Education News: బీటెక్‌ చేస్తూ డిగ్రీ చదవొచ్చా?

బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) రెండో ఏడాది చదువుతున్నాను. ఆన్‌లైన్‌లో బీఏ తెలుగు లేదా తమిళ డిగ్రీ చేయాలనుంది. ఈ కోర్సు ఎక్కడుంది?

Published : 06 Jun 2024 00:34 IST

బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) రెండో ఏడాది చదువుతున్నాను. ఆన్‌లైన్‌లో బీఏ తెలుగు లేదా తమిళ డిగ్రీ చేయాలనుంది. ఈ కోర్సు ఎక్కడుంది? బీటెక్‌ చేస్తూ డిగ్రీ చదివితే ఇబ్బందా?

వి.హర్ష

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నారు కాబట్టి ఆ కోర్సుకు సంబంధించిన సబ్జెక్టులో మరో డిగ్రీ చదివితే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. మీరు ఇంజినీరింగ్‌తో పాటు రెండో డిగ్రీని ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆ డిగ్రీ మీ కెరియర్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొన్ని సందర్భాల్లో రెండు విభిన్న సబ్జెక్టుల్లో డిగ్రీలు చేస్తే ప్రాంగణ నియామకాల్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఒకవేళ మీకు తెలుగు/ తమిళ భాషపై ఆసక్తి ఉండి దానిపై అధ్యయనం చేయాలనుకుంటే నిరభ్యంతరంగా బీఏ తెలుగు/ తమిళం చదవొచ్చు. కానీ బీఏలో తెలుగు, తమిళ సబ్జెక్టులు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు. దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీల్లో మాత్రమేఉన్నాయి. మీరు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో రెండో డిగ్రీ చేయాలనుకుంటే ఐఐటీ మద్రాస్‌ నుంచి ఆన్‌లైన్‌ బీఎస్సీ డేటా సైన్స్‌ చదివే ప్రయత్నం చేయండి. లేదా ఎలాగూ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నారు కాబట్టి మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కోర్సు చేయాలనుకుంటే బీబీఏ చేయొచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగళూరులో ఆన్‌లైన్‌ బీబీఏ (డిజిటల్‌ బిజినెస్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌ షిప్‌) కోర్సు అందుబాటులో ఉంది. బీటెక్‌తో పాటు, ఐఐఎం బెంగళూరు లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ నుంచి బీబీఏ చేయడం వల్ల మీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

బీటెక్‌ చేస్తూ మరో డిగ్రీ చదివితే ఎలాంటి ఇబ్బందీ లేదు. యూజీసీ నిబంధనల ప్రకారం కూడా రెండు డిగ్రీలు ఒకే సమయంలో చేసే అవకాశం ఉంది. కాకపోతే- ఒకటి రెగ్యులర్‌గానూ, మరొకటి ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌ పద్ధ్దతిలోనూ చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉదయం, మధ్యాహ్నం/ సాయంత్రం షిఫ్ట్‌లో రెండు కళాశాలల నిర్వహిస్తూ ఉంటే ఒకే సమయంలో రెండు రెగ్యులర్‌ కోర్సులు చదివే అవకాశం కూడా ఉంది. మూడేళ్లపాటు రెండు కోర్సులను సమర్థంగా చదవడానికి ప్రేరణ, నిబద్ధత, పట్టుదల చాలా అవసరం. చివరిగా ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవాలంటే టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు కూడా ముఖ్యం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని