సివిల్స్‌కు ప్రయత్నించాలని...

ఎంబీఏ చేసి రెండేళ్లు మార్కెటింగ్‌ జాబ్‌ చేశాను. ఇప్పుడు ఉద్యోగం మానేసి సివిల్స్‌ కోచింగ్‌ తీసుకోవాలనుకుంటున్నా.

Updated : 07 Nov 2023 04:06 IST

ఎంబీఏ చేసి రెండేళ్లు మార్కెటింగ్‌ జాబ్‌ చేశాను. ఇప్పుడు ఉద్యోగం మానేసి సివిల్స్‌ కోచింగ్‌ తీసుకోవాలనుకుంటున్నా. నాకు 28 ఏళ్లు. ఈ వయసులో ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందా?

పి.కార్తీక్‌

సివిల్స్‌ రాయడానికి జనరల్‌ కేటగిరికి చెందినవారికి 32 సంవత్సరాలు నిండేవరకు గరిష్ఠంగా 6 అవకాశాలు, ఓబీసీ కేటగిరికి చెందినవారికి 35 ఏళ్లు నిండేవరకు 9 అవకాశాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి వారికి 37 ఏళ్లు నిండేవరకు అపరిమిత అవకాశాలుంటాయి. అదేవిధంగా జనరల్‌/ ఓబిసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల దివ్యాంగులకు 42 సంవత్సరాలు నిండేవరకు 9 అవకాశాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి దివ్యాంగులకు 42 సంవత్సరాలు నిండేవరకు అపరిమిత అవకాశాలుంటాయి. ముందుగా, పై వాటిలో మీ కేటగిరికి ఎన్ని అవకాశాలున్నాయో తెలుసుకోండి. మీరు సివిల్స్‌ నిర్ణయాన్ని 28వ ఏట తీసుకున్నారు కాబట్టి, ఇప్పటినుంచి కనీసం నాలుగేళ్లు.. అంటే 32 సంవత్సరాలు నిండే వరకు మరో ఆలోచన లేకుండా, సివిల్స్‌ సన్నద్ధత మీదే దృష్టి పెట్టాలి. సివిల్స్‌లో కొన్ని వందల ఉద్యోగాలకు లక్షల మంది దరఖాస్తు చేస్తారు. కాబట్టి, పోటీ చాలా ఎక్కువ.

సివిల్స్‌ రాయాలనే నిర్ణయం తీసుకొనేముందు... 1) మీకు సివిల్స్‌ తప్ప మరే ఉద్యోగమూ చేయలేనంత బలమైన ఇష్టం ఉందా? 2) వచ్చే నాలుగేళ్ల పాటు మీ ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకుంటారు?  3) ఒకవేళ సివిల్స్‌ సాధించడంలో విఫలమైతే మీముందు ఏ ప్రత్యామ్నాయాలున్నాయి? 4) జయాపజయాలతో సంబంధం లేకుండా సివిల్స్‌ లక్ష్యంతో కొన్నేళ్లపాటు ప్రయాణించగల ఓపిక ఉందా? 5) కొన్ని సంవత్సరాలపాటు రోజుకు కనీసం 15 గంటలు చదవగలిగే సామర్థ్యం మీకుందా?. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోండి.

సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించడమనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. అతి కొంతమంది మాత్రమే మొదటి ప్రయత్నంలో విజయం సాధిస్తే, మరికొంతమంది రెండు/మూడు/నాలుగో ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు తమకు అర్హత ఉన్న అవకాశాలన్నీ పూర్తయినా విజయం సాధించలేకపోతున్నారు. కానీ సివిల్స్‌కు సన్నద్ధమైనవారు ఇది కాకపోయినా ఇతర పోటీ పరీక్షల్లో విజయ సాధించి మెరుగైన ఉద్యోగాలు పొందగల్గుతున్నారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని