గ్రూపు బైపీసీ... సాఫ్ట్‌వేర్‌లోకి ఎలా?

డిగ్రీలో కంప్యూటర్‌కు సంబంధించిన చాలా కోర్సులు చదవాలంటే ఇంటర్‌లో మ్యాథమెటిక్స్‌ చదివి ఉండాలి. మీకు బిజినెస్‌/కామర్స్‌ సబ్జెక్టులపై ఆసక్తి ఉంటే బీకామ్‌ కంప్యూటర్స్‌ కానీ, బీబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కానీ, బీకామ్‌ డేటా సైన్స్‌ కానీ చదవొచ్చు.

Published : 07 Nov 2022 00:56 IST

ఇంటర్‌ (బైపీసీ) చదివాను. సాఫ్ట్‌వేర్‌ రంగమంటే ఆసక్తి. డిగ్రీ పూర్తవగానే ఈ రంగంలో ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఏ కోర్సు చదవాలి?

- మేఘశ్యామ్‌

* డిగ్రీలో కంప్యూటర్‌కు సంబంధించిన చాలా కోర్సులు చదవాలంటే ఇంటర్‌లో మ్యాథమెటిక్స్‌ చదివి ఉండాలి. మీకు బిజినెస్‌/కామర్స్‌ సబ్జెక్టులపై ఆసక్తి ఉంటే బీకామ్‌ కంప్యూటర్స్‌ కానీ, బీబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కానీ, బీకామ్‌ డేటా సైన్స్‌ కానీ చదవొచ్చు. బిజినెస్‌ అనలిటిక్స్‌, డేటా సైన్స్‌ కోర్సులు చదవాలంటే మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ లాంటి సబ్జెక్టులపై గట్టి పట్టు ఉండాలి. అలాకాకుండా మీరు బీఎస్సీ డిగ్రీ చదవాలనుకొంటే డిగ్రీలో బయాలజీ, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులతో పాటుగా కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి సబ్జెక్టులు ఉండేలా చూసుకోండి. మీకు డిగ్రీ పూర్తవ్వడానికి మరో మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి, ఈ మూడు సంవత్సరాల్లో డిగ్రీతో పాటు జావా, సీ, సీ ప్లస్‌ ప్లస్‌, పీహెచ్‌పీ, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌ లాంటి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లను నేర్చుకోండి. వీటితో పాటుగా ఎంఎస్‌ ఎక్సెల్‌లో కూడా నైపుణ్యం సంపాదించండి. మీరు డిగ్రీ చివరి సంవత్సరంలోకి వచ్చాక సీనియర్‌లనూ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నవారినీ సంప్రదించి త్వరగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందాలంటే ఎలాంటి ప్రత్యేక కోర్సులు చేయాలో తెలుసుకొని, వాటిలో శిక్షణ పొందితే మీ లక్ష్యం నెరవేరుతుంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని