ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రవేశపరీక్ష ఎప్పుడు?

తెలంగాణలోని ఏ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు ఉంది? ప్రవేశపరీక్ష ఎప్పుడు ఉంటుంది?

Published : 13 Mar 2024 00:04 IST

తెలంగాణలోని ఏ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు ఉంది? ప్రవేశపరీక్ష ఎప్పుడు ఉంటుంది?

పి.మేఘమాల

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) సంస్థ నాలుగు సంవత్సరాల వ్యవధి ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (ఐటెప్‌)కు రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో సైన్స్‌, హ్యుమానిటిస్‌, కామర్స్‌ విభాగాల్లో ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం తెలంగాణలో ఎన్‌ఐటీ వరంగల్‌ (బీఎస్సీ బీఈడీ)లో, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ- హైదరాబాద్‌ (బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, బీకామ్‌ బీఈడీ)లో, గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ-లక్సెట్టిపేట (బీఏ బీఈడీ)లో గత విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాంను ఉర్దూ మీడియంలో మాత్రమే అందిస్తున్నారు.

ఈ ప్రోగ్రాంలో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ) ఫర్‌ అడ్మిషన్‌ టు ఫోర్‌ ఇయర్‌ ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంకు దరఖాస్తు చేయాలి. ప్రవేశ పరీక్షలో మెరుగైన ప్రతిభ కనపర్చి నచ్చిన విద్యాసంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన త్వరలో వెలువడుతుంది.

ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హతగా ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతను నిర్ణయించారు. ఈ ప్రవేశ పరీక్ష 160 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. అభ్యర్థి ఎంచుకున్న రెండు భాషల నుంచి 40 ప్రశ్నలు (ఒక్కో భాష నుంచి 20 ప్రశ్నలు), టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 20 ప్రశ్నలు, 25 మార్కులతో జనరల్‌ టెస్ట్‌, మూడు డొమైన్‌ స్పెసిఫిక్‌ సబ్జెక్టుల నుంచి 75 ప్రశ్నలు (ఒక్కో సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నలు) ఉంటాయి. ఈ ప్రవేశ పరీక్షను ఇంగ్లిష్‌, ఉర్దూలతో పాటు తెలుగు సహా మరో 11 భారతీయ భాషల్లో  నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ సందర్శించండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని