వ్యక్తంచేస్తారు.

- సుశీల

ఒంటరీకరణ(కవిత్వం)
రచన: మామిడి హరికృష్ణ
పేజీలు: 106; వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న