వైద్య కళాశాలల ఎంపికకు ముందు...

ఏదైనా వైద్య కళాశాలను ఎంచుకొనే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌కు వచ్చే రోగుల సంఖ్య, ఆ హాస్పిటల్‌లో ఉన్న ప్రత్యేక వైద్య విభాగాలు, పనిచేస్తున్న అధ్యాపకుల అనుభవం, నైపుణ్యాలు- ఇవీ ముఖ్యమైనవి.

Published : 21 Mar 2024 00:25 IST

మా అబ్బాయి నీట్‌కు సన్నద్ధం అవుతున్నాడు. తెలంగాణలో టాప్‌ టెన్‌ కళాశాలలు ఏమున్నాయి?

సుష్మాదేవి

దైనా వైద్య కళాశాలను ఎంచుకొనే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌కు వచ్చే రోగుల సంఖ్య, ఆ హాస్పిటల్‌లో ఉన్న ప్రత్యేక వైద్య విభాగాలు, పనిచేస్తున్న అధ్యాపకుల అనుభవం, నైపుణ్యాలు- ఇవీ ముఖ్యమైనవి. టాప్‌ టెన్‌ మెడికల్‌ కళాశాలల జాబితా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కొద్ది సంవత్సరాలుగా నీట్‌లో మెరుగైన ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఎంచుకొన్న కళాశాలలను బట్టి అంచనాకు రావచ్చు. నీట్‌లో మంచి ర్యాంకులు పొందిన వారు చదువుతున్న కాలేజీలను ఆధారంగా చేసుకొని మాత్రమే ఇచ్చే ఈ వివరాలు అవగాహన కోసం మాత్రమే ఉపయోగించుకోండి. ఈ జాబితాలో లేని చాలా కాలేజీల్లో కూడా నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది.

తెలంగాణా రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీలు అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. ఆ తరువాత కాకతీయ- వరంగల్‌, ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ- హైదరాబాద్‌లలో చేరుతున్న విద్యార్థుల ర్యాంకులు దాదాపుగా సమానంగా ఉంటున్నాయి. రిమ్స్‌- ఆదిలాబాద్‌, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ- నిజామాబాద్‌లు దాదాపుగా ఒకే స్థాయిలో ఉన్నాయి. సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు సమాన స్థాయిలో ఉన్నాయి. నల్గొండ, సూర్యాపేట గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల్లో చేరే విద్యార్థుల ర్యాంకులు ఒకే శ్రేణిలో ఉంటున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలలకొస్తే - హైదరాబాద్‌లోని అపోలో, కామినేని, మమతా మెడికల్‌ కాలేజీలు చెప్పుకోదగ్గవి. ఇంకా మమతా మెడికల్‌ కాలేజీ- ఖమ్మం, ఎస్‌విఎస్‌ మెడికల్‌ కాలేజీ- మహబూబ్‌నగర్‌, కామినేని మెడికల్‌ కాలేజీ- నార్కట్‌పల్లిలు విద్యార్థుల ప్రాధాన్య క్రమంలో ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాల సరళిని గమనిస్తే హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ/ ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మెడికల్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు, నైపుణ్యాలు, మెలకువలను కూడా అందించే విద్యా సంస్థలను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు