విదేశాల్లో పీహెచ్‌డీ ఎలా?

ఎంబీఏ తర్వాత పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన అభినందనీయం. కానీ, ఎంబీఏ, పీహెచ్‌డీలు అత్యుత్తమ విద్యాసంస్థల్లో చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతర్జాతీయ ర్యాంకుల్లో మెరుగైన స్థానంలో ఉన్న మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ఎంబీఏ చేసినవారు విదేశాల్లో నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు.

Updated : 05 Oct 2022 03:01 IST

విజయవాడలో ఎంబీఏ చదువుతున్నాను. తర్వాత పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పొందిన మాస్టర్స్‌ డిగ్రీతో విదేశీ యూనివర్సిటీలకు దరఖాస్తు చేయొచ్చా? ఎంబీఎ పూర్తి చేశాక ఏ ఉద్యోగాలుంటాయి?

- తేజస్వి

* ఎంబీఏ తర్వాత పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన అభినందనీయం. కానీ, ఎంబీఏ, పీహెచ్‌డీలు అత్యుత్తమ విద్యాసంస్థల్లో చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతర్జాతీయ ర్యాంకుల్లో మెరుగైన స్థానంలో ఉన్న మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ఎంబీఏ చేసినవారు విదేశాల్లో నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎంబీఏ చదివిన కళాశాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లేనట్లయితే, విదేశాల్లో మరో పీజీ చేసి, పీహెచ్‌డీ చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో పీజీ... ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి, మీరు ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసి, ఆర్థికంగా స్థిరపడ్డాక విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఐరోపా దేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు మాత్రం మన పీజీతో కూడా పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తున్నాయి.
సాధారణంగా విదేశాల్లో పీహెచ్‌డీ చేసేవారికి చాలా ఫెలోషిప్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని ఐఐటీలు, ఐఐఎంలు విదేశీ యూనివర్సిటీలతో కలిసి జాయింట్‌ పీహెచ్‌డీ చేసే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. అందులో భాగంగా కనీసం రెండు సంవత్సరాలు విదేశీ యూనివర్సిటీలో పరిశోధన చేసుకోవచ్చు. అలా కాకుండా, మనదేశంలోనే ఏదైనా యూనివర్సిటీలో ప్రముఖ ప్రొఫెసర్‌ పర్యవేక్షణలో కనీసం రెండు నాణ్యమైన పరిశోధన పత్రాలను అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించి, మంచి పరిశోధనాంశంతో విదేశాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసినట్లయితే మరో పీజీ చేయకుండానే, పూర్తి ఫెలోషిప్‌తో పరిశోధన చేయవచ్చు. ఎంబీఏ తరువాత మీరు ఇక్కడే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం యూజీసీ నిర్వహించే నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత అవసరం. ప్రైవేటు రంగానికొస్తే- ఎంబీఏలో మీ స్పెషలైజేషన్‌కు అనుగుణమైన కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని