నటనలో శిక్షణ కోర్సులు ఎక్కడ?

బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌) గత ఏడాది పూర్తిచేశాను. నటన అంటే చాలా ఇష్టం. దీంట్లో కోర్సులు ఏ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి?

Published : 12 Mar 2024 00:11 IST

బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌) గత ఏడాది పూర్తిచేశాను. నటన అంటే చాలా ఇష్టం. దీంట్లో కోర్సులు ఏ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి? 

ఎ.వేణు

  • నటన అంటే చాలా ఇష్టం అన్నారు. కానీ  ఇప్పటివరకు మీరు నటన ఎక్కడైనా నేర్చుకొన్నారా, ఏమైనా సాధన చేశారా? పాఠశాల, కళాశాలల్లో నటించిన అనుభవం ఉందా? కొన్ని శిక్షణ సంస్థలు నటనకు సంబంధించిన ప్రోగ్రాంలో ప్రవేశం కల్పించడానికి నటనలో పూర్వానుభవం కూడా ఉండాలని ఆశిస్తాయి. నటనలో ప్రాథమిక కోర్సులు చేయాలనుకుంటే- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో వివిధ స్టూడియోల నుంచి కూడా నటనకు సంబంధించిన అనేక స్వల్పకాలిక వర్క్‌షాపులు ఉన్నాయి. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా, రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌స్టడీస్‌, మధు ఫిలిం ఇన్‌స్ట్టిట్యూట్‌, మయూఖ మొదలైన సంస్థల్లో ఫిల్మ్‌ యాక్టింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఏదైనా నట శిక్షణ సంస్థలో చేరేముందు, ఆ సంస్థ విశ్వసనీయత తెలుసుకోండి. మీకు ఇప్పటికే థియేటర్‌ యాక్టింగ్‌లో కొంత శిక్షణ, అనుభవం ఉంటే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, బెంగళూరులో ఒక సంవత్సరం యాక్టింగ్‌ కోర్సు చేయొచ్చు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా దిల్లీలో మూడేళ్ల ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణేలో రెండేళ్ల యాక్టింగ్‌ కోర్సు ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలు థియేటర్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. నటనలో రాణించాలంటే.. నైపుణ్యాలతో పాటు అనుభవం, సామర్థ్యం, పరిజ్ఞానం కూడా చాలా అవసరం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని