ఏది ఎంచుకోవాలి?

ఆపరేషన్స్‌ ఇంజినీర్‌గా పదేళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నా. తర్వాత ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో దేన్ని ఎంచుకోవచ్చు?

Published : 18 Mar 2024 00:30 IST

ఆపరేషన్స్‌ ఇంజినీర్‌గా పదేళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నా. తర్వాత ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో దేన్ని ఎంచుకోవచ్చు? వీటిని దూరవిద్యలో చదవొచ్చా?

ఎస్‌.రవిశంకర్‌

మీరు ఇంజినీరింగ్‌ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్నారని అనుకుంటున్నాం. బీబీఏను రెగ్యులర్‌గా చదువుతున్నారా? దూరవిద్యలోనా? ఆపరేషన్స్‌ ఇంజినీర్‌గా ఏ సంస్థలో, ఏ విభాగంలో పనిచేశారో/ పని చేస్తున్నారో చెప్పలేదు. యూనివర్సిటీలు ఇచ్చే ఎంబీఏ డిగ్రీకీ, ఏఐసీటీఈ అనుమతి ఉన్న రెండేళ్ల పీజీడీఎంకూ మధ్య తేడా లేదు. ఎంబీఏ డిగ్రీని ప్రభుత్వ/ ప్రైవేటు / డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీలు ఇస్తే, పీజీడీఎం సర్టిఫికెట్‌ను మీరు చదివిన విద్యాసంస్థ ఇస్తుంది. కొంతకాలం క్రితం వరకు ఐఐఎంలు కూడా పీజీడీఎం సర్టిఫికెట్‌ను మాత్రమే ఇచ్చేవి. ఇప్పటికీ ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న చాలా బిజినెస్‌ స్కూల్స్‌ పీజీడీఎం సర్టిఫికెట్‌ని ఇస్తున్నాయి. అందుకని మీరు ఎంబీఏ చేసినా, రెండేళ్ల పీజీడీఎంను రెగ్యులర్‌గా చేసినా మీ ఉద్యోగావకాశాలకు ఇబ్బంది లేదు.

ఎంబీఏ డిగ్రీని దూరవిద్యా విధానంలో కూడా చదవొచ్చు. ఎంబీఏ కానీ, పీజీడీఎం కానీ అత్యుత్తమ విద్యాసంస్థ నుంచి చేస్తేనే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశాలు ఎక్కువ. చాలా ప్రైవేటు విద్యాసంస్థలు ఒక సంవత్సరం పీజీడీఎం సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నాయి. కానీ అలాంటి డిప్లొమాలు ఎంబీఏకు సమానం కాదు. పీజీడీఎం చదివి, భవిష్యత్తులో పీహెచ్‌డీ చేయాలనుకుంటే కొన్ని యూనివర్సిటీలు మీ పీజీడీఎం ప్రోగ్రాం, ఎంబీఏ ప్రోగ్రాంకు సమానం అని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) ఇచ్చిన ధ్రువపత్రాన్ని అడుగుతున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు ఈ ధ్రువపత్రం అవసరం లేదు. మీకు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఎంబీఏ/ పీజీడీఎం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌లకు సంబంధించిన ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌ విధానంలో చదివితే, నైపుణ్యాలు పెరగడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు