సర్కారీ కొలువుకు దారేది?

రెండేళ్ల కిందట బీటెక్‌ పూర్తిచేశాను. ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలంటే ఎలా సన్నద్ధం కావాలి?

Published : 06 Mar 2024 00:08 IST

రెండేళ్ల కిందట బీటెక్‌ పూర్తిచేశాను. ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలంటే ఎలా సన్నద్ధం కావాలి?

రమణ

మీరు బీటెక్‌లో ఏ బ్రాంచి చదివారో, ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేశారో చెప్పలేదు. మీ ఆశయం కేంద్రప్రభుత్వ ఉద్యోగమా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమా? చేరదలిచింది ప్రభుత్వరంగ సంస్థల్లోనా? బ్యాంకుల్లోనా? అనే విషయంపై స్పష్టత అవసరం. ఒక్కో ఉద్యోగానికి ఒక్కొరకమైన సన్నద్ధత ఉండాలి. కానీ, ప్రాథమికంగా ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా పోటీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కనీసం రెండు సంవత్సరాలు పట్టుదలతో చదవడం తప్పనిసరి. చాలా పోటీ పరీక్షలకు పాఠశాల/ కళాశాలల్లో చదివిన ప్రాథమిక అంశాలపై అవగాహన ఎంతో అవసరం.

యూనివర్సిటీ పరీక్షలకూ, ఉద్యోగ పోటీ పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. బోర్డు/ యూనివర్సిటీ పరీక్షల్లో ప్రశ్నలను నేరుగా ఇస్తే, పోటీ పరీక్షల్లో అనువర్తనం (అప్లికేషన్‌)పై అడుగుతారు. చాలా నియామక పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌, కరెంట్‌ అఫైర్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ భాగంగా ఉంటాయి. మరికొన్ని పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్‌, తెలుగు భాషల పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తారు. పోటీ పరీక్షల్లో సరైన సమాధానాన్ని తక్కువ సమయంలో గుర్తించే నైపుణ్యం చాలా ముఖ్యం. కొన్ని పోటీ పరీక్షల్లో తప్పు సమాధానానికి రుణాత్మక  మార్కులుంటాయి.

ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల సరళి పూర్తిగా మారిపోయింది. గతంలో ప్రశ్నలు నేరుగా వచ్చేవి. ఇప్పుడు స్టేట్‌ మెంట్ల రూపంలో, జతపరిచే పద్ధ్దతిలో, ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉండే ప్రశ్నలు ఇస్తున్నారు. వీటితో పాటు సమకాలీన సామాజిక/ చరిత్రాత్మక అంశాలపై ఒక పేరా ఇచ్చి, దానికి సంబంధించిన ప్రశ్నలను ఇవ్వడం సాధారణం అయింది. కొన్ని పోటీ పరీక్షలను రెండు, మూడు దశల్లో నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తున్నారు. మరికొన్ని పరీక్షలకు మొదటి దశలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలనూ, రెండో దశలో వ్యాసరూప ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా, సమస్య పరిష్కార పద్ధతుల్లో అడుగుతున్నారు. మరికొన్ని కొలువులకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటోంది. మీరు రాయబోయే పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి మీ సన్నద్ధతను మొదలు పెట్టండి. పోటీ పరీక్షలకు చదివేప్పుడు అర్థం చేసుకొని, సొంతంగా నోట్సు రాసుకుంటూ నేర్చుకుంటే, విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. రాయాలనుకొంటున్న పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నవారినీ, గతంలో ఇదే ఉద్యోగం సాధించినవారినీ తరచుగా కలుస్తూ, చర్చిస్తూ సన్నద్ధతలో మెలకువలు తెలుసుకోండి. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాసి విజయావకాశాలను మెరుగుపర్చుకోండి. సర్కారీ కొలువు సాధించాలన్న బలమైన ఆశయం ఉండి, ప్రణాళికబద్దంగా చదివితే, లక్ష్యం సుసాధ్యమే.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని